ఎంత పెద్ద బుస్‌.. బుస్‌..అయినా నా ముందు తుస్సే!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! నేనో బుల్లి పిట్టను! బుజ్జి పిట్టను! ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు! పిడికెడు కూడా ఉండని నేను, ప్రదర్శించే తెలివితేటలు మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. పాముల్నేమో అవాక్కయ్యేలా చేస్తాయి.

Updated : 21 May 2023 05:11 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! నేనో బుల్లి పిట్టను! బుజ్జి పిట్టను! ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు! పిడికెడు కూడా ఉండని నేను, ప్రదర్శించే తెలివితేటలు మాత్రం మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. పాముల్నేమో అవాక్కయ్యేలా చేస్తాయి. ఇంతకీ నా పేరేంటి? నా ఘనత ఏంటో తెలుసుకోవాలని ఉందా? అవన్నీ చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు పెండ్యులిన్‌ టిట్‌. నేను వీవర్‌ బర్డ్‌ జాతికి చెందిన పక్షిని. మేం యూరప్‌, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాల్లో ఎక్కువగా జీవిస్తాం. మేం చెట్టు చిటారు కొమ్మలకు వేలాడేలా గూళ్లను నిర్మిస్తాం. మెత్తని గడ్డి, మొక్కల లేతకొమ్మలు, జంతువుల శరీరంపైన వెంట్రుకలను ఇందుకోసం వాడతాం. మా బంధువులు కొందరు మీ దేశంలోనూ ఉన్నారులెండి. కానీ వాళ్లకన్నా నేను కాస్త ప్రత్యేకం. నేను 7.5 నుంచి 11 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. మా రెక్కలు, తోక చాలా చిన్నగా ఉంటాయి. మేం బూడిద, పసుపు, తెలుపు వర్ణాల్లో ఉంటాం. యూరోపియన్‌ పెండ్యులిన్లకు నలుపు రంగు, మాలో ఇంకొన్ని రకాలకు పసుపు, ఎరుపు రంగుల ఈకలు కూడా ఉంటాయి.

రివ్వున ఎగిరే వలస పక్షులం..

మేం బుజ్జి పిట్టలమే అయినప్పటికీ మాలో చాలావరకు వలస పక్షులే! చాలా దూరాల వరకు మేం వలసపోతుంటాం. ముఖ్యంగా శీతాకాలంలో చలిని తప్పించుకోవడానికే మేం ఇలా చేస్తుంటాం. మాలో చైనీస్‌ పెండ్యులిన్‌ టిట్స్‌లైతే అన్నింటికన్నా ఎక్కువ దూరం వలసపోతుంటాయి.

బురిడీ కొట్టిస్తాం...

మాకు పాములు ప్రధాన శత్రువులు. అవి మమ్మల్ని, మా పిల్లల్ని, గుడ్లను తినేయాలని చూస్తాయి. అయినా మేం ఊరుకుంటామా ఏంటి? మా మెదడుకు పదును పెట్టి, పజిల్‌లాంటి గూడు నిర్మించుకుంటాం. అంటే మా గూడుకు చూడడానికి ఓ ద్వారం ఉన్నట్లే కనిపిస్తుంది. దాని ద్వారా లోపలికి వెళ్లి చూస్తే గూడంతా ఖాళీగా ఉంటుంది. కానీ అసలైన రహస్య ద్వారం కాస్త పైన ఉంటుంది. అందులోంచి వెళ్లినప్పుడే నేను పెట్టిన గుడ్లు, వాటి నుంచి వచ్చిన పిల్లలను చేరుకోవచ్చు. పాములు ఎంత గింజుకున్నా.... మా గూటి రహస్య ద్వారాన్ని కనిపెట్టలేవు. మొదటి ద్వారం గుండా లోపలకెళతాయి. అక్కడ గూడు ఖాళీగా కనిపించేసరికి, నిరాశతో బయటకు వెళ్లిపోతాయి. ఎందుకంటే రెండో రహస్య ద్వారాన్ని నేను ఎప్పుడూ మూసే ఉంచుతాను. దాన్ని కేవలం నేను మాత్రమే తెరుచుకుని లోపలికి వెళ్లగలను. ఇలా మా నిర్మాణ నైపుణ్యంతో పాములను బురిడీ కొట్టిస్తాం.

ఏం తింటామంటే...

మేం చిన్న చిన్న పురుగులు, లార్వాలను తినేస్తాం. పండ్లు, గింజలను కూడా ఎంచక్కా లాగించేస్తాం. ఇలా చక్కగా బుజ్జి బొజ్జను నింపుకొంటాం. మాలో ఆడ పక్షులు పెట్టిన గుడ్లను పొదగడానికి వాటికి 13 నుంచి 14 రోజులు పడుతుంది. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చాక కేవలం 18 రోజుల్లోనే అవి ఎగరడం నేర్చుకుంటాయి.  

గుప్పెడు గింజలు.. గుక్కెడు నీళ్లూ...!

నేస్తాలూ... మీకో విషయం చెప్పాలనిపిస్తోంది. వేసవికాలం వచ్చిదంటే చాలు చాలావరకు మా పక్షి జాతి నరకం అనుభవించాల్సి వస్తుంది! మాకు ఎన్నోసార్లు తాగడానికి కూడా సరిగా నీళ్లు దొరకవు. కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల, మేడ మీద, కిటికీ దగ్గర చిన్న చిన్న మట్టిపాత్రల్లో రోజూ గుప్పెడు గింజలు, గుక్కెడు నీళ్లూ ఉంచండి సరేనా! ఏవో నాలుగు గింజలు తిని, కాసిన్ని నీళ్లు తాగి మా ప్రాణాలు నిలుపుకొంటాం. మీ అమ్మానాన్న సాయంతో నేను చెప్పినట్లు చేస్తారు కదూ! సరే ఉంటామరి... ఇక బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని