పండు.. పండు.. నల్ల పండు..ఆపిల్‌ దాని పేరు!!

అదేంటి.. ఆపిల్‌ ఉంటే ఎరుపు, లేత ఎరుపు రంగులో ఉండాలి. కొన్ని ఆకుపచ్చరంగులోనూ ఉంటాయి. కానీ ఈ నలుపు రంగు ఆపిల్‌ ఏంటబ్బా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ!

Published : 28 May 2023 00:06 IST

అదేంటి.. ఆపిల్‌ ఉంటే ఎరుపు, లేత ఎరుపు రంగులో ఉండాలి. కొన్ని ఆకుపచ్చరంగులోనూ ఉంటాయి. కానీ ఈ నలుపు రంగు ఆపిల్‌ ఏంటబ్బా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ! వెంటనే ఈ కథనం చదివేయండి ఫ్రెండ్స్‌.. విషయం ఏంటో మీకే తెలిసిపోతుంది.

ఈ విచిత్రమైన పండు పేరు బ్లాక్‌ డైమండ్‌ ఆపిల్‌. ఇది టిబెట్‌లో సాగవుతుంది. పేరుకు దీన్ని బ్లాక్‌ ఆపిల్‌ అని పిలుస్తారు కానీ.. నిజానికి ఇది పూర్తి నలుపు వర్ణంలో ఏమీ ఉండదు. ఇది ముదురు వంగపండు రంగులో కనువిందు చేస్తుంది. లోపలి భాగం మాత్రం సాధారణ ఆపిల్‌లానే తెలుపు రంగులో ఉంటుంది. వీటిని సముద్రమట్టానికి దాదాపు 3,500 మీటర్ల ఎత్తులో సాగు చేస్తున్నారు. అలాగే ఇక్కడ పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో విపరీతమైన వ్యత్యాసం ఉంటుంది. పగటిపూట అతినీలలోహిత కిరణాల తాకిడికి ఇక్కడ పండే ఆపిల్స్‌ ఎక్కువగా గురవుతాయి. అందుకే వీటికి ఈ ముదురు రంగు వస్తుంది.

టిబెట్‌తో పాటు...

ఈ బ్లాక్‌ డైమండ్‌ ఆపిల్స్‌ టిబెట్‌తో పాటు చైనా, అమెరికాలో కూడా కనిపిస్తుంటాయి. కానీ వీటి జన్మస్థలం మాత్రం టిబెట్‌లోని ఒక చిన్న నగరమైన న్యింగ్‌చి అని చెబుతుంటారు. మీకు మరో విషయం తెలుసా...! ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,500 పైచిలుకు ఆపిల్‌ రకాలున్నాయి. అంటే రోజుకో రకం ఆపిల్‌ తిన్నా.. అన్ని రకాలను రుచి చూడడానికి దాదాపు 20 సంవత్సరాల పైనే పడుతుంది. ఇన్ని రకాల్లోకెల్లా బ్లాక్‌ డైమండ్‌ ఆపిల్స్‌ మాత్రం అరుదైనవి, ఖరీదైనవి కూడా!

అ‘ధర’ గొడతాయి!

చూడ్డానికి ముదురు రంగులో ఉన్నా... ఈ పండ్ల రకాలు చాలా అరుదైనవి. అందుకే వీటి ధర మామూలు ఆపిల్స్‌తో పోల్చుకుంటే.. చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కో పండు ధర సుమారు 500 రూపాయల వరకు పలుకుతుంది! ఈ చెట్లు కాతకు రావడానికి సుమారు ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. ఇవి సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే కాస్తాయి. అయితే చెట్టు నుంచి తెంపిన వెంటనే వీటిని తినలేం. చాలాకాలం నిల్వ చేసిన తర్వాత మాత్రమే వీటికి సరైన రుచి వస్తుంది. ఈ ప్రక్రియంతా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అందుకే ఈ చెట్లను పెంచడానికి రైతులు పెద్దగా ఇష్టపడరు. పోషక విలువలు కూడా మామూలు ఆపిల్స్‌లానే ఉంటాయి. కాకపోతే రుచి మాత్రం బాగుంటుంది. అరుదుగా దొరకడం వల్లనే ఇవి అధిక ‘ధర’ పలుకుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని