ఈ ఐస్‌క్రీమ్‌ బంగారం కానూ..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఎవరైనా ‘నీ ఇల్లు బంగారం కానూ..!’ అంటుంటారు కానీ, ‘ఈ ఐస్‌క్రీమ్‌ ఏంటి? బంగారం ఏంటి?’ అనుకుంటూ ఆశ్చర్యంగా చూడకండి.

Updated : 20 May 2023 06:14 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఎవరైనా ‘నీ ఇల్లు బంగారం కానూ..!’ అంటుంటారు కానీ, ‘ఈ ఐస్‌క్రీమ్‌ ఏంటి? బంగారం ఏంటి?’ అనుకుంటూ ఆశ్చర్యంగా చూడకండి. ఎందుకంటే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఐస్‌క్రీమ్‌ గురించి విన్నారంటే.. ఆ విషయమేంటో మీకూ తెలుస్తుంది. మరింకెందుకాలస్యం.. చకచకా ఇది చదివేయండి.

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో ఉన్న ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ ఇటీవల వార్తల్లో బాగా నిలిచింది. ఎందుకూ అంటే.. ఆ పార్లర్‌ వాళ్లు తయారు చేసిన ‘గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌’ అందుకు కారణం.

తినగలిగే పూత..

జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ పార్లర్‌ కొద్దిరోజుల క్రితం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన్‌ ఐస్‌క్రీమ్‌ని తయారు చేసిన విషయం మనం చదువుకున్నాం. ఇటలీ నుంచి తెప్పించిన చీజ్‌, అరుదుగా దొరికే ట్రఫుల్‌తో తయారయ్యే దాని ధర రూ.5 లక్షలు అని మీకు గుర్తుండే ఉంటుంది. అదే స్ఫూర్తితో తమకూ ఓ గుర్తింపు ఉండాలని, సూరత్‌లోని ఆ పార్లర్‌ కూడా ప్రయత్నించింది. అందులో భాగంగా గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తూ.. అందరితో ఔరా అనిపిస్తోంది. తినగలిగే బంగారు పూతను ఐస్‌క్రీమ్‌కి అతికిస్తుండటంతో దానికా పేరు వచ్చింది.

‘మైటీ మిడాస్‌’ పేరుతో..

వివిధ రకాల ఫ్లేవర్లు తయారు చేస్తూ.. ఇప్పటికే ఆ పార్లర్‌ స్థానికంగా చాలా పేరు తెచ్చుకుంది. తాజాగా ‘మైటీ మిడాస్‌’ పేరుతో గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌ తయారీని ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన కోన్‌లో చాక్లెట్‌, వేయించిన బాదం, రష్యన్‌ ఫ్రూట్‌ సిరప్‌తోపాటు హాజెన్‌ నట్స్‌ కూడా వేస్తారు. పైన ఫ్లేవర్డ్‌ క్రీమ్‌గా తినదగిన 24 క్యారెట్ల బంగారు పూతను అతికిస్తారు. అంతేకాకుండా.. ప్రత్యేకమైన రుచి వచ్చేందుకు ఇంకొన్ని పదార్థాలు కూడా దీనికి కలుపుతారు. ఇంతకీ ఈ ఐస్‌క్రీమ్‌ ధర చెప్పనేలేదు కదూ.. వెయ్యి రూపాయలట. ఈ సరికొత్త ‘మైటీ మిడాస్‌’ను టేస్ట్‌ చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆహారప్రియులు వస్తున్నారనీ, ఎండాకాలం కాబట్టి డిమాండ్‌ కూడా బాగుందనీ పార్లర్‌ నిర్వాహకులు చెబుతున్నారు. దీన్ని తిన్న వారయితే.. కేవలం లుక్‌ పరంగానే కాకుండా రుచి కూడా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారట. ఇలాంటివి మన దగ్గరా ఉన్నా.. వీళ్ల తయారీ, ఫ్లేవర్‌ కాస్త విభిన్నంగా ఉండటంతో  ఊహించిన దానికంటే ఎక్కువే గుర్తింపు దక్కింది. నేస్తాలూ.. గోల్డెన్‌ ఐస్‌క్రీమ్‌ విశేషాలివీ.. చూస్తుంటేనే నోరూరిపోతోంది కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని