భలే.. భలే... బాహుబలి లాలిపాప్‌!

హాయ్‌ నేస్తాలూ! చిన్నపిల్లలమైన మనకు లాలిపాప్‌లు అంటే భలే ఇష్టం కదూ! ఒక్క ఇష్టం ఏంటి.. ఆ పేరు వినగానే నోరూరిపోతుంది కదా! ఏడ్చే పిల్లలకు ఒక్కోసారి లాలిపాప్‌నే ఊరడించే జోలాలిపాట!

Updated : 24 May 2023 05:06 IST

హాయ్‌ నేస్తాలూ! చిన్నపిల్లలమైన మనకు లాలిపాప్‌లు అంటే భలే ఇష్టం కదూ! ఒక్క ఇష్టం ఏంటి.. ఆ పేరు వినగానే నోరూరిపోతుంది కదా! ఏడ్చే పిల్లలకు ఒక్కోసారి లాలిపాప్‌నే ఊరడించే జోలాలిపాట! గంటల కొద్దీ లాలిపాప్‌ను చక్కగా చప్పరిస్తూ... ఎంచక్కా చప్పట్లు కొట్టే బుజ్జాయిలు ఎందరో! చేతిలో ఒలింపిక్‌ టార్చిలా పట్టుకుని పరుగులు తీసే చిచ్చరపిడుగులు ఇంకెందరో! కొన్ని గదల్లా, గోళాల్లా ఉంటే, మరి కొన్ని నాణేల్లా ఉంటాయి. ఇంకొన్ని చతురస్రం, దీర్ఘచతురస్రం ఆకారాల్లోనూ కనిపిస్తాయి. అలాంటి లాలిపాప్‌ల బరువు కేవలం గ్రాముల్లోనే ఉంటుంది. కానీ ఓ లాలిపాప్‌ బరువు మాత్రం వేల కిలోల్లో ఉంది. మరి దాని గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్‌.

కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సీస్‌ క్యాండీస్‌ అనే చాక్లెట్ల తయారీ కంపెనీ జాతీయ లాలిపాప్‌ దినోత్సవాన్ని రొటీన్‌కు భిన్నంగా, వినూత్నంగా నిర్వహించాలనుకుంది. కేవలం అనుకుని ఊరుకోలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద లాలిపాప్‌ను తయారు చేసింది. దీన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రజల కోసం సందర్శనకు ఉంచింది. ఈ బాహుబలి లాలిపాప్‌ను చూడడానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఇంతకీ దీని బరువు ఎంతో తెలుసా!

మోయలేం.. తినలేం..!

కచ్చితంగా ఈ లాలిపాప్‌నైతే మనం మోయలేం... తినలేం! ఎందుకంటే దీని బరువు ఏకంగా 3,176.5 కిలోలు. అంటే దీని నుంచి దాదాపు 1,45,000 సాధారణ లాలిపాప్‌లను తయారు చేయొచ్చన్నమాట. దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద లాలిపాప్‌గా గుర్తింపు దక్కింది. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించుకుంది. ఈ లాలిపాప్‌ను తరలించడానికి, ప్రదర్శించడానికి భారీ క్రేన్‌, ట్రక్కును ఉపయోగించాల్సి వచ్చింది.

ఇప్పటికీ ఇదే రికార్డు!

ఈ అతిపెద్ద లాలిపాప్‌నకు వాడిన పుల్ల కూడా భారీదే. పెద్ద పెద్ద హోర్డింగ్‌లకు వాడే స్తంభంలాంటిదాన్ని ఉపయోగించారు. ఈ లాలిపాప్‌ అయిదు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తు, మూడు అడుగుల 6 అంగుళాల వెడల్పూ ఉంది. ఇప్పటి వరకూ ఈ రికార్డు దీని పేరు మీదే ఉంది. ఇంతకు ముందు మాత్రం ఈ రికార్డు 2,954.7 కిలోలున్న మరో లాలిపాప్‌ పేరిట ఉండేది. దాన్ని ఇది బద్దలు కొట్టిందన్నమాట. నేస్తాలూ! మొత్తానికి ఈ భారీ లాలిపాప్‌ సంగతులు భలే ఉన్నాయి కదూ! నాకు తెలిసి మీకీపాటికే నోరూరిపోయి ఉంటుంది. ఇంతపెద్దది కాకపోయినా.. ఓ బుజ్జి లాలిపాప్‌ లాగించేయండి సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని