ఏడంతస్తుల ఒంటి స్తంభం మేడ!

కాకులకేమో ఒకటో అంతస్తు, రామచిలుకలకు రెండోది, పావురాలకు మూడో అంతస్తు.. ‘ఏంటి ఇదంతా?’ అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్‌... పక్షులు నివసించేందుకు ఏడంతస్తుల కాంక్రీటు మేడలో చేసిన ఏర్పాట్లే ఇవి. నమ్మడం లేదా నేస్తాలూ.. అయితే, ఈ కథనం చదివితే అసలు విషయమేంటో మీకే తెలుస్తుంది. మరింకెందుకాలస్యం..!

Updated : 22 Jun 2023 06:21 IST

కాకులకేమో ఒకటో అంతస్తు, రామచిలుకలకు రెండోది, పావురాలకు మూడో అంతస్తు.. ‘ఏంటి ఇదంతా?’ అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్‌... పక్షులు నివసించేందుకు ఏడంతస్తుల కాంక్రీటు మేడలో చేసిన ఏర్పాట్లే ఇవి. నమ్మడం లేదా నేస్తాలూ.. అయితే, ఈ కథనం చదివితే అసలు విషయమేంటో మీకే తెలుస్తుంది. మరింకెందుకాలస్యం..!

నుషులు నివసించేందుకు ఇళ్లు ఉంటాయి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకూ పాకలు ఉంటాయి. పెంపుడు జంతువులకైతే ఇక చెప్పనవసరం లేదు. వాటి రాజభోగాలకు కొదవే ఉండదు. ‘మరి పక్షుల సంగతేంటి?’ - ఇదే ప్రశ్న ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ నలుగురు మిత్రుల మదిలో మెదిలింది. దాంతో వెంటనే పక్షుల కోసమే ఏకంగా ఏడంతస్తుల మేడను నిర్మించారు.

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం..  

అలీగఢ్‌ జిల్లా దుమేడి గ్రామానికి చెందిన దేవకీనందన్‌, రామ్‌నివాస్‌, రామ్‌హరి, మునేశ్‌ సోదరులు. కొన్నేళ్ల క్రితం మరణించిన వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏదైనా చేయాలని అనుకున్నారు. ఏటా వేసవి కాలంలో ఎండలకు పక్షులు దాహం, ఆకలికి ఇబ్బంది పడటాన్ని వాళ్లు గమనించారు. దాంతో పక్షుల కోసం గూళ్లను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. గతంలో రాజస్థాన్‌లో అలాంటివి నిర్మించారని తెలుసుకుని, వారిని సంప్రదించారు. అలా దాదాపు ఏడు అంతస్తుల మేడ కట్టి, అందులో మొత్తం 512 గూళ్లను ఏర్పాటు చేశారు. దానికి ‘పక్షి ఘర్‌’ అని పేరు కూడా పెట్టారు. వర్షాలు, తుపానులు, గాలిదుమారం తదితర విపత్తుల సమయంలోనూ ఎటువంటి భయం లేకుండా పక్షులు వీటిలో జీవించేలా అన్ని సదుపాయాలూ కల్పించారు. ఈ నిర్మాణం పూర్తి చేసేందుకు రూ.7 లక్షలు ఖర్చు చేసినట్లు ఆ సోదరులు చెబుతున్నారు. ఈ సోదరుల ప్రయత్నం భేష్‌ కదూ!


చెక్క గూళ్లు.. పక్షులకు ఇళ్లు!

గతంలో మన ఇళ్ల ముందర పిచ్చుకలు కిచకిచ శబ్దంతో భలే సందడి చేసేవి. కానీ, వివిధ కారణాలతో ప్రస్తుతం వాటి సంఖ్య చాలా తగ్గిపోయింది. అవొక్కటే కాదు.. అసలు చాలారకం పక్షులే కనుమరుగవుతున్నాయి. దాంతో అంతరించిపోతున్న పక్షి జాతులను కాపాడేందుకు పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన పర్యావరణ ప్రేమికులు కృషి చేస్తున్నారు. ఆ వివరాలే ఇవి..

ఎండలు, వానలను తట్టుకుని జీవించేలా పక్షుల కోసం చెక్కలతో చేసిన గూళ్లను సిద్ధం చేయిస్తున్నారు బర్నాలా జిల్లా కేంద్రానికి చెందిన పర్యావరణ ప్రేమికులు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపు 6500 గూళ్లను ఏర్పాటు చేయించారు. వాటిల్లో ఆహారంతోపాటు నీటినీ అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాదు.. పచ్చదనాన్ని పెంపొందించే ఉద్దేశంతో లక్షకు పైగా మొక్కలను నాటారు. స్థానిక కార్మికులతో మాట్లాడి, పక్షుల నివాసానికి అనువుగా చెక్కతో గూళ్లను తయారు చేయిస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో చుట్టుపక్కల జిల్లాల వారూ తమ దగ్గరా అలాంటివి ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారట. పిల్లలూ.. వీళ్ల ప్రయత్నం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని