ఆపిల్‌ కాని ఆపిల్‌ను నేను!

హాయ్‌ ఫ్రెండ్స్‌... నేనో పండును. ఆపిల్‌ కాని ఆపిల్‌ను. నన్ను మీరెప్పుడూ తిని ఉండరు. తినడం వరకు ఎందుకు? అసలు చూసే ఉండరు. నా పేరు కూడా మీకు తెలిసి ఉండదు. అందుకే నా ఊసులు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చా.

Updated : 06 Jul 2023 14:18 IST
 
హాయ్‌ ఫ్రెండ్స్‌... నేనో పండును. ఆపిల్‌ కాని ఆపిల్‌ను. నన్ను మీరెప్పుడూ తిని ఉండరు. తినడం వరకు ఎందుకు? అసలు చూసే ఉండరు. నా పేరు కూడా మీకు తెలిసి ఉండదు. అందుకే నా ఊసులు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చా. మరి నేను చెప్పే సంగతులు తెలుసుకుంటారా?!
నా పేరు ఎలిఫెంట్‌ ఆపిల్‌. ఎలిఫెంట్‌ ఆపిల్‌ అనగానే మీకు వెలగపండు గుర్తుకు వస్తుంది. కానీ నేను వెలగపండును కాదు. నా పూర్తి పేరు చల్తా ఎలిఫెంట్‌ ఆపిల్‌. కానీ అందరూ ఎలిఫెంట్‌ ఆపిల్‌ అని పిలుస్తారు. నన్ను ఏనుగులు, కోతులు ఎంతో ఇష్టంగా తింటాయి.

ఎంతో ఆరోగ్యం...

నా చెట్లు మరీ పొట్టి కావు. అలా అని పొడవూ కాదు. సాధారణంగా 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. మాలో కొన్ని 30 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతాయి. భారతదేశంతో పాటు, చైనా, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, థాయిలాండ్‌, లావోస్‌, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో కనిపిస్తాను. నేను తినదగిన పండును. ‘రోజూ ఆపిల్‌ తింటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదు’ అంటుంటారు కదా! నన్ను తిన్నా కూడా మీకు ఎంతో ఆరోగ్యం తెలుసా!!
 

ఆయుర్వేదంలో...

నా చెట్టును ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని తెగలవారు నా చెట్టుపై ఎక్కువగా ఆధారపడతారు. కేవలం చెట్టుతోనే కాదు... పండునైన నాతో కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి! నాలో ఉన్న రసంతో చుండ్రు మటుమాయవుతుందట. జుట్టు రాలకుండా చేసే చికిత్సలోనూ నన్ను ఉపయోగిస్తారట. నా చెట్టు ఆకులను క్యాన్సర్‌, విరేచనాల చికిత్సలోనూ వాడతారు. ఆకులు, కాండం, బెరడును రక్తస్రావ నివారిణిగా వినియోగిస్తారు. కొన్ని అధ్యయనాల్లో నాతో చక్కెర వ్యాధిని కూడా అదుపు చేయొచ్చని తెలిసింది.


నిత్యం హరితం...

నా చెట్టు నిత్యం పచ్చదనంతో కనువిందు చేస్తుంది. పత్రాలు పొడవుగా ఉండి, దీనిపై ఉండే గీతలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చిన్న చెట్టు అయినప్పటికీ దట్టమైన నీడను ఇస్తుంది. నా గురించి మీ అమ్మానాన్నకు తెలుసో లేదో ఒక్కసారి కనుక్కోండి. కనీసం మీ తాతా, అవ్వలకైనా తెలిసే ఉంటుంది అనుకుంటున్నా!! నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి... బై.. బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని