బెకబెక.. బెక..! బెకబెక.. బెక...! హమ్మయ్య... బతికే ఉన్నాం ఇంకా!!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా?! నేను పసుపు, నలుపు చారలున్న చిరుజీవిని! బుడి బుడి గెంతుల బుజ్జి బెకబెక కప్పను!! అంతా అంతరించిపోయామని అనుకున్నారు.

Published : 12 Jun 2023 00:03 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా?! నేను పసుపు, నలుపు చారలున్న చిరుజీవిని! బుడి బుడి గెంతుల బుజ్జి బెకబెక కప్పను!! అంతా అంతరించిపోయామని అనుకున్నారు. కానీ అంతలోనే ఆశలు చిగురించాయి!! జూ నుంచి అడవికి అడుగులు పడ్డాయి...!! నా ఉనికిని నేను మీ సాయంతో తిరిగి చాటుకున్నాను. పనిలోపనిగా మీకు బెకబెకమంటూ కృతజ్ఞతలూ చెప్పుకొన్నాను. నా గురించి పూర్తి సంగతులు చెప్పి పోదామనే ఇదిగో ఇప్పుడు ఇలా వచ్చాను.

వును... ఇంతకీ నా పేరేంటో చెప్పనేలేదు కదూ! అయినా మీరు అడగాలి కదా!! సరేలే.. ఫ్రెండ్స్‌.. నేనే చెబుతాను! నన్ను కోరోబోరీ అని పిలుస్తారు. మాలో ఉత్తర కోరోబోరీ, దక్షిణ కోరోబోరీ అని రెండు రకాలున్నాయి. వీటి మధ్య చిన్న చిన్న తేడాలుంటాయంతే. నేను కేవలం ఆస్ట్రేలియాలోనే, అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాను.

చిన్ని చిన్ని కప్పను...

నేను చిరు కప్పను. మీ చేతి వేళ్లకన్నా చిన్నగా ఉంటాను. పసుపు, నలుపు చారలతో చూడడానికి అందంగా ఉంటాను. కానీ నేను విషపూరితం. శత్రువుల నుంచి నన్ను నేను రక్షించుకోవడంలో భాగంగా ఈ విషాన్ని ఉత్పత్తి చేస్తాను. ఎక్కువగా పురుగులు, చీమలు, కీటక లార్వాలను కరకరలాడించేస్తాను. నేను టాడ్‌పోల్‌ దశలో ఉన్నప్పుడు మాత్రం ఆల్గేను ఆహారంగా తీసుకుంటాను.

ప్చ్‌.. చాలా తక్కువ!

ఒక రకమైన ఫంగస్‌ వ్యాధి, బుష్‌ ఫైర్‌లు అని పిలిచే కార్చిచ్చుల వల్ల మా జనాభా అడవుల్లో చాలా తగ్గిపోయింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2004 నాటికి మాలో పెద్ద కప్పల జనాభా కేవలం 64 మాత్రమే! తర్వాత కాలంలో మా సంఖ్య మరింతగా తగ్గిపోయింది. వాతావరణ కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, ఓజోన్‌ పొర క్షీణించడం, అతినీలలోహిత కిరణాల తీవ్రత పెరగడం కూడా మా సంఖ్య వేగంగా పడిపోవడానికి ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

కంటికి రెప్పలా... కాపాడుతూ...!

సిడ్నీలోని తరోంగా లాంటి జూల వారు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే, ఇంకా... మేం అంతరించిపోకుండా ఇలా బతికి ఉన్నామంటే నిజంగా వాళ్లే కారణం. కృత్రిమంగా మాకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి, మా సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఫంగస్‌ వ్యాధులను తట్టుకునేలా మమ్మల్ని తీర్చిదిద్ది, తిరిగి ఆస్ట్రేలియాలోని మా పాత నివాసాల్లో వదులుతున్నారు. త్వరలోనే మా సంఖ్య పెరుగుతుందని మేం నమ్ముతున్నాం. మీరు కూడా మా కష్టాలన్నీ తొలగిపోవాలని, మేం మునుపటిలా ఆనందంగా జీవించాలని, మనస్ఫూర్తిగా కోరుకోండి సరేనా! ఇక ఉంటామరి బై.. బై.. ఫ్రెండ్స్‌!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని