బాబోయ్‌.. ఎంత పెద్ద నాలుకో!

అమెరికాకు చెందిన జోయ్‌ అనే పప్పీ ఇటీవల ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అంతేకాదు.. స్థానికంగా చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది.

Published : 08 Jun 2023 00:13 IST

హలో ఫ్రెండ్స్‌.. ‘నీ నాలుకతో ముక్కును అంటించుకో చూద్దాం..’ అని మనం స్నేహితులను సరదాగా ఆటపట్టిస్తుంటాం. కొన్నిచోట్ల ప్రత్యేకంగా పోటీలూ పెడుతుంటారు. కానీ, ఎంత ప్రయత్నించినా.. చాలామంది అందుకోలేరు. నాలుక కాస్త పెద్దగా ఉన్నవాళ్లకు మాత్రమే అది సాధ్యమవుతుంది. అయితే, ఇప్పుడు మనం పొడవైన నాలుక ఉన్న ఓ పప్పీ గురించి తెలుసుకోబోతున్నాం..  ఆ వివరాలే ఇవి..  

అమెరికాకు చెందిన జోయ్‌ అనే పప్పీ ఇటీవల ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అంతేకాదు.. స్థానికంగా చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయింది. ఎందుకూ అంటే.. దాని నాలుకే అందుకు కారణం. జీవించి ఉన్న కుక్కల్లో దీని నాలుకే అతి పెద్దదట. ఈ విషయం నేను చెబుతున్నది కాదు నేస్తాలూ.. ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులే తేల్చారు. దాని పేరిట రికార్డు కూడా నమోదు చేశారు.

స్టేటస్‌ పెట్టడంతో..

జోయ్‌ వాళ్ల యజమాని ఒకసారి దాని ఫొటోను వాట్సాప్‌ స్టేటస్‌గా పెట్టాడు. అప్పుడా పప్పీ వయసు మూడు నెలలే. పుట్టినప్పటి నుంచి అది నాలుక బయట పెట్టే ఉండేదట. అయితే, ఆ స్టేటస్‌లో ఉన్న ఫొటోలోనూ దాని నాలుక బయటకే ఉంది. అది చూసిన ఆ యజమాని స్నేహితుడొకరు.. ఈ పప్పీ నాలుక సాధారణం కంటే చాలా పెద్దగా ఉందని గుర్తించాడు. అదే విషయాన్ని మిత్రుడికి చెప్పాడు. అప్పటివరకూ యజమానికి ఆ ఆలోచన కూడా రాలేదట. మిత్రుడి సూచన మేరకు.. పప్పీని దగ్గరల్లోని పశు వైద్యశాలకు తీసుకెళ్లి, దాని నాలుకను కొలతలు తీయించాడు. అది ఏకంగా 12.7 సెంటీమీటర్లు ఉండటంతో అక్కడి వారంతా నోరెళ్లబెట్టారట.

ఇంటర్నెట్‌లో వెతికి..

అయితే, ఆ యజమానికి పశు వైద్యశాలలోనే ఓ ఆలోచన వచ్చింది. వెంటనే, ఇంటికి వెళ్లి.. కుక్కల్లో పొడవైన నాలుకకు సంబంధించిన రికార్డుల వివరాలను ఇంటర్నెట్‌లో వెతికాడు. అది ‘బిస్బీ’ అనే పప్పీ పేరిట ఉన్నట్లు గుర్తించాడు. గిన్నిస్‌ రికార్డుల ప్రకారం దాని నాలుక పొడవు 9.49 సెంటీమీటర్లు. జోయ్‌ నాలుక అంతకంటే పొడుగ్గా ఉండటంతో వెంటనే గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులను సంప్రదించాడు. సంబంధిత వ్యక్తులు వచ్చి.. దాని వయసు, నాలుక పొడవు తదితర వివరాలను నమోదు చేసుకున్నారు. ఇటీవలే అధికారికంగా ధ్రువపత్రం కూడా అందజేశారు. ఈ పప్పీకి బయట తిరగడం, విసిరేసిన బంతులను తిరిగి తెచ్చివ్వడం, కార్లలో ప్రయాణించడం, ఈదటం అంటే చాలా ఇష్టమని యజమాని చెబుతున్నాడు. నేస్తాలూ.. ప్రపంచ రికార్డు సృష్టించడంతో ఈ పప్పీతో కలిసి ఫొటోలు దిగేందుకు అక్కడి వారు వీళ్ల ఇంటికి వరస కడుతున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని