క్రికెట్ కాదు... ఇది కిలికిటి!
ఇంతకీ.. కిలికిటి ఏంటబ్బా..! ఈ పదమేదో... ‘నిమ్మదా.. గోజ్రాస్ థెల్మీ.. అర్ధ భోస్.. క్రక్వికానా భూమ్లే’ అని బాహుబలి సినిమాలో కాలకేయ మాట్లాడిన ‘కిలికిలి’ అనే భాష పేరును గుర్తు చేస్తోంది కదూ
ఇంతకీ.. కిలికిటి ఏంటబ్బా..! ఈ పదమేదో... ‘నిమ్మదా.. గోజ్రాస్ థెల్మీ.. అర్ధ భోస్.. క్రక్వికానా భూమ్లే’ అని బాహుబలి సినిమాలో కాలకేయ మాట్లాడిన ‘కిలికిలి’ అనే భాష పేరును గుర్తు చేస్తోంది కదూ నేస్తాలూ! కిలికిటి అనేది నిజానికి ఓ ఆట. ఇది క్రికెట్‌ను పోలి ఉంటుంది. మరి ఈ ఆట నియమాలేంటి? ఎవరు ఆడతారో తెలుసుకుందామా ఫ్రెండ్స్!
కిలికిటి ఆటను సమోవన్ క్రికెట్, కిరికిటి అని కూడా పిలుస్తారు. పేరు ఏదైనా ఈ ఆట సమోవా దేశపు జాతీయ క్రీడ. ఇంకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్యలో ఉండే చాలా దీవుల్లోనూ ఈ కిలికిటిని ఆడతారు. సమోవా తర్వాత టువాలు అనే దేశంలో ఈ ఆట ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది.
దుడ్డు కర్రల్లాంటి బ్యాట్లు!
క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్, బౌలర్, ఫీల్డర్లు ఉన్నట్లే ఈ కిలికిటిలో కూడా ఉంటారు. అంతెందుకు పిచ్ సైతం ఉంటుంది. పిచ్‌కు అటు మూడు, ఇటు మూడు వికెట్లు కూడా అచ్చం క్రికెట్‌లోలానే ఉంటాయి. కాకపోతే ఇవి ఇంకాస్త పొడవుగా ఉంటాయి. స్టంపులు అయితే ఉండవు. బ్యాట్లుంటాయి.. కానీ అవి క్రికెట్ బ్యాట్లలా అయితే ఉండవు. కాస్త బేస్ బాల్ బ్యాట్లలా కనిపించినప్పటికీ... నిజానికి ఇవి దుడ్డు కర్రల్లానే ఉంటాయి. వీటికి పైనుంచి కింది వరకు కొబ్బరితాడు గట్టిగా చుడతారు. క్రికెట్ బ్యాట్‌తో పోలిస్తే, కిలికిటి బ్యాట్లు పొడవుగా ఉంటాయి. ఈ ఆటను దూరం నుంచి చూస్తే క్రికెట్ గ్రౌండ్‌లో బేస్ బాల్ ఆడుతున్నట్లే కనిపిస్తుంది.
వాటి ప్రసక్తే లేదు...!
ఈ ఆటలో వాడే బంతి చాలా గట్టిగా ఉంటుంది. క్రికెట్‌లో రక్షణ కోసం వాడే ప్యాడ్లు, గ్లౌజులు, హెల్మెట్ల ప్రసక్తి ఇందులో ఉండదు. షూస్ మాత్రం ధరిస్తారు. లుంగీలాంటి సంప్రదాయ వస్త్రాన్ని చుట్టుకుంటారు. మరో తమాషా విషయం ఏంటంటే క్రికెట్‌లో ఫీల్డింగ్ సమయంలో ఒక కీపర్ ఉంటే... ఈ కిలికిటిలో ఇద్దరు కీపర్లుంటారు.
అందరూ ఆల్ రౌండర్లే!
క్రికెట్ టీంలో 11 మంది ఆటగాళ్లుంటారు కదా... కానీ ఈ కిలికిటిలో మాత్రం ఆటగాళ్ల సంఖ్యకు పరిమితి లేదు. ఎంతమందైనా ఆడొచ్చు. కానీ ప్రస్తుతం ఒక్కో టీం నుంచి 21 మంది వరకు ఆడుతున్నారు. పైగా కిలికిటిలో ఆటగాళ్లంతా ఆల్‌రౌండర్లే. అంటే అందరూ బౌలింగ్ వేయడంతో పాటు బ్యాటింగ్ కూడా చేస్తారు. ఈ ఆటను అక్కడి ప్రజలు జాతరలా నిర్వహిస్తుంటారు. ఊర్లకు ఊర్లే టీంలుగా ఏర్పడి టోర్నమెంట్లు ఏర్పాటు చేసుకుంటారు. విందులు, వినోదాలు, నృత్యాలూ ఉంటాయి.
సిక్సర్ల మోత... ఫోర్ల ఊచకోత!
న్యూజిలాండ్ కిలికిటి అసోసియేషన్ ఏర్పడిన తర్వాత కొన్ని నియమాలతో ఆటను పటిష్టం చేశారు. 1999లో ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ టోర్నమెంట్ జరిగింది. 2001లో ఇంటర్నేషనల్ వరల్డ్‌కప్ కిలికిటి టోర్నమెంట్‌ను కూడా ప్రవేశపెట్టారు. గతంలో ఈ ఆటలో ఫోర్లు, సిక్సులు ఉండేవి కావు. కేవలం వికెట్ల మధ్య పరుగులు తీయడమే ఉండేది. కానీ న్యూజిలాండ్ కిలికిటి అసోసియేషన్ ఈ ఆటలో ఫోర్లు, సిక్సులను కూడా చేర్చింది.
ఇది థర్టీ.. థర్టీ!
ఒక మ్యాచ్ 70 నిమిషాలపాటు సాగుతుంది. మొదటి 30 నిమిషాలు ఒక టీం బ్యాటింగ్ చేస్తే, మరో 30 నిమిషాలు రెండో టీం బ్యాటింగ్ చేస్తుంది. ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్లే విజేతలు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో కిలికిటికి బాగా ప్రాచుర్యం ఉంది. ఫిజి, టోంగా, టువాలు, నియూ, టోకెలావ్ లాంటి చిన్న చిన్న దేశాల్లోనూ ఎక్కువగా ఆడతారు. నేస్తాలూ... మొత్తానికి ఇవీ క్రికెట్ లాంటి కిలికిటి ఆట విశేషాలు. భలే ఉన్నాయి కదూ!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
బిహార్ సీఎం కాన్వాయ్ కోసం.. పసిబిడ్డతో గంటసేపు ఆగిన అంబులెన్స్
-
World Culture Festival: రెండో రోజు ఉత్సాహంగా యోగా, మెడిటేషన్
-
America: అమెరికాకు తొలగిన షట్‌డౌన్ ముప్పు
-
Oscar winner Pinky: ‘ఆస్కార్ విజేత’ పింకీ.. ఇపుడు నవ్వటం లేదు!
-
Donald Trump: బైడెన్.. మెట్ల దారిని గుర్తించలేరు.. డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా
-
Jagananna Arogya Suraksha: ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహిస్తే బడికి సెలవే..!