షాంపూ ఇచ్చే మొక్కను నేను!

హాయ్‌ఫ్రెండ్స్‌! బాగున్నారా?! నేనైతే బాగున్నాను. ఇంతకీ నేనెవరంటే... ఓ మొక్కను. అన్నట్లు మీరు తలకు రకరకాల షాంపూలు పెట్టుకుంటారు కదా! ఇప్పుడు ఈ షాంపూ ప్రస్తావన ఎందుకంటే నేను షాంపూ మొక్కను మరి.

Updated : 25 Jun 2023 04:34 IST

హాయ్‌ఫ్రెండ్స్‌! బాగున్నారా?! నేనైతే బాగున్నాను. ఇంతకీ నేనెవరంటే... ఓ మొక్కను. అన్నట్లు మీరు తలకు రకరకాల షాంపూలు పెట్టుకుంటారు కదా! ఇప్పుడు ఈ షాంపూ ప్రస్తావన ఎందుకంటే నేను షాంపూ మొక్కను మరి. అవునవును...! ఇంతకు ముందు వాక్యం చదివీ చదవంగానే మీరు మీ మనసులో అనుకున్నది వందకు వందశాతం వాస్తవమే. నేను నిజంగానే షాంపూను ఇస్తాను! కాస్త చిత్రంగా.. ఇంకాస్త విచిత్రంగా ఉంది కదూ! అందుకే నా విశేషాలు చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను. మరి నా వివరాలేంటో తెలుసుకుంటారా?!

నాపేరు జింగిజర్‌ జెరంబెట్‌. నన్ను ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు కదూ! కానీ మీకో ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా... నేను నిజానికి మన భారతదేశానికి చెందిన మొక్కనే! కానీ కొందరు నన్ను హవాయికి పరిచయం చేశారు. అక్కడ నేను బాగా పెరిగాను. ప్రస్తుతం దాదాపు ఆసియా దేశాలన్నింటికీ విస్తరించాను. ఎందుకంటే నేను పెరగడానికి సరిగ్గా సరిపోయే వాతావరణ పరిస్థితులు ఈ ఖండంలోనే ఉన్నాయి మరి.

నాది అల్లం వారి కుటుంబం!

మీకు మరో విచిత్రమైన విషయం చెప్పనా! నేను అల్లం జాతికి చెందిన మొక్కను. అందుకే నన్ను కేవలం జింగిజర్‌ జెరంబెట్‌ అనే పేరుతోనే కాకుండా, రెడ్‌ పిన్‌కోన్‌ జింజర్‌, బిట్టర్‌ జింజర్‌, అవాపుహి, షాంపూ జింజర్‌ లిల్లీ అని కూడా పిలుస్తారు. నన్ను వంటకాల్లో సువాసన కోసమూ ఉపయోగిస్తారు. ఇంకో విషయం ఏంటంటే నాలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా నా వేర్లను ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. వేర్ల పొడిని కూడా వంటల్లో వాడతారు. నా వేర్లను రైజోమ్స్‌ అని పిలుస్తారు. వీటిని అల్లంలా వినియోగిస్తారు. కానీ, అవి చాలా చేదుగా ఉంటాయి. అందుకే నన్ను బిట్టర్‌ జింజర్‌ అని పిలుస్తారు. జావా దేశంలో అయితే నా పత్రాలను కాల్చిన మాంసంలో ఫ్లేవర్‌ కోసం కూడా వాడతారు తెలుసా! నేను అవుట్‌డోర్‌లోనే కాదు... ఇండోర్‌లోనూ పెరగగలను.

ఇప్పటికీ నేనే దిక్కు!

నాకు కోన్‌లాంటి భాగం కాస్తుంది. ముందు అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. అప్పుడే దీని నుంచి చిక్కని ద్రవంలాంటి పదార్థం తయారవుతుంది. ఇది చక్కని సువాసనను కలిగి ఉంటుంది. ఈ పదార్థాన్ని ఇప్పటికీ షాంపూలు, కండీషనర్ల తయారీలో వాడుతున్నారు. అందుకే నన్ను షాంపూ మొక్క అని పిలుస్తారు. ఈ ద్రవాన్ని ప్రాసెసింగ్‌ చేయకుండానే, నేరుగా కూడా ఎంచక్కా షాంపూలా, మసాజ్‌ చేసే లూబ్రికెంట్‌లానూ వాడుకోవచ్చు.

చిన్ని చిన్ని మొక్కను...

నేను అల్లం మొక్కలానే చాలా తక్కువ ఎత్తు మాత్రమే పెరుగుతాను. నాకు 10 నుంచి 12 పత్రాలుంటాయి. ఇవి దాదాపు 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు వరకు చేరుకుంటాయి. నాకు 3 నుంచి 10 సెంటీమీటర్ల పొడవుతో కోన్‌లాంటి భాగాలు పెరుగుతాయి. దీనికే తెలుపురంగు పువ్వులు పూస్తాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు... ఈ పువ్వుల అగ్రభాగాలు ముదిరాకే కోన్‌లాంటి భాగంలో సుగంధ ద్రావణం తయారవుతుంది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని