అందని ద్రాక్ష తియ్యన!!

‘చిప్సూ, కేకులూ, బిస్కెట్లూ... ఇలా జంక్‌ ఫుడ్‌ వద్దని ఎన్ని సార్లు చెప్పాలి. ఏ అరటిపండో, మామిడిపండో, ఆపిలో తినొచ్చు కదా’ అని గడుగ్గాయిలమైన మనల్ని అమ్మానాన్నో, తాత, బామ్మో ఎప్పుడో ఒకప్పుడు అదిరించో, బెదిరించో, బతిమాలో చెప్పి ఉంటారు కదా!

Updated : 06 Jul 2023 06:30 IST

‘చిప్సూ, కేకులూ, బిస్కెట్లూ... ఇలా జంక్‌ ఫుడ్‌ వద్దని ఎన్ని సార్లు చెప్పాలి. ఏ అరటిపండో, మామిడిపండో, ఆపిలో తినొచ్చు కదా’ అని గడుగ్గాయిలమైన మనల్ని అమ్మానాన్నో, తాత, బామ్మో ఎప్పుడో ఒకప్పుడు అదిరించో, బెదిరించో, బతిమాలో చెప్పి ఉంటారు కదా! అసలు ఇప్పుడీ పండ్ల గోల ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్ష గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి! దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ద్రాక్ష అనగానే మీకు నోట్లో నీరు ఊరి ఉంటుంది కదూ! కానీ వాటిని తినాలంటే మాత్రం జేబులో రూ.లక్షలకు లక్షలు ఉండాల్సిందే. అంటే.. ‘అందని ద్రాక్ష పుల్లన కాదు, తియ్యన...!!’ అన్నమాట. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్‌..!!

ఖరీదైన ద్రాక్ష పేరు ‘రూబీ రోమన్‌’. ఇది ఖరీదైన పండ్లకు ప్రఖ్యాతి గాంచిన జపాన్‌లో మాత్రమే కాస్తుంది. అందుకే దీన్ని ‘జపాన్‌ రూబీ రోమన్‌ ద్రాక్ష’ అని కూడా అంటారు. ఈ ద్రాక్ష రుచి, రంగులో మిగతావాటికి భిన్నంగా ఉంటుంది. అందరికీ అందని ఈ ద్రాక్ష తియ్యన అని అన్నాం కానీ... నిజానికి తీపితో పాటు కాస్త చేదుగానూ ఉంటుంది. సాధారణ ద్రాక్షతో పోల్చుకుంటే నాలుగింతలు పెద్దగా కూడా ఉంటుంది.

అక్షరాలా... రూ.లక్షల్లోనే...

ఎరుపు రంగులో ఉండే ఈ ద్రాక్ష పండ్ల ఒక గుత్తి ధర దాదాపు రూ.8 లక్షలు ఉంటుంది. ఒక్కో గుత్తికి 26 నుంచి 30 వరకు మాత్రమే పండ్లు ఉంటాయి. అంటే ఒక్క పండును రుచి చూడాలన్నా... మనం దాదాపుగా రూ.30 వేలు చెల్లించాలన్నమాట! ఒక్కో పండు బరువు సుమారు 20 గ్రాముల వరకు ఉంటుంది. వీటిలో 18 శాతం చక్కెర ఉంటుంది. అందుకే ఇవి తియ్యటి రుచితో ఉంటాయి. ఈ ద్రాక్ష పండ్లు కేవలం సీజన్‌ను బట్టి మాత్రమే అందుబాటులో ఉంటాయి. జపాన్‌లో కొన్ని పండగలకు వీటిని బహుమతిగా కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండ్ల సాగు కూడా అంత సులభం కాదు.. ఎన్నో సస్యరక్షణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితులూ కల్పించాలి. ఈ కారణాల వల్ల ‘రూబీ రోమన్‌ ద్రాక్ష’ అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి, దీన్ని ‘ధనవంతుల ఫలం’ అని కూడా పిలుస్తారు.

వేలమే మార్గం!

దీన్ని ‘ధనవంతుల ఫలం’ అనైతే అంటారు కానీ... ఆ ధనికులకు కూడా ఇది అంత తేలికగా ఏమీ దొరకదు. ఎందుకంటే ఈ పండ్లు సాధారణ మార్కెట్లలో అమ్మకానికి పెట్టరు. కేవలం వేలంపాటలోనే వీటిని దక్కించుకోవాల్సి ఉంటుంది! నాణ్యతను బట్టి ఈ ద్రాక్ష పండ్లను మూడు గ్రేడ్లుగా విభజించి వేలంలో ఉంచుతారు. మనం వీటినైతే తినలేం కానీ... మన దగ్గర దొరికే ద్రాక్ష పండ్లనైతే ఓ పట్టుబడదాం. ఎందుకంటే ద్రాక్షలో ఎన్నో పోషక విలువలుంటాయి. నేస్తాలూ... మొత్తానికి ఇవీ అత్యంత ఖరీదైన ‘రూబీ రోమన్‌ ద్రాక్ష’ విశేషాలు.. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని