చిటారుకొమ్మన చిరుకోతిని!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా! ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా? నేనో బుజ్జి కోతిని. కానీ మీకు నేను కాస్త విచిత్రంగా కనిపిస్తున్నాను కదా! నాకు తెలిసి నన్ను మీరు ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరు కదూ! అందుకే నా గురించి మీకు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

Updated : 22 May 2023 03:53 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా! ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా? నేనో బుజ్జి కోతిని. కానీ మీకు నేను కాస్త విచిత్రంగా కనిపిస్తున్నాను కదా! నాకు తెలిసి నన్ను మీరు ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండరు కదూ! అందుకే నా గురించి మీకు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

నల్లటి మొహం, తెల్లటి తలకట్టుతో ఉన్న నా పేరు కాటన్‌ టాప్‌ టామరిన్‌. నా జుట్టు రంగు వల్లే నన్ను అలా పిలుస్తారు. తల నుంచి భుజాల మీదకు పడే జుట్టే నాకు ప్రత్యేక ఆకర్షణ. నేను కేవలం అరకిలో మాత్రమే బరువుంటాను. అంటే ఓ రకంగా నేను కోడి కంటే కూడా తక్కువ బరువుండే కోతిని అన్నమాట. 20 నుంచి 25 సెంటీమీటర్ల వరకు పొడవుంటాను. నా తోకేమో 33 నుంచి 42 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. నాకు చాలా పదునైన గోర్లుంటాయి. ఇవి చెట్లు ఎక్కడంలో చాలా ఉపయోగపడతాయి. మాలో ఆడవి, మగవి సమాన బరువు, సమాన పొడవుంటాయి. నా జీవిత కాలం నిజానికి 24 సంవత్సరాలు. కానీ మాలో చాలా వరకు 13 సంవత్సరాల లోపే చనిపోతుంటాయి. ఇంతకీ నేను ఎక్కడ ఉంటానో చెప్పనేలేదు కదూ! ఎక్కువగా కొలంబియాలో కనిపిస్తుంటాను.

తరించిపోతున్నాం..

1976 సంవత్సరానికి ముందు వరకు దాదాపు 40,000 వరకు మా బంధువుల్ని మీ మనుషులు పరిశోధనల పేరుతో బంధించారు. ప్రస్తుతం చట్టపరంగా మాకు రక్షణ కల్పించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మాలో ఆడవి రెండేసి పిల్లలకు జన్మనిస్తున్నప్పటికీ మా జనాభా పెద్దగా పెరగడం లేదు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద అడవుల్లో జీవిస్తున్న మా సంఖ్య కేవలం ఆరు వేలు మాత్రమే. అంటే దాదాపు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాం. విపరీతమైన పట్టణీకరణ, అడవులను నరకడం వల్ల మా సహజసిద్ధ ఆవాసాలు దెబ్బతినడమే ఇందుకు ప్రధాన కారణం. ఫ్రెండ్స్‌.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. అన్నట్లు చెప్పడం మరిచిపోయాను. మీ దగ్గర ఇప్పుడు అసలే వేసవికాలం కదూ! ఎండల్లో తిరగకండి. చక్కగా మజ్జిగ, పండ్లరసాలు తీసుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి సరేనా..! ఇక ఉంటామరి బై.. బై..

కవలలే కవలలు!

మేం ఎక్కువగా చిన్న చిన్న పురుగుల్ని, పండ్లు, విత్తనాలను తిని మా బుజ్జి బొజ్జ నింపుకొంటాం. మా వల్ల పర్యావరణానికి ఎంతో మేలు తెలుసా. ఎందుకంటే మేం పండ్లు తిన్నాక విసర్జించే గింజల నుంచి కొత్త మొక్కలు పుట్టుకు వస్తాయి. ఇలా అడవిలో పచ్చదనం సంతరించుకుంటుంది. మాలో ఆడకోతులు ఎక్కువగా కవల పిల్లలకే జన్మనిస్తాయి. వాటిని కంటికి రెప్పలా చూసుకుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని