రైఫిల్‌ కాదు.. కెమెరానే..!

హలో ఫ్రెండ్స్‌.. మనకు కెమెరా అంటే సెల్‌ఫోనే  ముందు గుర్తొస్తుంది.. కానీ, ఈవెంట్‌ ఫొటోగ్రాఫర్లు, వైల్డ్‌లైఫ్‌ ప్రొషెషనల్స్‌ చేతుల్లో పెద్ద పెద్ద కెమెరాలను చూసే ఉంటారు.

Updated : 20 Jun 2023 00:40 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు కెమెరా అంటే సెల్‌ఫోనే  ముందు గుర్తొస్తుంది.. కానీ, ఈవెంట్‌ ఫొటోగ్రాఫర్లు, వైల్డ్‌లైఫ్‌ ప్రొషెషనల్స్‌ చేతుల్లో పెద్ద పెద్ద కెమెరాలను చూసే ఉంటారు. అటువంటి వృత్తుల్లో ఉన్న వారికి సెల్‌ఫోన్లలోని కెమెరాల సామర్థ్యం సరిపోవు. అందుకే, ధరకు వెనకాడకుండా తమ అవసరాన్ని బట్టి కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. అచ్చం మెషీన్‌ గన్‌లా ఉండే కెమెరాలూ వచ్చేశాయి మరి.. ఆ వివరాలే ఇవి..
జపాన్‌కు చెందిన ఓ సంస్థ ఇటీవల తమ వెబ్‌సైట్‌లో సరికొత్త కెమెరా అని పరిచయం చేస్తూ.. ‘స్టాక్‌క్యామ్‌’ పేరిట గన్‌లాంటి ఓ వస్తువును విడుదల చేసింది. అది చూసిన వారందరూ అవాక్కయ్యారు. ఎందుకూ అంటే.. అది అచ్చం ఆర్మీలో సైనికులు వాడే రైఫిల్‌లా ఉంది మరి.

ఆ బాధలు హుష్‌..

ఫొటోగ్రాఫర్లు సాధారణంగా వివిధ కోణాల్లో రకరకాల చిత్రాలు తీస్తుంటారు. కానీ, ఒక్కోసారి ఒక్కో కోణంలో మాత్రమే ఏదైనా ఫొటోను తీయగలం. అయితే, ఈ సరికొత్త రైఫిల్‌లాంటి కెమెరాతో ఒకటి కంటే ఎక్కువ కోణాల్లో ఒకేసారి చిత్రాలు తీయవచ్చని తయారీ సంస్థ చెబుతోంది. సాధారణ కెమెరాల్లో అయితే లెన్స్‌ దగ్గర కవర్‌.. పొరపాటుగా ఏమైనా ఓపెన్‌ అయిందేమోనని అప్పుడప్పుడూ చూసుకుంటూ ఉండాలి. కానీ, ఇందులో మాత్రం ఆ ఇబ్బందే ఉండదట. లెన్స్‌ కవర్‌ను లాక్‌ చేసేందుకు ఓ సదుపాయం కల్పించారు. అంతేకాదు.. ఫోకస్‌ చేయాలనుకున్న చోట మరింత నాణ్యత ఉండేలా ఒక బటన్‌, వీడియో మోడ్‌ కోసం మరో బటన్‌ కూడా ఇచ్చారు.

అచ్చం అలాగే ఉండాలని..

మొదట ఈ సరికొత్త కెమెరాను ఎల్లో లేదా ఆరెంజ్‌ రంగులో డిజైన్‌ చేయాలనుకున్నారు. కానీ, అలా అయితే తాము అనుకున్న రైఫిల్‌ లుక్‌ రాదని.. ఇలా నలుపు రంగులో తీసుకొచ్చామని తయారీదారులు చెబుతున్నారు. గన్‌ మాదిరే దీన్ని భుజాలపైన పెట్టుకొని, పాయింటర్‌ నుంచి చూస్తూ.. లెన్స్‌తో సెట్టింగ్స్‌ సరిజేసుకొని.. క్లిక్‌ చేయడమే అన్నమాట. మరింత మిలటరీ లుక్‌ కోసం దాని మీద రాక్‌స్టార్‌ లోగోతోపాటు గీతలూ ఉండేలా చూశారు.

జాగ్రత్తా అవసరమే..

కేవలం రైఫిల్‌ మాదిరి ఉండమే ఈ కెమెరా ప్రత్యేకత అని అనుకోవద్దు నేస్తాలూ.. ఇందులో మైక్రోఫోన్‌, చీకట్లోనూ ఫొటోలు తీయగలిగేలా లైట్లు, అదనంగా లెన్సులూ ఉన్నాయట. తయారీదారులు ఇంకా దీని ధర, ఇతర వివరాలు మాత్రం బయటికి వెల్లడించలేదు. మన దగ్గర అడవుల్లో ఇలాంటి కెమెరాతో తిరిగితే.. రైఫిల్‌తో జంతువులు, పక్షులను వేటాడుతున్నామని పొరపడే ప్రమాదం ఉందంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ సరికొత్త రైఫిల్‌ కెమెరా చూసేందుకు భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని