కాళ్లతోనే కల సాకారం!

విధి వెక్కిరించింది. పుట్టుకతోనే రెండు చేతులూ లేవు! అయినా ‘అయ్యో..’ అని కుంగిపోలేదు. మామూలు మధ్యతరగతి కుటుంబం. కానీ కలలు కనడం మానలేదు!

Updated : 31 May 2023 05:36 IST

విధి వెక్కిరించింది. పుట్టుకతోనే రెండు చేతులూ లేవు! అయినా ‘అయ్యో..’ అని కుంగిపోలేదు. మామూలు మధ్యతరగతి కుటుంబం. కానీ కలలు కనడం మానలేదు! వాటి సాకారానికి కృషి కూడా ఆపలేదు!! అడుగడుగునా అడ్డంకులు పలకరించినా.. కుదేలై.. వెనకడుగు వేయలేదు. తన సత్తువకు మించి కసితో కసరత్తు చేసింది. కాళ్లతోనే గురి పెట్టింది...దిక్కులు అవాక్కయ్యేలా, ఉక్కు సంకల్పంతో విల్లు ఎక్కు పెట్టింది. శరీరం సహకరించకున్నా... శరాన్ని సంధించింది. లక్ష్యాన్ని ఛేదించింది. పతకాలు పతాకాల్లా రెపరెపలాడుతూ వచ్చి చేరాయి! ఇలా దేశానికి కీర్తిని, ఇంకెందరికో స్ఫూర్తిని ఇస్తూ ముందుకు సాగుతోంది... ఇంతకీ తనెవరంటే...!

జమ్ము-కశ్మీర్‌లోని లోయీధర్‌ గ్రామానికి చెందిన శీతల్‌దేవి ఓ దివ్యాంగురాలు. తనకు బాల్యం నుంచే చేతులు లేవు. అయినా ఆర్చరీలో అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టిస్తోంది. కేవలం 11 నెలల శిక్షణతోనే మెరికలా మారింది. ఇప్పటి వరకు అయిదు జాతీయ క్రీడల్లో పాల్గొంది. ఒకదానిలో కాంస్య పతకం గెలుచుకుంది. యూరప్‌లో జరిగిన పోటీల్లో మూడు పతకాలు వరించాయి.

రెండు నెలల కష్టం...

శీతల్‌కు కోచ్‌ చక్కని సహకారం అందించారు. చేతులు లేకుండా ఈమె ఎలా బాణాలు వేయగలదని ముందు సంకోచించారు. దాదాపు రెండు నెలలు దీని మీదే కసరత్తు సాగింది. తర్వాత శీతల్‌ లక్ష్యం వైపు సాగేందుకు మార్గం సుగమం అయింది. కేవలం 11 నెలల్లోనే శిక్షణలో రాటుదేలింది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు, కాంస్యం, రజత పతకాలు సాధించింది.

పారా ఒలింపిక్స్‌ లక్ష్యంగా...

శీతల్‌ తన అద్భుత ప్రదర్శనతో ఏషియన్‌, పారా వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించింది. పారా ఒలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఆమె కచ్చితంగా పారా ఒలింపిక్స్‌లో పాల్గొని, పతకాన్ని సైతం సాధిస్తుందని కోచ్‌ పూర్తి నమ్మకంతో ఉన్నారు.

రయ్‌.. రయ్‌.. రైతు బిడ్డ!

శీతల్‌ వాళ్ల నాన్న ఓ రైతు. అమ్మ గృహిణి. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా సహకరించకున్నా... తనకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటోంది. శిక్షణలో ప్రతి క్షణమూ విలువైనది భావిస్తోంది. సమయాన్ని అస్సలు వృథా చేయకుండా లక్ష్యం దిశగా రయ్‌..రయ్‌..మని దూసుకుపోతోంది. రోజూ ఓ గంట ధ్యానం, అనంతరం గంట తేలికపాటి వ్యాయామాలు చేస్తోంది. తర్వాత ఇక అసలైన సాధన ప్రారంభిస్తోంది.

ఉదయాన్నే మొదలు..

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి విడతలో ప్రాక్టీస్‌ సాగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు బాణాలు సంధిస్తుంది. ఇంత కఠోర సాధన చేస్తున్న శీతల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో చేతులు లేకుండా, కాళ్లతో బాణాలు సంధిస్తున్న వారిలో ఈమె మొదటి ఆర్చర్‌! రానున్న రోజుల్లో శీతల్‌ మరిన్ని ఘనతలు తన సొంతం చేసుకోవాలని మనమూ కోరుకుందామా...! ఇంకెందుకాలస్యం మనసారా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని