ఎసిక్నెమిస్‌ ర్యుక్యువానా అనే నేను!!

నేను విచిత్రంగా ఉంటే... చిత్రంగా కాక ఇంకెలా చూస్తారు! నన్ను ఇంతకు ముందు వరకు మీరెప్పుడూ చూడనేలేదు కదూ! మీరే కాదు... అసలు ఈ ప్రపంచానికే నేను తెలియదు. మీ శాస్త్రవేత్తలు ఈ మధ్యే నన్ను కనుగొన్నారు మరి!

Updated : 18 Jun 2023 07:11 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా? ఏంటి నన్ను అలా చిత్రంగా చూస్తున్నారు. అవును కదూ... నేను విచిత్రంగా ఉంటే... చిత్రంగా కాక ఇంకెలా చూస్తారు! నన్ను ఇంతకు ముందు వరకు మీరెప్పుడూ చూడనేలేదు కదూ! మీరే కాదు... అసలు ఈ ప్రపంచానికే నేను తెలియదు. మీ శాస్త్రవేత్తలు ఈ మధ్యే నన్ను కనుగొన్నారు మరి! నా విశేషాలేంటో తెలుసా! తెలియదు కదా మీకు.. అవన్నీ చెప్పి పోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా? ఏంటి నన్ను అలా చిత్రంగా చూస్తున్నారు. అవును కదూ... నేను విచిత్రంగా ఉంటే... చిత్రంగా కాక ఇంకెలా చూస్తారు! నన్ను ఇంతకు ముందు వరకు మీరెప్పుడూ చూడనేలేదు కదూ!

ఇంతకీ నా పేరేంటంటే... ఎసిక్నెమిస్‌ ర్యుక్యువానా! పలకడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కదూ! మరేం చేయమంటారు చెప్పండి. మీ శాస్త్రవేత్తలే నాకు ఈ నోరు తిరగని పేరు పెట్టారు. సరే అయితే ఓ పని చేయండి.... నేను కాస్త పీతలా కూడా ఉన్నాను అని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. నన్ను మీరు పీతపురుగు అని పిలుచుకోండి. లేకపోతే నా ఒంటి మీద ముళ్లలాంటి నిర్మాణాలూ ఉన్నాయి కాబట్టి ముళ్ల పురుగు అనైనా పిలవండి. ఏం ఫర్లేదు! నాకేం అభ్యంతరం లేదు. అసలింతకీ నన్ను ఎక్కడ కనిపెట్టారో తెలుసా..! జపాన్‌లో!! అంటే అచ్చం జపాన్‌లో కాదనుకోండి. దాన్ని ఆనుకుని ఉన్న ఇషిగాకి ద్వీపంలో, అలాగే ఒకినావా ద్వీపంలోని యాన్‌బరూ నేషనల్‌ పార్క్‌లో నేను ఇటీవల మీ మనుషుల కంటికి కనిపించాను.

ఇంతకు ముందెన్నడూ...!

గతంలో కూడా నన్ను మీరెప్పుడూ చూడలేదు. నేను ద్వీపాల్లో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో బతుకుతున్నాను కాబట్టి నా ఉనికిని ఇప్పటి వరకు మీరెవరూ కనుగొనలేకపోయారు. ఒకినావాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఓఐఎస్‌టీ) పరిశోధకుల కృషి ఫలితంగా నా గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది. వాళ్లు 2015 నుంచి ఒకినావా ద్వీపంలోని కీటకాల మీద పరిశోధనలు చేస్తున్నారు. పురుగులను సేకరించడానికి నెట్‌ ట్రాప్‌లను వాడుతున్నారు. అలా 2022 ప్రాంతంలో నేను మీకు చిక్కాను. నన్ను ఎసిక్నెమిస్‌ జాతికి చెందిన జీవిగా గుర్తించారు. కానీ నేను మరింత భిన్నంగా ఉన్నాను.

మరిన్ని పరిశోధనలు...

ఎసిక్నెమిస్‌లో ఇప్పటికే దాదాపు 180 రకాల జాతులున్నాయి. నన్ను కొత్త జాతిగా ప్రకటించడానికి శాస్త్రవేత్తలకు అంత తేలిక కాలేదు. ఎంతో కసరత్తు తర్వాతే నన్ను కొత్తజాతి పురుగుగా తేల్చారు. ఇంకా నా మీద మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా ఎసిక్నెమిస్‌ ర్యుక్యువానా అనే నేను ఆగ్నేయాసియాలోని కొన్ని ఇతర జాతుల కీటకాలతో దగ్గరి సంబంధం కలిగిఉన్నట్లు కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. అయితే దీన్ని కచ్చితంగా నిర్ధారించాలంటే మరిన్ని డీఎన్‌ఏ విశ్లేషణలు అవసరమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేస్తాలూ.... మొత్తానికి, ప్రస్తుతానికి ఇవీ నా విశేషాలు. సరే ఇక ఉంటామరి.. బై... బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని