మనసంతా... నలుసంత ఉంగరం!

అదో వజ్రపుటుంగరం. సూది బెజ్జంలోంచి దూరుతుంది! అరచేతిలో పట్టుకుంటే... భూతద్దం ఉంటే కానీ కనిపించదు! అగ్గిపుల్ల మొన అంత కూడా ఉండదు. ఉఫ్‌మని ఊదితే ఎగిరి ఎక్కడో పడుతుంది. మరి ఆ బుజ్జి ఉంగరం విశేషాలేంటో తెలుసుకుందామా!

Published : 16 Jun 2023 00:19 IST

అదో వజ్రపుటుంగరం. సూది బెజ్జంలోంచి దూరుతుంది! అరచేతిలో పట్టుకుంటే... భూతద్దం ఉంటే కానీ కనిపించదు! అగ్గిపుల్ల మొన అంత కూడా ఉండదు. ఉఫ్‌మని ఊదితే ఎగిరి ఎక్కడో పడుతుంది. మరి ఆ బుజ్జి ఉంగరం విశేషాలేంటో తెలుసుకుందామా!

చిన్ని అంగుళీకాన్ని బెలారస్‌ దేశానికి చెందిన వదిమ్‌ కచన్‌ తయారు చేశారు. ప్రపంచంలోకెల్లా అతిచిన్న ఉంగరం ఇదేనని ఈయన చెబుతున్నారు. ఈ ఉంగరాన్ని బంగారంతో తయారు చేశారు. ఇందులో ఒక చిన్న వజ్రాన్ని కూడా పొదిగారు. ఇందులో అమర్చిన వజ్రం కేవలం 0.002 క్యారెట్లు మాత్రమే ఉంది. ఇక మొత్తంగా ఉంగరం బరువు కేవలం 0.01 గ్రాములు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా దీన్ని ప్రపంచంలోకెల్లా అతి చిన్న ఉంగరం అని అధికారికంగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’వారైతే ధ్రువీకరించలేదు.

మన రికార్డు బ్రేక్‌!

వదిమ్‌ కచన్‌్ ఈ బుజ్జి వజ్రపుటుంగరానికి రూపం ఇవ్వకముందు వరకు ప్రపంచంలోనే అతిచిన్న ఉంగరం తయారు చేసిన రికార్డు మన భారతీయుడి పేరు మీదనే ఉండేది. ఇప్పుడది బద్దలైంది. అనిష్‌ వర్మ రెండు మిల్లీమీటర్ల చుట్టుకొలత, పది మిల్లీగ్రాముల బరువుతో చిన్న ఉంగరాన్ని 2007లో తయారు చేశాడు. ప్రపంచంలోనే అతిచిన్న ఉంగరంగా దీన్ని ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు గుర్తించారు. వదిమ్‌ కచిన్‌ తయారుచేసిన బుజ్జి వజ్రపుటుంగరం మాత్రం దీని కన్నా చాలా చిన్నది.

బాల్యం నుంచే...

వదిమ్‌ కచన్‌కు బాల్యం నుంచే చిన్న చిన్న వస్తువులను తయారు చేయడం అంటే చాలా ఇష్టం. అల్యూమినియం తీగలతో చిన్న చిన్న కత్తులు తయారు చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేసేవాడు. పెద్ద కాగితాలను చించి వాటితో ఒక సెంటీమీటరు పరిమాణమున్న పుస్తకాలనూ చక్కగా తయారు చేసేవాడు. ఆ ఉత్సుకతే ఆయన్ను ఆభరణాల తయారీ వైపు నడిపించింది.

తుమ్మితే పోయింది...!

గతంలోనూ వదిమ్‌ కచన్‌ ఓ బుజ్జి ఉంగరాన్ని తయారు చేశాడు. అది కూడా సూది బెజ్జంలోంచి బయటకు వచ్చేది. కానీ వదిమ్‌ తుమ్మినప్పుడు ఆ ఉంగరం ఎగిరిపోయింది. ఎంత వెతికినా అది దొరకలేదు. అందుకే మళ్లీ తయారు చేశారు. తాను చిన్న చిన్న ఆభరణాలను డబ్బుకోసం కాకుండా, తన అభిరుచి కొద్దీ తయారు చేస్తున్నానని చెబుతున్నాడు ఈ అంకుల్‌. మొత్తానికి ఈయన తయారు చేసిన బుజ్జి ఉంగరం సంగతులు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని