అయ్య బాబోయ్‌.. గుడ్డే..?

హాయ్‌ ఫ్రెండ్స్‌.. జంతువుల్లో ఎత్తయినది అనగానే మనకు టక్కున జిరాఫీ గుర్తుకొస్తుంది కదా! మరి అలాంటి జిరాఫీలను ఒకదాని మీద ఒకటి మూడు నిలుచోబెడితే ఎంత ఎత్తుంటుంది?..

Published : 22 Apr 2023 00:11 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. జంతువుల్లో ఎత్తయినది అనగానే మనకు టక్కున జిరాఫీ గుర్తుకొస్తుంది కదా! మరి అలాంటి జిరాఫీలను ఒకదాని మీద ఒకటి మూడు నిలుచోబెడితే ఎంత ఎత్తుంటుంది?.. ఊహించుకుంటేనే బాబోయ్‌ అని అనిపిస్తోంది కదూ.. ఇటీవల ఒక ప్రాంతంలో దాదాపు అంత పెద్ద గుడ్డు ఆకారాన్ని తయారు చేసి ఔరా అనిపించారు మరి.. ఇంతకీ ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!

ఈస్టర్‌ను మనకంటే విదేశాల్లోనే ఘనంగా నిర్వహిస్తుంటారని మీకు తెలిసే ఉంటుంది. అయితే, ఇటీవల బ్రెజిల్‌లోని పొమెరోడ్‌ అనే ప్రాంతంలో ఈస్టర్‌ సందర్భంగా ఒక పెద్ద గుడ్డు ఆకారాన్ని తయారు చేశారు. అది ఎంత పెద్దదంటే.. మూడు జిరాఫీలను ఒకదాని పైన మరొకటి నిలబెడితే ఎంతుంటుందో అంత ఉందట. అంతేకాదు.. దానిపైన రంగురంగుల పువ్వులు, ఇతర డిజైన్లు కూడా వేశారు. అందుకే, అది ‘లార్జెస్ట్‌ డెకరేటెడ్‌ ఈస్టర్‌ ఎగ్‌’గా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది.

కళాకృతులతో ముస్తాబు

ఈస్టర్‌ సందర్భంగా పొమెరోడ్‌లో గత ఫిబ్రవరి 16 నుంచి ఏప్రిల్‌ 9 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా 16.72 మీటర్ల ఎత్తు, 10.88 మీటర్ల వెడల్పుతో అతిపెద్ద గుడ్డు ఆకారాన్ని తయారు చేశారు. ఈ ప్రాంతాన్ని ‘జర్మన్‌ సిటీ ఇన్‌ బ్రెజిల్‌’ అని పిలుస్తుంటారు. ఎందుకంటే.. అక్కడ జర్మనీ నుంచి వలస వచ్చిన వారే అధికంగా నివసిస్తుంటారు. ఇక్కడ ఏటా ఈస్టర్‌ను ఘనంగా చేసుకుంటారట. అంతేకాదు.. ఆ గుడ్డు పైన స్థానికంగా ప్రసిద్ధి చెందిన కషుబియన్‌ కళాకృతులను చిత్రీకరించి ముస్తాబు చేశారు.

పెద్ద పెద్ద క్రేన్లు..

ఇంతపెద్ద గుడ్డు ఆకారాన్ని తయారు చేయడం మామూలు విషయం కాదు కదా.. ముందుగా ఇనుముతో ఆకృతిని నిర్మించి, దానిపైన ఫైబర్‌ గ్లాస్‌ ప్యానెళ్లను అమర్చారు. బయటి వైపు ప్రత్యేకంగా తయారు చేయించిన వస్త్రంతో చుట్టేశారు. దీని కోసం పెద్ద పెద్ద క్రేన్లు వాడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ డెకరేటెడ్‌ గుడ్డు విషయాన్ని గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు తెలపడంతో వారు వచ్చి వివరాలను పరిశీలించారు. కొలతలు తీసుకొని మరీ, రికార్డును నమోదు చేసుకున్నారట. తాజాగా అందుకు సంబంధించిన ధ్రువపత్రం కూడా అందించారు. 2019లో ఈ రికార్డు పొమెరోడ్‌ ప్రాంతం ప్రజల పేరుమీదే ఉండేదట. కానీ, 2022లో కోల్పోగా.. తాజాగా మళ్లీ వీరికే ఆ ఘనత దక్కింది. ఈ గుడ్డు ఆకారాన్ని చూసేందుకు టూరిస్టులు కూడా వరస కడుతున్నారట. నేస్తాలూ.. గుడ్డు ఆకారం భలే ఉంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని