చీతాను కాదు.... మ్యావ్‌.. మ్యావ్‌నే!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా? నన్ను చూసి మీరు చీతా అనుకొని ఉంటారు కదూ! కానీ కాదు. నేను పిల్లినే. మరి నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉంది కదా!

Updated : 21 Apr 2023 03:22 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా? నన్ను చూసి మీరు చీతా అనుకొని ఉంటారు కదూ! కానీ కాదు. నేను పిల్లినే. మరి నా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉంది కదా! ఆ సంగతులు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు సర్వల్‌ క్యాట్‌. నేను ఆఫ్రికాకు చెందిన అడవి పిల్లిని. మీ దగ్గరి పిల్లుల కన్నా పెద్దగా ఉంటాను. 54 సెంటీమీటర్ల నుంచి 62 సెంటీమీటర్ల ఎత్తు ఉంటాను. బరువేమో 9 నుంచి 18 కేజీల వరకు తూగుతాను. నాకు చిన్న తల, పెద్ద చెవులు ఉంటాయి. బంగారు, పసుపు వర్ణం మిళితమైన శరీరం మీద నల్లటి మచ్చలు ఉంటాయి. శరీర పరిమాణంతో పోల్చుకుంటే పిల్లుల్లో మా జాతికి చెందిన పిల్లులకే కాళ్లు పొడవుగా ఉంటాయి. అన్నట్లు మా తోక మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. మేం కూడా మీ దగ్గరి పిల్లుల్లానే ‘మ్యావ్‌.. మ్యావ్‌...’ అనే అరుస్తాం తెలుసా.

వేటకు సై....

నేను రాత్రి, పగలు రెండు సమయాల్లోనూ యాక్టివ్‌గానే ఉంటాను. వేటకు ఎప్పుడంటే అప్పుడు సై అంటూనే ఉంటా. ఎలుకలు, చిన్న చిన్న పక్షులు, కప్పలు, తొండలు, బల్లులు, కుందేళ్లు, కీటకాలను తినేస్తాను. నాకు వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దాని సాయంతోనే నా ఆహారాన్ని పసిగడతాను. నా శత్రువుల పనిపడతాను.

అమ్మో.. హైనాలు!

మాకు ఆఫ్రికన్‌ అడవి కుక్కలు, హైనాలు ప్రధాన శత్రువులు. కానీ నేను దాదాపు వాటికి దొరకనే దొరకను. ఎంచక్కా చెట్లెక్కి తప్పించుకుంటాను. కానీ అన్ని సార్లూ అదృష్టం కలిసిరాదు కదా. మాలో కొన్ని వాటి దాడిలో అప్పుడప్పుడు ప్రాణాలు విడుస్తుంటాయి. నాకు పొడవైన కాళ్లుండటం వల్ల నేను వేగంగా పరిగెత్తగలను. దాదాపు గంటకు 80 కిమీ వేగాన్ని అందుకోగలను. దూకడంలోనూ నాకు నేనే సాటి. నా జీవిత కాలం 10 సంవత్సరాలు. కానీ సంరక్షిస్తే 20 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఆఫ్రికాలో నన్ను వేటాడటం చట్టవిరుద్ధం. నేను అడవి పిల్లినే అయినప్పటికీ చిన్నప్పటి నుంచే నన్ను ఎవరైనా పెంచుకుంటే చక్కగా మచ్చిక అవుతాను. నేస్తాలూ.. మొత్తానికి ఇవండీ నా సంగతులు. మ్యావ్‌.. మ్యావ్‌..! ఏం లేదు ఫ్రెండ్స్‌ నా భాషలో మీకు బై.. బై... చెబుతున్నా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని