వింతరూపం... చెట్లపైనే నివాసం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా? ఏంటి అలా చూస్తున్నారు. నన్ను బుజ్జి ఎలుగుబంటి అనుకుంటున్నారు కదూ! కానీ కాదు. మరి వింతగా ఉన్న నేనెవర్ని? నా పేరేంటి? నేనెక్కడ ఉంటాను..

Updated : 28 Apr 2023 04:19 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా? ఏంటి అలా చూస్తున్నారు. నన్ను బుజ్జి ఎలుగుబంటి అనుకుంటున్నారు కదూ! కానీ కాదు. మరి వింతగా ఉన్న నేనెవర్ని? నా పేరేంటి? నేనెక్కడ ఉంటాను.. ఇలాంటి వివరాలన్నీ త్వరత్వరగా తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకాలస్యం? ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది.

నా పేరు బియర్‌ క్యాట్‌. నన్ను బింటురాంగ్‌ అని కూడా పిలుస్తారు. నిజానికి నేను అటు పిల్లినీ కాదు.... ఇటు ఎలుగుబంటినీ కాదు. కానీ పొడవైన తోక, ఎలుగుబంటి లాంటి మూతి, కాళ్లు ఉండటం వల్ల నన్ను ముద్దుగా బియర్‌ క్యాట్‌ అని పిలుస్తుంటారు. నేను ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాల్లో జీవిస్తుంటాను. నేను చాలా పొడవుగా ఉంటాను. కాళ్లు మాత్రం పొట్టిగా బలంగా ఉంటాయి. నలుపు రంగు జుట్టు ఉంటుంది. మీసాలు కూడా పెద్దగా ఉంటాయి. నాకు గుండ్రటి మొహం, పెద్దవైన కళ్లుంటాయి. కాళ్లకు బలమైన గోళ్లుంటాయి. ఇవి నాకు చెట్లపై సంచరించడంలో, వేటాడటంలో సాయపడతాయి.

శరీరమంత తోక!

మీకో విచిత్రమైన విషయం చెప్పనా... అదేంటంటే.. నా తోక దాదాపు నా శరీరం అంత పొడవు ఉంటుంది. దాదాపు 66 నుంచి 69 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటుంది. ఇక బరువు విషయానికొస్తే 11 కిలోగ్రాముల నుంచి 32 కిలోగ్రాముల వరకు ఉంటాను. నేను పగటి పూట కంటే, రాత్రి వేళల్లోనే చలాకీగా ఉంటాను.

బొజ్జ నిండా తింటా...

నాకు తినడం అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా చెట్ల మీదే జీవిస్తాను కాబట్టి, పండ్లనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాను. ఇంకా చిన్న చిన్న జీవులు, పక్షులు, పురుగులు, వానపాములు, గుడ్లను హాంఁఫట్‌ చేస్తా. మీకు మరో విషయం తెలుసా.. నేను చేపల్ని కూడా ఎంచక్కా వేటాడి.. కరకరలాడించేస్తా. ప్రస్తుతం మా సంఖ్య వేగంగా పడిపోతోంది. అందుకే మేం అరుదైన జీవుల జాబితాలో చేరాం. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి. బై.. బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని