ఓ మరమనిషీ...రిక్షా లాగేసి పో!!

ఓ మరమనిషీ...రిక్షా లాగేసి పో...నీతో సెల్‌ఫోన్‌ జతచేసి..కమాండ్స్‌తో కాళ్లే కదిపించి బ్యాటరీతో బలమే ఇచ్చి...చెమటే రాని దేహంతో..అలసట ఎరుగని శ్రమతో...

Published : 17 Apr 2023 00:44 IST

ఓ మరమనిషీ...రిక్షా లాగేసి పో...నీతో సెల్‌ఫోన్‌ జతచేసి..కమాండ్స్‌తో కాళ్లే కదిపించి బ్యాటరీతో బలమే ఇచ్చి...చెమటే రాని దేహంతో..అలసట ఎరుగని శ్రమతో...నడవడం, రిక్షాలాగడం నీకే నేర్పే నేర్పున్న విజ్ఞానం...నెరవేరే ప్రయత్నం....ఓ మరమనిషీ...రిక్షా లాగేసి పో....!!

ఏంటి నేస్తాలూ...! రోబో సినిమా పాటకు పేరడీలా ఉందని ఆలోచిస్తున్నారు కదూ! అవును నిజమే. చిట్టిలాంటి రోబో ఒకటి రిక్షా లాగుతూ తెగ సందడి చేస్తోంది. చూసిన వారు అవాక్కయ్యేలా, విన్నవారు ఆశ్చర్యచకితులయ్యేలా... రోడ్ల మీద చక్కర్లు కొడుతోంది. ఇదంతా ఎక్కడో విదేశాల్లో కాదు. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో. శివమ్‌ మౌర్య అనే బీటెక్‌ విద్యార్థి తన బృందంతో కలిసి ఈ రోబోను తయారు చేశారు. వీళ్లు చాలాకాలం నుంచి రోబోల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఈ అన్నయ్య తాను పదో తరగతిలో ఉన్నప్పటి నుంచే ఈ రంగంలో పనిచేయడం మొదలు పెట్టాను అని చెబుతున్నారు.

ఇంకా పూర్తి కాలేదు...

‘నిజానికి ఈ రిక్షా రోబో ఇంకా పూర్తి కాలేదు. బ్యాటరీ సాయంతో ఇది నడుస్తుంది. పరీక్ష కోసం ఇలా రోడ్డు మీదకు తీసుకొచ్చాం. ఇంతలోనే ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి’ అంటున్నారు శివమ్‌ మౌర్య అన్నయ్య. మొత్తం మానవ శరీరాన్ని అధ్యయనం చేసి ఈ రోబోను తయారు చేశారు. ఇందుకోసం ఈ బృందానికి 25 రోజులు పట్టింది. ఈ రోబోకు సంబంధించి ఇంకాస్త పని మిగిలి ఉంది.

ఇది ఏఐ!

ఇది ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో పని చేస్తుంది. పూర్తిగా ఆటోమేటిక్‌. మనం చెప్పిన విషయాలను విని అర్థం చేసుకుంటుంది. ఈ రోబోను ఫోన్‌ సాయంతో నియంత్రించవచ్చు. ఫోన్‌లో మెసేజ్‌ పెడితే... దాన్ని అనుసరించి ఈ మరమనిషి పనిచేస్తుంది. ఈ రోబోలను ఆసుపత్రులు, వస్తువుల రవాణా, సైన్యంలోనూ వాడుకోవచ్చని ఈ బృందం చెబుతోంది. మొత్తానికి రోబో సినిమాను రియల్‌గా చూసినట్లు ఉంది కదూ! నేస్తాలూ! ఇవీ.. రిక్షాలాగే రోబో విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని