కొండల నడుమ భలే మైదానం!

చుట్టూ ఎత్తైన కొండలు. మచ్చుకైనా పచ్చిక బయలు కనిపించదు. రాళ్లూ రప్పలు తప్ప ఇంకేమీ ఉండవు. అలాంటి చోట పచ్చని తివాచీ పరిచినట్లు ఓ మైదానం. ఇదెక్కడో విదేశాల్లో అనుకునేరు.

Updated : 26 Apr 2023 00:56 IST

చుట్టూ ఎత్తైన కొండలు. మచ్చుకైనా పచ్చిక బయలు కనిపించదు. రాళ్లూ రప్పలు తప్ప ఇంకేమీ ఉండవు. అలాంటి చోట పచ్చని తివాచీ పరిచినట్లు ఓ మైదానం. ఇదెక్కడో విదేశాల్లో అనుకునేరు. కానే కాదు.. మన దేశంలోనే ఉంది ఈ స్టేడియం! మరి ఆ ప్రదేశం ఎక్కడో, ఆ మైదానం విశిష్టత ఏంటో తెలుసుకుందామా!

కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని స్పితుక్‌ వద్ద ఉంది ఈ మైదానం. ఇది ఇటీవలే రూపుదిద్దుకున్న ఫుట్‌బాల్‌ స్టేడియం. సముద్రమట్టానికి దాదాపు పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇందులో దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు కూర్చుని ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను తిలకించవచ్చు. ఇది భారత్‌లోనే అత్యంత ఎత్తులో ఉన్న ఫుట్‌బాల్‌ స్టేడియంగా రికార్డుల్లోకి ఎక్కింది.

పచ్చజెండా..

ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా లద్దాఖ్‌లో నిర్మితమైన ఈ ఆస్ట్రోటర్ఫ్‌ స్టేడియానికి ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌(ఫిఫా) నుంచి సైతం అనుమతి వచ్చింది. ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి ప్రమాణాలు సరిపోతాయని పచ్చజెండా ఊపింది. ఈ స్టేడియాన్ని ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లకు కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దారు. ఇందుకోసం ఎనిమిది లైన్ల సింథటిక్‌ ట్రాక్‌లు సైతం నిర్మించారు. అంతేకాదు నేస్తాలూ... ఇక్కడ 1000 పడకల హాస్టల్‌ వసతి కూడా ఉంది తెలుసా!

రూ.కోట్లలో ఖర్చు...

అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.10.68 కోట్లు ఖర్చు చేసింది. కొంతకాలం క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ స్టేడియం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. లద్దాఖ్‌లో మామూలుగా జనజీవనం అంటేనే చాలా కష్టతరం. అంతటి ప్రతికూల వాతావరణంలో కూడా అంతర్జాతీయ హంగులతో ఫుట్‌బాల్‌ స్టేడియాన్ని సిద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతైనా ఇది నిజంగా గ్రేట్‌ కదూ! అందుకే మనందరం అనాలి... ‘మేరా భారత్‌ మహాన్‌’ అని!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని