ఖరీదైన మామిడి.. జనం ఎగబడి..!

హలో ఫ్రెండ్స్‌.. మనకు వేసవి కాలం అనగానే టక్కున సెలవులు గుర్తొస్తాయి. కొందరికేమో వాటితోపాటు నోరూరించే మామిడి పండ్లు కూడా జ్ఞాపకానికి వస్తాయి. మన దగ్గర సాధారణంగా కిలో మామిడి పండ్లు రకాన్ని బట్టి వంద రూపాయల నుంచి అయిదొందల వరకూ ఉంటాయి.

Updated : 13 Jun 2023 05:59 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు వేసవి కాలం అనగానే టక్కున సెలవులు గుర్తొస్తాయి. కొందరికేమో వాటితోపాటు నోరూరించే మామిడి పండ్లు కూడా జ్ఞాపకానికి వస్తాయి. మన దగ్గర సాధారణంగా కిలో మామిడి పండ్లు రకాన్ని బట్టి వంద రూపాయల నుంచి అయిదొందల వరకూ ఉంటాయి. కానీ, ఓ రకం మాత్రం లక్షల్లో ధర పలుకుతోంది. అది ప్రపంచంలోనే ఖరీదైన మామిడి రకం మరి. ఆ వివరాలే ఇవి..

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని సిలిగుడి జిల్లాలో ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు మ్యాంగో ఫెస్టివల్‌ నిర్వహించారు. అందులో దాదాపు 262 రకాల మామిడి పండ్లు ప్రదర్శనకు వచ్చాయి. అయితే, వాటన్నింటిలో ‘మియాజాకి’ రకానివే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎందుకూ అంటే.. వాటి ధర కిలో రూ.2.75 లక్షలు మరి. అందుకే అవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా గుర్తింపు తెచ్చుకున్నాయి.

అన్నీ ప్రత్యేకతలే..

ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ మియాజాకి రకాన్ని తొలిసారిగా జపాన్‌లో గుర్తించారు. రెండు, మూడేళ్లుగా మన దేశంలోని పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. సాధారణ మామిడి పండ్లకంటే ఇవి కాస్త పెద్దగా ఉంటాయి. ఒక్కోటి 350 నుంచి 900 గ్రాముల వరకూ బరువు తూగుతుంది. తీపి కూడా 15 శాతం అధికంగా ఉంటుంది. ఏటా ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్యలో ఈ పండ్లు పక్వానికి వచ్చినప్పుడు కాస్త లేత రంగులో ఉంటాయి. సూర్యరశ్మి అధికంగా ఉంటూ, వర్షపాతం కూడా తగినంతగా ఉండే వాతావరణ పరిస్థితుల్లోనే ఈ చెట్లు పెరుగుతాయట. ఈ రకాల్లో బీటా కెరోటిన్లు, ఫోలిక్‌ యాసిడ్‌ శాతం ఎక్కువ. శరీరానికి ఎంతో అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లూ అధికమేనట.  

కాయలకు కాపలా..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కి చెందిన ఓ రైతు గతేడాది మియాజాకి రకం చెట్లను సాగు చేశాడు. ఆ కాయలకు రక్షణగా ఏకంగా 15 కుక్కలను ఉంచాడు. వాటితోపాటు నలుగురు సిబ్బందినీ, సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేశాడు. పశ్చిమ బెంగాల్‌లోనూ ఓ రైతు తాజాగా ఈ రకానికి చెందిన ఒక్కో కాయను దాదాపు రూ.11 వేలకు విక్రయించాడట. అయితే, ఇటీవల ముగిసిన మ్యాంగో ఫెస్టివల్‌లో ఈ రకం పండ్ల స్టాల్‌ దగ్గర జనం భారీగా గుమిగూడారట. అలాగని కొనేందుకు అనుకునేరు నేస్తాలూ.. చూసేందుకేనట. పిల్లలూ.. ఇవీ ఈ ఖరీదైన మామిడి విశేషాలు..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని