ఈ దీవి.. స్వచ్ఛమైన తేనెకు చిరునామా!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు తేనెటీగల గురించి తెలుసు కదా.. అవి పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించి, తేనెను తయారు చేస్తాయని పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. అయితే, ఒక దీవిలో దొరికే తేనెను..

Published : 18 Apr 2023 00:07 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు తేనెటీగల గురించి తెలుసు కదా.. అవి పువ్వుల నుంచి మకరందాన్ని సేకరించి, తేనెను తయారు చేస్తాయని పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. అయితే, ఒక దీవిలో దొరికే తేనెను.. ఈ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనదిగా పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ దీవి ఎక్కడుందో, అక్కడి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా.!

గ్నేయ పసిఫిక్‌ మహాసముద్రంలో ‘ఈస్టర్‌ ఐలాండ్‌’ అనే దీవి విసిరేసినట్లుగా ఉంటుంది. ఇది చిలీకి అతి సమీపంలో ఉంటుంది. ఈ దీవిలోని రైతులు ఇప్పటికీ పురాతన పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తుంటారు. చీడపీడల నివారణకు ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడరట. దాంతో ఆ ప్రాంతంలో దొరికే తేనె అత్యంత స్వచ్ఛమైందిగా చెబుతున్నారు.

ప్రత్యేక లక్షణాలు..

ఇప్పుడు ఎక్కడ చూసినా.. వ్యవసాయంతోపాటు తేనెటీగల పెంపకంలోనూ అనేక రసాయనాలు వినియోగిస్తున్నారు కదా! అలా వివిధ రకాల మందులు వాడి, సాగు అవుతున్న పువ్వుల పైన వాలుతూ.. తేనెటీగలు ఉత్పత్తి చేసే తేనెలోనూ ఎంతో కొంత ఆ రసాయనాల అవశేషాలు ఉంటూనే ఉంటాయి. అంతేకాదు.. ఆ మందులతోపాటు వాతావరణ మార్పుల వల్ల కూడా తేనెటీగలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నాయట. కానీ, ‘ఈస్టర్‌ ఐలాండ్‌’లో మాత్రం ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. పూర్తిగా పర్యావరణహిత మార్గంలో సాగు చేస్తుండటంతో ఇక్కడి తేనెటీగలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయట. అంతేకాదు.. ఈ భూమి మీదున్న వేరే ఏ తేనెటీగలతోనూ వీటికి పోలిక కూడా లేదని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, ఈ దీవిలోని తేనెటీగల ప్రత్యేకతను కాపాడుకునేందుకు వాటి పెంపకందారులు ముందుకొచ్చారు. వేరే ప్రాంతాల నుంచి తేనెటీగల దిగుమతిని నిషేధించేలా అక్కడి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు.

దాదాపు ఆరు రెట్లు అధికం  

ఈ దీవిలో నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందట. వర్షం నీటిని వృథాగా పోనివ్వకుండా.. ఇక్కడి ప్రజలు ప్రత్యేక పద్ధతుల్లో నిల్వ చేస్తుంటారు. ఇక్కడి మరో విశేషం ఏంటే.. అధిక తేమతో కూడిన వాతావరణం. ఈ కారణంతోనే ఇక్కడి తేనెటీగలకు ఏడాది పొడవునా పని ఉంటుందట. అలాగే, వీటి ఉత్పాదన సామర్థ్యం కూడా ఎక్కువే. ఏడాది కాలంలో ఒక తేనెటీగల సమూహం సుమారు 90 నుంచి 120 కిలోల తేనెను ఉత్పత్తి చేయగలవు. అదే సమూహ పరిమాణంలోని మిగతా ప్రాంతాల వాటి సామర్థ్యం మాత్రం కేవలం 20 కిలోల లోపేనట. అంటే.. ఇతర వాటితో పోలిస్తే ఈస్టర్‌ ఐలాండ్‌ తేనెటీగలు దాదాపు ఆరు రెట్లు తేనెను అధికంగా తయారు చేయగలవన్నమాట. అదీ చాలా స్వచ్ఛమైంది కావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని