శెభాష్‌ అవంతిక..!

హాయ్‌ నేస్తాలూ.. మనం స్కూల్‌లో అందరి ముందు మాట్లాడాలంటే కాస్త భయపడతాం. ఏం మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారోనని ఆలోచిస్తాం.

Updated : 25 Apr 2023 00:31 IST

హాయ్‌ నేస్తాలూ.. మనం స్కూల్‌లో అందరి ముందు మాట్లాడాలంటే కాస్త భయపడతాం. ఏం మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారోనని ఆలోచిస్తాం. కానీ, ఓ నేస్తం అయితే ఏకంగా రాష్ట్రపతి ఎదుటే ధైర్యంగా మాట్లాడేసింది. అందరితోనూ శెభాష్‌ అనిపించుకుంది. ఇంతకీ తనెవరో, ఆ వివరాలేంటో తెలుసుకుందామా.!

రాజస్థాన్‌ రాష్ట్రంలో పజక ప్రాంతానికి చెందిన అవంతిక ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. దేశంలోని పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, వారిలో ఉత్సాహాన్ని నింపే ఉద్దేశంతో ‘టాటా బిల్డింగ్‌ ఇండియా స్కూల్‌’ పేరిట ఏటా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా 2019-20లో నిర్వహించిన పోటీల్లో ఈ నేస్తం ప్రతిభ చూపింది. దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది ఈ పోటీల్లో పాల్గొంటే, వారిలో 29 మంది మాత్రమే విజేతలుగా నిలిచారు. అందులో మన అవంతిక ఒకరు.

స్వచ్ఛ మాట..

అప్పుడు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారందరినీ నిర్వాహకులు ఇటీవల రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. వారందరూ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. అందరిలో అవంతికతోపాటు మరో బాలికకు మాత్రమే అక్కడ మాట్లాడే అవకాశం దక్కింది. తన ప్రసంగంలో అవంతిక.. ‘స్వచ్ఛ భారత్‌’ విషయాన్ని ప్రస్తావించింది. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపైన దృష్టిసారించాల్సిన ఆవశ్యకతనూ వివరించింది. తన మూడు నిమిషాల ప్రసంగం అక్కడున్న అందరినీ ఆలోచింపజేసింది. నిత్యం కుప్పల్లా పేరుకుపోతున్న అన్ని రకాల వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేస్తేనే, స్వచ్ఛ లక్ష్యాలను అధిగమించగలమని సూచించింది. మార్పు అనేది మన ఇంటి నుంచే మొదలు కావాలని, అది చూసి మరొకరు అనుసరిస్తారనీ చెప్పింది. అంతేకాదు.. ఈ నేస్తం ప్రసంగానికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి భవన్‌ ట్విటర్‌ ఖాతాలోనూ పోస్టు చేశారు.

లక్ష్యాలను నిర్దేశించుకొని..  

విద్యార్థుల అభినందన కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. ప్రస్తుత ‘అమృత్‌ కాల్‌’ నేపథ్యంలో ఈసారి నిర్వహించబోయే పోటీల్లో ‘మెరుగైన దేశ భవిష్యత్తుకు నేను చేయనున్న అయిదు పనులు’ అనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వందేళ్ల స్వాతంత్య్ర సంబరాలు నిర్వహించే సమయానికి దేశ నిర్మాణంలో ఈ చిన్నారుల పాత్ర కీలకం కానుందన్నారు. చిన్నతనం నుంచే లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి సాకారానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. నేస్తాలూ.. ఈ వయసులోనే రాష్ట్రపతి నుంచి అభినందనలు అందుకోవడమంటే మాటలు కాదు కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని