నేను.. గిన్నిస్‌ గినియా పిగ్‌నోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌. నేనో గినియా పిగ్‌ను. అంటే పందిని కాదు సుమా! కుందేలు పోలికలున్న జంతువును అన్నమాట. నాకో ప్రత్యేకత ఉంది! అదేంటంటే... నేను ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాను! ఆ వివరాలేంటో చక్కగా మీకు చెప్పిపోదామనే ఇదిగో... ఇలా.. పరుగు పరుగున వచ్చా..!

Updated : 23 Jun 2023 05:12 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌. నేనో గినియా పిగ్‌ను. అంటే పందిని కాదు సుమా! కుందేలు పోలికలున్న జంతువును అన్నమాట. నాకో ప్రత్యేకత ఉంది! అదేంటంటే... నేను ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాను! ఆ వివరాలేంటో చక్కగా మీకు చెప్పిపోదామనే ఇదిగో... ఇలా.. పరుగు పరుగున వచ్చా..!

నా పేరు మోల్‌. నేనుండేది హంగేరీలో. నా యజమానురాలి పేరు ఎమ్మా మిల్లర్‌. గినియా పిగ్‌నైన నాకు బాస్కెట్‌ బాల్‌ ఆడటమంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు తెగ ఆడేస్తా. మా యజమానురాలే నాకీ ఆటను పరిచయం చేశారు. దీంతో నేను ఎంచక్కా ఈ ఆటను నేర్చేసుకున్నా. కొద్దిరోజుల్లోనే ఇందులో ప్రావీణ్యం సాధించాను.

వేగం, కచ్చితత్వం...

మా యజమానురాలు ఎమ్మా మిల్లర్‌ సాయంతో నేను ప్రపంచ రికార్డును సృష్టించాను. ఏకంగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించాను. చిన్న రింగ్‌లో 4.4 సెంటీమీటర్ల గోళాలను కేవలం 30 సెకన్లలోనే నాలుగు సార్లు వేశాను. వేగం, కచ్చితత్వంతోనే ఇది సాధించాను. ఈ ఫీటే నన్ను హీరోను చేసింది. నా కంటే కొన్ని రెట్లు పెద్దగా ఉండే ఓ కుందేలు కన్నా నేనే మెరుగైన ప్రదర్శన ఇచ్చాను. నా వీడియోను మా యజమానురాలు ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేస్తే నాకు తెగ లైకులూ వచ్చాయి తెలుసా!  

రికార్డ్‌ బ్రేక్‌..

ఇంతకు ముందు ఈ రికార్డ్‌ బినీ అనే కుందేలు పేరు మీద ఉండేది. దీన్ని నేను అవలీలగా బ్రేక్‌ చేశాను. నాకు ఫిజికల్‌ యాక్టివిటీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మా యజమానురాలి శిక్షణ కూడా దీనికి కారణం. ఇదే నా విజయ రహస్యం. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా.. మా యజమానురాలు నాకోసం చూస్తుంటుంది.. బై... బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని