చిటికెన వేలంత చిరుజీవిని నేను!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా? ఏంటి అలా చుట్టూ చూస్తున్నారు! గొంతు వినిపిస్తోంది కానీ...శాల్తీ కనిపించడం లేదని ఆశ్చర్యపోతున్నారు కదూ! కాస్త జాగ్రత్తగా చూడండి

Updated : 19 Apr 2023 06:19 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా? ఏంటి అలా చుట్టూ చూస్తున్నారు! గొంతు వినిపిస్తోంది కానీ...శాల్తీ కనిపించడం లేదని ఆశ్చర్యపోతున్నారు కదూ! కాస్త జాగ్రత్తగా చూడండి. అప్పుడే మీకు కనిపిస్తాను. ఇంతకీ నేను ఎవరిని అంటే...!! ఆశ... దోశ.. అప్పడం.. వడ... అన్నీ ఇక్కడే తెలుసుకుందామనే! ఆ పప్పులేం ఉడకవు! నేనెవరో తెలియాలంటే, ఈ కథనం చదవాల్సిందే..! చదివేయండి మరి.. సరేనా!

చిటికెన వేలంత చిరుజీవినైన నా పేరు ఎట్రుస్కాన్‌ ష్రూ. నన్ను ఇంకా ఎట్రుస్కాన్‌ పిగ్మీ ష్రూ, వైట్‌ టూత్‌ పిగ్మీ ష్రూ అని కూడా పిలుస్తారు. నాకో ప్రత్యేకత ఉంది తెలుసా..! బరువు ప్రకారం చూసుకుంటే మొత్తం ఈ భూమి మీద నేనే అతి చిన్న క్షీరదాన్ని. తన పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులను క్షీరదాలు అంటారని మీకు తెలిసే ఉంటుంది కదా! పొడవు ఆధారంగా మాత్రం బంబుల్‌బీ అనే గబ్బిలం అతి చిన్న క్షీరదం.

ఉఫ్‌ అన్నా ఉప్పెనే!

మీరు సరదాగా ఉఫ్‌ అని అన్నా నాకు అది ఉప్పెనతో సమానం. ఎందుకంటే నేను కేవలం 1.8గ్రాముల బరువు ఉంటానంతే. గట్టిగా గాలి వీస్తే తట్టుకోలేను. తేలిగ్గా కొట్టుకుపోతాను మరి!! నా తోకను మినహాయిస్తే నా పొడవు కేవలం 3 నుంచి 5 సెంటీమీటర్లు ఉంటుందంతే! ఇక నా తోకేమో 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుంది.

తిండిలో తగ్గేదే లే!

నేను మీ చిటికెన వేలంత మాత్రమే ఉంటాను. అంత చిన్నగా ఉన్నా... తిండి విషయంలో మాత్రం తగ్గేదే లే! నా శరీర బరువుకన్నా దాదాపు రెండు రెట్లు ఎక్కువ తింటా. ఎంత తిన్నా... ఎంచక్కా అరాయించుకుంటా. ఇంతకీ నేను ఏం తింటానో తెలుసా...! ఎక్కువగా పురుగుల్నే కరకరలాడించేస్తా. నేను చక్కగా వేటాడేస్తా. పరిమాణంలో నా అంత ఉన్న జీవుల్నీ ఎంచక్కా తినేయగలను. అంటే చిన్న చిన్న తొండలు, బల్లుల్లాంటివన్నమాట. అయినా అన్నమాటేంటి... ఇది ఉన్నమాటే!!

పగలంతా గుర్ర్‌ర్ర్‌ర్ర్‌...

నేను ఎక్కువగా యూరప్‌, ఉత్తర ఆఫ్రికా, మలేషియా, మధ్యదరా సముద్రంలోని దీవులు, ఆసియా ఖండంలో జీవిస్తుంటాను. నాకు ముప్ఫై దంతాలుంటాయి. నా జీవితకాలం ఏమో కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. పగలు కంటే కూడా రాత్రిపూట చాలా చురుగ్గా ఉంటా. పగలంతా హాయిగా విశ్రాంతి తీసుకుంటా. నాకు వెచ్చని వాతావరణం అంటే ఇష్టం. చలిని నేను తట్టుకోలేను. నాకు పక్షులంటే చాలా భయం. ఎందుకంటే అవే నాకు ప్రధాన శత్రువులు మరి. మేం కనిపిస్తే చాలు... అవి ముక్కుతో పొడిచి... పొడిచి... చంపుకొని తింటాయి. సరే నేస్తాలూ.. ఇక ఉంటామరి. నాకు తెగ ఆకలేస్తోంది. బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు