ప్రాంతానికో పేరు.. నా రూటే వేరు!

హాయ్‌ నేస్తాలూ.. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను.. ఇంతకీ నేనెవరో మీకు చెప్పనేలేదు కదూ.. ఇదిగో ఆ వివరాలన్నీ మీకు చెప్పి వెళ్దామనే ఇలా వచ్చాను. బుద్ధిగా కూర్చొని నా విశేషాలన్నీ తెలుసుకోండి మరి..

Updated : 30 Jun 2023 06:07 IST
హాయ్‌ నేస్తాలూ.. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను.. ఇంతకీ నేనెవరో మీకు చెప్పనేలేదు కదూ.. ఇదిగో ఆ వివరాలన్నీ మీకు చెప్పి వెళ్దామనే ఇలా వచ్చాను. బుద్ధిగా కూర్చొని నా విశేషాలన్నీ తెలుసుకోండి మరి..
ల్లని వర్ణంలో కనిపించే నన్ను ‘బ్లాక్‌ పాంథర్‌’ అని పిలుస్తారు. అడవి పిల్లి జాతికి చెందిన జంతువును. నేను భారతదేశంలో కూడా అక్కడక్కడా కనిపిస్తాను కానీ, ఎక్కువగా ఉత్తర అమెరికాలో ఉంటాను. అక్కడ నన్ను ‘బ్లాక్‌ జాగ్వర్‌’ అని కూడా పిలుస్తుంటారు. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోనేమో నన్ను ‘బ్లాక్‌ చీతా’గా వ్యవహరిస్తుంటారు. అందుకు కారణం లేకపోలేదు నేస్తాలూ.. చిరుత పులులకు ఉన్నట్లే, నా శరీరం మీద కూడా మచ్చలు ఉంటాయి. కానీ, నా చర్మం నలుపు రంగులో ఉండటంతో మీకు అవి అంతగా కనిపించవు.  

రాత్రిళ్లే వేటాడతా..

సాధారణంగా జంతువులన్నీ ఉదయమే వేటాడతాయి. రాత్రిళ్లు హాయిగా నిద్రపోతాయి. కానీ, నేను మాత్రం వాటన్నింటికీ భిన్నం. పగటి సమయంలో ఎంచక్కా చెట్లెక్కి నిద్రపోతా.. రాత్రి వేళల్లో మాత్రమే జంతువులను వేటాడతాను. ఎందుకంటే, నా రంగు చీకట్లో కలిసిపోయి, వేట సులభం అవుతుంది కాబట్టి.. రాత్రివేళల్లో ఇతర జంతువులు కూడా కొంత ఏమరపాటుగా ఉండటం నాకు కలిసొస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పనా.. నా ముందరి కాళ్ల కంటే వెనకవి కాస్త పెద్దగా ఉంటాయి. వాటి సాయంతోనే ఎంత పెద్ద చెట్లనైనా చకచకా ఎక్కేయగలను. ఇంకో విషయం ఏంటంటే.. నేను గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలను. నా పదునైన దంతాలతో సింహం కన్నా రెండు రెట్లు ఎక్కువ బలంగా ఇతర జంతువులను చీల్చి చెండాడుతా.

రెండేళ్ల వరకే అమ్మతో..

నేను జన్మించిన రెండు వారాల వరకు అసలు కళ్లే తెరవను. ఆ తరువాత మెల్లగా వేటాడటం నేర్చుకుంటాను. రెండేళ్ల వరకూ చిన్న చిన్న జంతువులను వేటాడుతూ, మా అమ్మ తెచ్చిన ఆహారంతో బొజ్జ నింపుకొంటా. ఇక ఆ తరువాత ఎవరి మీద ఆధారపడకుండా, ఒంటరిగానే ఆహారాన్ని సంపాదించుకుంటా. నాకు కంటి చూపు చాలా స్పష్టంగా ఉంటుంది. అంతేనా.. ఎంత చిన్న శబ్దం అయినా ఇట్టే పసిగట్టగలను. ఈతలో కూడా నాకు నేనే సాటి.  

ఆకుపచ్చ కళ్లు..

మేం దాదాపు 66 నుంచి 200 కిలోల వరకూ బరువు పెరుగుతాం. 37 నుంచి 65 అంగుళాల వరకు పొడవు ఉంటాం. అందులోనూ చాలావాటిలో తోకే సగం వరకూ ఉంటుంది. నా కళ్లు ఆకుపచ్చ రంగులో మెరుస్తుంటాయి. అడవిలో అయితే దాదాపు 12 ఏళ్లు, బోనులో ఉంచి పెంచితే 20 ఏళ్ల వరకు జీవిస్తాను. నేస్తాలూ.. ఇవీ నా విశేషాలు.. బాగున్నాయి కదూ.. ఇక ఉంటా మరి.. బై.. బై.!
 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని