చిత్రాలే ..పర్యావరణ పాఠాలై..!

హలో ఫ్రెండ్స్‌.. ‘నేను మారితే, ప్రపంచం మొత్తం మారిపోతుందా ఏంటి?’ అని చాలామంది అంటూ ఉంటారు. చిన్న విషయమేనంటూ తెలిసో తెలియకో పర్యావరణానికి హాని కలిగిస్తుంటారు

Updated : 17 Jun 2023 03:49 IST

హలో ఫ్రెండ్స్‌.. ‘నేను మారితే, ప్రపంచం మొత్తం మారిపోతుందా ఏంటి?’ అని చాలామంది అంటూ ఉంటారు. చిన్న విషయమేనంటూ తెలిసో తెలియకో పర్యావరణానికి హాని కలిగిస్తుంటారు. కానీ, వారందరికీ భిన్నంగా ఓ నేస్తం మాత్రం ‘మార్పు నాతోనే మొదలవ్వాలి’ అంటోంది. అలా అనడమే కాదు.. చేతల్లోనూ చూపుతూ అందరితో శెభాష్‌ అనిపించుకుంటోంది. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!

కేరళ రాష్ట్రంలోని కోచికి చెందిన వందనకు పదిహేను సంవత్సరాలు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న ఈ నేస్తం.. తన పెయింటింగ్స్‌తో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌తోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరంపైన అవగాహన కల్పిస్తోంది.

చిత్రకళే మార్గం..

రోజూ బడికి వచ్చివెళ్లే దారిలో ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లు.. కుప్పలుగా పడి ఉండటాన్ని గమనించే ఉంటారు. అవన్నీ అలాగే ఉంటే.. పర్యావరణంతోపాటు మన మనుగడకే ప్రమాదం. ఒకరోజు అలా పోగుపడిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను చూసి వందన చాలా బాధపడింది. ఇంటికి వెళ్లి, తండ్రికి విషయం చెప్పి.. ఆ సమస్య పరిష్కారానికి ఏదో ఒకటి చేయాలని ఉందంది. అప్పటికే ఈ నేస్తం బొమ్మలు బాగా వేస్తుండటంతో.. ఆ చిత్రకళనే పర్యావరణ పరిరక్షణకు వేదికగా ఎంచుకోవాలని ఆయన సూచించారు. తండ్రి సలహా తనకూ నచ్చడంతో సరేనంది.

వస్త్ర కాన్వాసులే..

తండ్రి సూచన మేరకు.. ఆ మరుసటి రోజే ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి వస్త్ర పెయింటింగ్‌ కాన్వాసులు తయారు చేసే పరిశ్రమకు వెళ్లింది వందన. ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలు, రీసైక్లింగ్‌ తదితర అంశాలకు సంబంధించిన బొమ్మలను ఆ వస్త్ర కాన్వాసులపైనే గీయడం ప్రారంభించింది. తన వయసు పిల్లలకూ అర్థమయ్యేలా చిన్న చిన్న కథల రూపంలోనూ పెయింటింగ్స్‌ వేసేది. అంతేకాదు.. రీసైక్లింగ్‌ చేసిన కాన్వాసుల మీదే మన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి పి.వి.సింధు.. ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పెయింటిగ్స్‌ గీసింది. ఈ బాలిక ఆర్ట్‌ వర్క్‌ గురించి తెలియడంతో ఏకంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచే ప్రశంసలు దక్కాయట.

వీడియో రూపంలో..

ఇటీవల ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ సందర్భంగానూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన చర్యలపైన సూచనలు చేస్తూ, మిగిలిన వారూ తనతో చేతులు కలపాలని కోరుతూ ఓ వీడియో చేసింది. సోషల్‌ మీడియా వేదికగా దాన్ని రిలీజ్‌ చేయడంతో.. ఎక్కడెక్కడి నుంచో తనకు అభినందనలు తెలుపుతూ మెసేజులు పంపారట.

సేవా కార్యక్రమాల్లోనూ..

ప్రకృతి, సామాజిక సేవకు సంబంధించి స్థానికంగా చేపట్టే కార్యక్రమాల్లోనూ వందన ఉత్సాహంగా పాల్గొంటుంది. పరిశుభ్రత అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలని చెబుతూ.. వ్యక్తిగత శుభ్రత నుంచి రోడ్డు ప్రమాదాల వరకూ వివిధ వేదికల మీద ప్రసంగాలూ ఇస్తోంది. ఇంకో విషయం ఏంటంటే.. ప్లాస్టిక్‌ని రీసైకిల్‌ చేసి తయారు చేసిన వస్త్రాన్నే బడి పిల్లల యూనిఫాం కుట్టేందుకు ఉపయోగించాలని కోరుతోంది. ముందు చిన్నారులకు అవగాహన కల్పిస్తే, వారిని చూసి పెద్దలూ ఆ దిశగా ఆలోచిస్తారని చెబుతోంది వందన. ఒకవైపు చదువుకుంటూనే.. ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతను భుజాన వేసుకున్న ఈ నేస్తం నిజంగా గ్రేట్‌ కదూ! అందుకే, మనమూ ప్లాస్టిక్‌ వాడకాన్ని సాధ్యమైనంతగా తగ్గించేద్దాం ఫ్రెండ్స్‌.. సరేనా!


 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు