ఇదో బుజ్జి తాజ్‌మహల్‌!

హాయ్‌ నేస్తాలూ.... ‘మనల్ని ఎవరైనా తాజ్‌మహల్‌ ఎక్కడ ఉంది?’ అని అడిగితే.. మనం వెంటనే ఆగ్రాలో ఉంది అని చెబుతాం. కానీ మీకో విషయం తెలుసా..! ఔరంగాబాద్‌లోనూ ఓ తాజ్‌మహల్‌ ఉంది. మరి దాని విశేషాలేంటి? దాన్ని ఎవరు? ఎందుకు కట్టించారో తెలుసుకుందామా!

Updated : 18 May 2023 04:40 IST

హాయ్‌ నేస్తాలూ.... ‘మనల్ని ఎవరైనా తాజ్‌మహల్‌ ఎక్కడ ఉంది?’ అని అడిగితే.. మనం వెంటనే ఆగ్రాలో ఉంది అని చెబుతాం. కానీ మీకో విషయం తెలుసా..! ఔరంగాబాద్‌లోనూ ఓ తాజ్‌మహల్‌ ఉంది. మరి దాని విశేషాలేంటి? దాన్ని ఎవరు? ఎందుకు కట్టించారో తెలుసుకుందామా!

హారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో తాజ్‌మహల్‌ను పోలిన నిర్మాణం ఉంది. దీన్ని బీబీకా మక్బరా అని పిలుస్తారు. ఈ బుజ్జి తాజ్‌మహల్‌ను కూడా మొఘలులే కట్టించారు. షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థం తాజ్‌ మహల్‌ను నిర్మించారని మీ అందరికీ తెలుసు కదా. ఆయనకు మనవడు అయ్యే అజమ్‌షా మాత్రం ఈ బుజ్జి తాజ్‌మహల్‌ను తన తల్లి దిల్‌రస్‌ బాను బేగం జ్ఞాపకార్థం కట్టించాడు. ఈ అజమ్‌షా ఎవరో కాదు ఔరంగజేబు కుమారుడు.

స్ఫూర్తితో పూర్తి!

అజమ్‌షా తాజ్‌మహల్‌ స్ఫూర్తితోనే బీబీకా మక్బరా నిర్మాణం తలపెట్టాడు. కానీ తన తాతైన షాజహాన్‌ కాలంలో వెచ్చించినంత నగదు లేకపోవడం, నిష్ణాతులైన కళాకారులు దొరక్కపోవడంతో బీబీకా మక్బరాకు అంత గుర్తింపు రాలేదు. అయినప్పటికీ దీని నిర్మాణ శైలి అద్భుతమనే చెప్పాలి. అందుకే దీన్ని ‘తాజ్‌ ఆఫ్‌ దక్కన్‌’, ‘పేదవాడి తాజ్‌మహల్‌’ అని కూడా పిలుస్తుంటారు. దీని నిర్మాణం క్రీ.శ. 1651 నుంచి 1661 వరకు సాగింది.

అంతగా కాంతులీనదు!  

బీబీకా మక్బరాను కూడా తాజ్‌మహల్‌లానే ఎత్తైన చతురస్రాకార వేదిక మీద నిర్మించారు. నాలుగు మినార్లు కూడా కట్టించారు. కానీ దీని పరిమాణం తాజ్‌మహల్‌తో పోల్చుకుంటే చాలా చిన్నది. గోపురం కూడా అంత పెద్దగా ఉండదు. తాజ్‌మహల్న్‌ు పూర్తిగా పాలరాయితో నిర్మిస్తే, బీబీకా మక్బరాను మాత్రం మొత్తం పాలరాయితో నిర్మించలేదు. గోపురం, ఇంకా కొన్ని నిర్మాణాలకు మాత్రమే దాన్ని వాడారు. చాలావరకు పాలరాయిలా కనిపించే మెటీరియల్‌ను ఉపయోగించారు. అందుకే ఇది తాజ్‌మహల్‌లా కాంతులీనదు. రికార్డుల ప్రకారం అజమ్‌షా ఈ నిర్మాణానికి అప్పట్లో ఏడులక్షల రూపాయలను వెచ్చించారు. కానీ ఆగ్రాలోని తాజ్‌మహల్‌ నిర్మాణానికి మాత్రం దీనికన్నా ఎన్నో రెట్ల ధనాన్ని షాజ్‌హాన్‌ ఖర్చు చేశాడు. అందుకే ఈ బీబీకా మక్బరా కేవలం తాజ్‌మహల్‌కు ఓ నమూనాలా మాత్రమే కనిపిస్తుంది.

ఔరంగజేబు అడ్డంకులు...

తన కుమారుడైన అజమ్‌షా ఈ బీబీకా మక్బరాను కట్టడం ఔరంగజేబుకు అస్సలు నచ్చలేదు. అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టించాడు. నిధులు అందకుండా చేశాడు. రాజస్థాన్‌, మొఘల్‌ సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాల నుంచి పాలరాయి తరలింపును అడ్డుకున్నాడు. కానీ అజమ్‌షా మాత్రం పట్టుదలతో తన తల్లి జ్ఞాపకార్థం బీబీకా మక్బరాను ఎన్నో కష్టనష్టాలకోర్చి పూర్తి చేశాడు. మొత్తానికి తన తండ్రి మీద విజయం సాధించాడు.

కాలాతీత కట్టడం!

క్రీ.శ. 1803లో నిజాం సికిందర్‌ జా బీబీకా మక్బరాను చూసి మంత్రముగ్ధుడయ్యాడు. ఔరంగాబాద్‌, మరఠ్వాడా ప్రాంతాన్ని తన రాజ్యంలో విలీనం చేసినప్పుడు ఈ నిర్మాణాన్ని తన రాజధాని అయిన హైదరాబాద్‌కు తరలించాలనుకున్నాడు. స్లాబ్‌ వారీగా నిర్మాణాన్ని కూల్చివేయాలని కూడా ఆదేశించారు. కానీ ఆఖర్లో ఎందుకో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఔరంగాబాద్‌లో బీబీకా మక్బరా పదిలంగా, తల్లి ప్రేమకు గుర్తుగా కాలాతీతంగా నిలిచే ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని