నేనో పే...ద్ద బల్లిని!

ఇంత పెద్ద ఆకారంలో ఉన్న నా పేరు కొమోడో డ్రాగన్‌. ఇంకా నన్ను కొమోడో మానిటర్‌ అని కూడా పిలుస్తారు. నేను బల్లి జాతికి చెందిన జంతువును. అంటే భూమి మీద జీవించే అతిపెద్ద బల్లిని.

Updated : 27 Jun 2023 05:34 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌..! ఎలా ఉన్నారు.. ఏంటి అలా చూస్తున్నారు? ఇంత భయంకరంగా ఉన్నాననా? అవును మరి నేనో పే..ద్ద బల్లిని. నా గురించి మీకు పెద్దగా తెలిసుండకపోవచ్చు. అందుకే ఇప్పుడు నా విశేషాలు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చా..!

ఇంత పెద్ద ఆకారంలో ఉన్న నా పేరు కొమోడో డ్రాగన్‌. ఇంకా నన్ను కొమోడో మానిటర్‌ అని కూడా పిలుస్తారు. నేను బల్లి జాతికి చెందిన జంతువును. అంటే భూమి మీద జీవించే అతిపెద్ద బల్లిని. మీ దేశంలో అయితే కనిపించను కానీ నేను ఇండోనేషియాలోని ఐలాండ్‌లలో ఉంటాను. మీకు ఇంకో విషయం తెలుసా.. నేను ఇండోనేషియా జాతీయ జంతువును కూడా. నేను గంటకు 20 కిలో మీటర్ల వేగంతో నడవగలను.

నేనంటే హడల్‌!

మీరు నన్ను చూస్తున్నట్లుగానే నా ఆకారం చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు 10 అడుగుల పొడవు, 70 కిలోల నుంచి 150 కిలోల వరకు బరువు పెరుగుతాను. మిగతా జంతువులేవైనా నా జోలికి రావడానికి చాలా భయపడతాయి. ఎందుకంటే నా గోర్లు చాలా పదునుగా, మందంగా ఉంటాయి. అలాగే నాకు 60 పళ్లు కూడా ఉంటాయి. వీటితోనే ఆహారాన్ని చీల్చుకుని తింటా.

గంటల వ్యవధిలోనే...

సాధారణంగా ఏ జంతువైనా తన శరీరం బరువుకు 35-40శాతం వరకు మాత్రమే ఆహారాన్ని తింటుంది. కానీ నేను మాత్రం 80శాతం ఆహారాన్ని ఒకేసారి తినగలను. నా లాలాజలం విషపూరితం. దీంతో నేను ఒక్కసారి జంతువును కొరికానంటే కొన్ని గంటల వ్యవధిలోనే అది మరణిస్తుంది. అందుకే నేను ముందుగా ఏదైనా జంతువును కొరుకుతాను. తర్వాత దాన్ని అనుసరిస్తాను. నా విషప్రభావానికి లోనయ్యాక, ఎంచక్కా దాన్ని కరకరలాడించేస్తా.

పసిగడతా.. పనిపడతా!

నా చుట్టుపక్కల నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎక్కడ జంతువులు ఉన్నా సరే... నా నాలుకతోనే వాటి ఉనికిని పసిగట్టగలను. అలా వాటిని వెంటాడి వేటాడి నా ఆకలి తీర్చుకుంటాను. ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి. నాకు ఆహారం తినే సమయం అవుతోంది..! ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నాకు బోలెడు ఆకలి వేస్తోంది. నేస్తాలూ.. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని