పెంగ్విన్‌ను కాదు పఫిన్‌ను నేను!

హాయ్‌ ఫ్రెండ్స్‌ ఎలా ఉన్నారు? బాగున్నారా?! నేను చూడ్డానికి కాస్త బుజ్జి పెంగ్విన్‌లా ఉన్నాను కదూ! కానీ కాదు. నా పేరు పఫిన్‌.

Updated : 24 Apr 2023 00:40 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ ఎలా ఉన్నారు? బాగున్నారా?! నేను చూడ్డానికి కాస్త బుజ్జి పెంగ్విన్‌లా ఉన్నాను కదూ! కానీ కాదు. నా పేరు పఫిన్‌. మరి ఇంకా నా విశేషాలేంటో తెలుసుకుంటారా! అవన్నీ చెప్పి పోదామనే ఇదిగో నేనే ఇలా మీ ముందుకొచ్చాను.

నేనో సముద్ర పక్షిని. నాలో ప్రధానంగా మూడు రకాలున్నాయి. నలుపు, తెలుపు రంగులో ఉండే నేను కాస్త పెంగ్విన్‌లా కనిపిస్తాను. కానీ నాకూ వాటికి బంధుత్వం ఏమీ లేదు. పైగా అవి ఎగరలేవు. నేను మాత్రం ఎంచక్కా గాల్లో ఎగరగలను. అది కూడా సాదాసీదాగా కాదు. ఒక నిమిషంలోనే దాదాపు 400 సార్లు రెక్కల్ని ఆడించగలను. ఇలా గంటకు దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో ఎగరగలను. మేం ఎక్కువగా ఫ్రాన్స్‌, గ్రీన్‌లాండ్‌, నార్వే, న్యూయార్క్‌, మొరాకో, కాలిఫోర్నియా, సైబీరియా, అలస్కాల్లో నివసిస్తుంటాం.

చిన్ని తోక.. బుజ్జి రెక్కలు!

మా రెక్కలు మిగతా సముద్ర పక్షులతో పోల్చుకుంటే కాస్త చిన్నగా ఉంటాయనే చెప్పుకోవాలి. మా తోక కూడా చాలా చిన్నగా ఉంటుంది. కాళ్లేమో అచ్చంగా బాతుకాళ్లలా ఉంటాయి. వీటి వల్లే మేం నీటిలో ఈత కూడా కొట్టగలం. ఇక మా ముక్కు పెద్దగా.. ఆరెంజ్‌, నలుపు రంగులో ఉంటుంది.

గూడు కట్టం.. కానీ...!

మాకు గూడు కట్టుకోవడం రాదు. అందుకే నేలమీద దాదాపు ఒక మీటరు లోతు వరకు బొరియలు తవ్వుతాం. ఆ బొరియే మా ఇల్లు. ఇందులోనే మాలో ఆడ పక్షులు గుడ్లు పెడతాయి. మాలో ఇంకొన్ని ఇలా బొరియలు తవ్వవు. రాళ్ల మధ్యలో ఉండే సందుల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటాయి.

డజనైనా సరే!

మేం చేపల్ని, ఇతర జలచరాలను ఆహారంగా తీసుకుంటాం. మా పిల్లలకు మాత్రం చిన్న చిన్న చేపల్నే తినడానికి ఇస్తాం. మేం ఒకేసారి పది నుంచి పన్నెండు వరకు చేపలను మా ముక్కున కరుచుకుని వెళ్లగలం. దీని వల్ల మా పిల్లల బుజ్జి బొజ్జలు నింపడం మాకు చాలా తేలికవుతుంది. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా సంగతులు. ఇక ఉంటామరి బై... బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని