అలలు విసిరిన శిల!

అదో బండ! అంటే ఏదో చిన్నది అనుకునేరు! అది ఏకంగా ఓ కొండంత పరిమాణంలో ఉంటుంది. కొన్ని లక్షల కిలోల బరువున్న ఆ రాయి సముద్రం నుంచి నేల మీదకు ఎలా వచ్చిందో తెలుసా?! దాన్ని అలలు విసిరేశాయంట! అంతపెద్ద బండరాయినే కదిలించే ఆ రాకాసి అలలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా...!

Updated : 14 Jun 2023 06:39 IST

అదో బండ! అంటే ఏదో చిన్నది అనుకునేరు! అది ఏకంగా ఓ కొండంత పరిమాణంలో ఉంటుంది. కొన్ని లక్షల కిలోల బరువున్న ఆ రాయి సముద్రం నుంచి నేల మీదకు ఎలా వచ్చిందో తెలుసా?! దాన్ని అలలు విసిరేశాయంట! అంతపెద్ద బండరాయినే కదిలించే ఆ రాకాసి అలలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా...! సునామీ వల్ల!! అసలు ఆ సునామీ ఎందుకు వచ్చిందో తెలుసా..! సముద్రంలోని అగ్నిపర్వతం బద్దలు కావడం వల్లనట!! వినడానికి వింతగా, హాలీవుడ్‌ సినిమాను తలపించేలా ఉన్నా.. ఇదంతా వాస్తవం అంటున్నారు శాస్త్రవేత్తలు. దీనంతటికీ నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది ఈ సునామీ రాయి. మరి ఈ కొండంత బండ ఎక్కడుంది?దాని కథ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్‌. అయితే ఇంకెందుకాలస్యం... ఈ కథనం చదివేయండి.  

టోంగా.. పసిఫిక్‌ మహాసముద్రంలోని ఓ ద్వీప దేశం. జనాభా సుమారు లక్ష మాత్రమే. మనం చెప్పుకుంటున్న ఆ బండ ఇదిగో ఈ దేశంలోనే ఉంది. దీన్ని ‘టోంగో సునామీ రాయి’ అని పిలుస్తారు. దీన్ని సందర్శించడానికి విదేశాల నుంచి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ రాయి ఎత్తు దాదాపు 30 అడుగులు. బరువేమో దాదాపు 16 లక్షల కిలోలు ఉంటుందని అంచనా!

సునామీకి సాక్ష్యం!

పసిఫిక్‌ మహాసముద్రంలో అప్పుడెప్పుడో 1883లో వచ్చిన సునామీకి సాక్ష్యంగా ఈ రాయి నిలుస్తోంది. అప్పట్లో టోంగా తీరానికి కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీని వల్ల పెద్ద ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. ఈ రాకాసి అలల తాకిడికి ఈ ‘టోంగా సునామీ రాయి’ సముద్రం నుంచి తీరం మీదుగా కొన్ని వందల మీటర్ల దూరానికి కొట్టుకువచ్చిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ రాయి అగ్నిపర్వతానికి సంబంధించిన భాగమై ఉంటుందని కూడా మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

దశలవారీగా...!

సునామీ వల్ల స్థానభ్రంశం చెందిన రాళ్లలో బహుశా ఇదే పెద్దదై ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సంఘటన ఒక్కసారిగా జరిగింది కాదని, దశలవారీగా కూడా సంభవించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ అతిపెద్ద రాయి టోంగాలోని నేల స్వభావానికి భిన్నంగా ఉంటుంది. దీనికి పగడపు రాయికి ఉండే లక్షణాలూ ఉన్నాయి. ఇక్కడ నేల చదునుగా ఉంది కాబట్టి, పై నుంచి దొర్లుకువచ్చే అవకాశాలూ లేవు. మరో వింత ఏంటంటే.. ఈ పే..ద్ద రాయి నిత్యం పచ్చదనంతో కళకళలాడుతూ కనిపిస్తుంటుంది.

జానపద కథల్లో...

ఈ రాయి ప్రస్తావన అక్కడి స్థానిక జానపద కథల్లోనూ ఉంది. ఒక పురాణం ప్రకారం... మౌయ్‌ అనే దేవుడు పే...ద్ద నరమాంస భక్షక కోడిని చంపి, మానవులను రక్షించాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా సముద్రం నుంచి కొన్ని బండరాళ్లను ఒడ్డుకు విసిరాడు. వాటిలో ఈ టోంగా సునామీ రాయి ఒకటి! ఇది నిజమని చాలా మంది టోంగా ప్రజలు నమ్ముతుంటారు. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ఈ కొండంత బండరాయి విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని