భలే.. భలే.. తివాచీ భవనం!

తివాచీలా ఉన్న ఈ బిల్డింగ్‌లో కార్పెట్‌ మ్యూజియం నిర్వహిస్తున్నారు. అజర్‌బైజాన్‌ దేశానికి చెందిన జాతీయ సంపద ఇది. దీన్ని ‘అజర్‌బైజాన్‌ కార్పెట్‌ మ్యూజియం’ అని పిలుస్తారు. ఇది ఆ దేశపు రాజధాని నగరమైన ‘బాకు’లో ఉంది. ఇందులో ప్రాచీన తివాచీలతో పాటు రగ్గులు కూడా కొలువుదీరి ఉన్నాయి.

Updated : 07 Jul 2023 05:42 IST

ఈ భవంతి మడతపెట్టిన తివాచీలా భలే ఉంది కదూ! నిజానికి ఈ భవనానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది ఓ మ్యూజియం. ఇంతకీ ఇందులో ఏ ఏ వస్తువులుంటాయి. అసలు ఈ మ్యూజియం ఏ దేశంలో ఉంది. దీని చరిత్ర ఏంటో తెలుసుకోవాలని ఉందా?! మరింకెందుకాలస్యం... ఈ కథనాన్ని చకచకా చదివేయండి. సరేనా ఫ్రెండ్స్‌!

తివాచీలా ఉన్న ఈ బిల్డింగ్‌లో కార్పెట్‌ మ్యూజియం నిర్వహిస్తున్నారు. అజర్‌బైజాన్‌ దేశానికి చెందిన జాతీయ సంపద ఇది. దీన్ని ‘అజర్‌బైజాన్‌ కార్పెట్‌ మ్యూజియం’ అని పిలుస్తారు. ఇది ఆ దేశపు రాజధాని నగరమైన ‘బాకు’లో ఉంది. ఇందులో ప్రాచీన తివాచీలతో పాటు రగ్గులు కూడా కొలువుదీరి ఉన్నాయి.

అప్పట్లోనే...

ఈ మ్యూజియం 1967లో ప్రారంభమైంది. కానీ అప్పుడు ఇది వేరే చోట ఉండేది. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తర్వాత 1992 సంవత్సరంలో అక్కడి నుంచి ఈ మ్యూజియాన్ని బాకుకు తరలించారు.

నూతన అడుగులు...

బాకు నగరంలో ఈ మ్యూజియం కోసం నూతన భవన నిర్మాణాన్ని 2010లో మొదలుపెట్టారు. 2014లో ఇది కొత్త భవంతిలో ప్రారంభమైంది. కార్పెట్‌ను సగం మడిచినట్లుగా ఉండే ఈ భవనం ఆకృతిని ఆస్ట్రియాకు చెందిన ఆర్కిటెక్ట్‌ ఫ్రాంజ్‌ జాంజ్‌ రూపొందించారు.

వేలకు వేలల్లోనే...

ఈ మ్యూజియంలో సుమారు పదివేలకు పైగా వస్తువులు ప్రదర్శనకు ఉన్నాయి. కేవలం తివాచీలే కాకుండా, 14వ శతాబ్దానికి చెందిన పాత్రలు, నగలు కూడా కొలువుదీరి ఉన్నాయి. ‘అజర్‌బైజాన్‌ కార్పెట్‌ మ్యూజియం’ తరఫున ఏటా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలూ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌, జర్మనీ, ఇంగ్లండ్‌, జపాన్‌, నెదర్లాండ్స్‌లాంటి దాదాపు 30 దేశాల్లో ఎగ్జిబిషన్లు జరిగాయి. ఈ పురాతన వస్తు ప్రదర్శనశాలకు ఉన్న మరో రికార్డు ఏంటో తెలుసా... ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ‘కార్పెట్‌ మ్యూజియం’.

మూడు అంతస్తుల్లో...

ఈ మ్యూజియం భవనంలో మూడు అంతస్తులున్నాయి. మొదటి అంతస్తులో కార్పెట్లు నేయడానికి అప్పట్లో ఉపయోగించిన పనిముట్లను ప్రదర్శిస్తారు. ఇక రెండో దాంట్లో పురాతన కాలానికి చెందిన కార్పెట్ల కలెక్షన్‌ ఉంది. ఈ మ్యూజియంలో ఉన్న 17వ శతాబ్దానికి చెందిన ‘అజ్దహలి’ అనే కార్పెటే అతి ప్రాచీనమైంది. అది కూడా ఈ అంతస్తులోనే ఉంటుంది. ఇక మూడో అంతస్తులో ఆధునిక కార్పెట్లు, వాటి తయారీలో ఉపయోగించే పనిముట్లు ఉంటాయి. 19వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు కార్పెటింగ్‌లో వచ్చిన మార్పులకు సంబంధించిన ప్రదర్శన కూడా ఉంటుంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ‘అజర్‌బైజాన్‌ కార్పెట్‌్ మ్యూజియం’ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని