దొండను కాదు నిమ్మనే!

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! నన్ను చూసి దొండకాయ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. చూడ్డానికైతే అలా ఉంటాను కానీ.. నిజానికి నేను నిమ్మకాయను! వింతగా ఉంది కదూ! అందుకే మరి... చిన్ని నేస్తాలైన మీకు నా గురించి చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.

Updated : 19 Jun 2023 06:40 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌ బాగున్నారా! నన్ను చూసి దొండకాయ అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. చూడ్డానికైతే అలా ఉంటాను కానీ.. నిజానికి నేను నిమ్మకాయను! వింతగా ఉంది కదూ! అందుకే మరి... చిన్ని నేస్తాలైన మీకు నా గురించి చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు సిట్రస్‌ ఆస్ట్రాలసికా. పలకడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కదూ! ఏం ఫర్లేదు... మీరు ఎంచక్కా ఆస్ట్రేలియన్‌ ఫింగర్‌ లైమ్‌, కావియర్‌ లైమ్‌ అని పిలుచుకోండి. నేను ఎక్కువగా ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌, న్యూ సౌత్‌వేల్స్‌లో కనిపిస్తాను.

చిన్ని చిన్ని చెట్టుకు కాస్తానోచ్‌!

మామూలుగా మీ దగ్గర నిమ్మకాయలు గుండ్రంగా ఉంటాయి కదూ! నేను మాత్రం పొడవుగా పెరుగుతాను. నా చెట్టు కూడా చిన్నగా ఉంటుంది. కేవలం రెండు మీటర్ల నుంచి ఏడు మీటర్ల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది. ఆకులు కూడా మీ దగ్గర పెరిగే నిమ్మతో పోల్చుకుంటే చిన్నగా ఉంటాయి. ఒక సెంటీమీటరు నుంచి ఆరు సెంటీమీటర్ల పొడవు, మూడు నుంచి ఇరవై అయిదు మిల్లీమీటర్ల వరకు వెడల్పు పెరుగుతాయి. చెట్టు కొమ్మలకు ముళ్లు కూడా ఉంటాయి. తెల్లని పూలు పూస్తాయి. అవే కాయలుగా మారతాయి.

రంగులే రంగులు...

నాలో పలురకాలూ ఉన్నాయి. ఆకుపచ్చ, ముదురు ఎరుపు, నలుపు రంగుల్లోనూ నేను కాస్తాను. నా లోపలి పదార్థంలోనూ రకాన్ని బట్టి వైవిధ్యం ఉంటుంది. తెలుపు, లేత ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోనూ లభ్యమవుతాయి. నిమ్మకాయలకు ఉన్నట్లే విత్తనాలుంటాయి. నాలోనూ పుష్కలంగా విటమిన్‌-సి ఉంటుంది. రుచి కూడా అచ్చం నిమ్మకాయలానే ఉంటుంది.

గిరాకే గిరాకీ...

నాకు ఈ మధ్య డిమాండ్‌ పెరిగింది. నాతో జ్యూస్‌లు తయారు చేస్తున్నారు. నన్ను పలువంటకాల్లో అలంకరణగానూ ఉపయోగిస్తున్నారు. అంతెందుకు నాతో ఊరగాయలు కూడా చేసుకుంటున్నారు. ఇంకా నా తొక్కను ఎండబెట్టి వంటల్లో మసాలానూ ఉపయోగించుకుంటున్నారు. దీంతో శాస్త్రవేత్తలు నా మీద ప్రయోగాలు చేసి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్‌ రకాలనూ సృష్టించారు. సంప్రదాయ రకాలతో పోల్చుకుంటే ఇవి ఎక్కువ దిగుబడిని ఇస్తున్నాయి. చీడపీడలను కూడా తట్టుకుని పెరుగుతున్నాయి. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ! నాకు తెలిసి మీకు ఈ పాటికే నోరు ఊరిపోయి ఉంటుంది కదా! ప్చ్‌... సారీ ఫ్రెండ్స్‌... అయినా నేను మీ దగ్గర దొరకను!! సరే ఇక ఉంటామరి బై.. బై..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని