అరుదైన చిలుకను నేను!

నేస్తాలూ...! మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది.. నేనో చిలుకను అని! నా పేరు ఇంపీరియల్‌ అమెజాన్‌. నన్ను డొమినికన్‌ అమెజాన్‌, సిస్సెరౌ, సిసిరో అని కూడా పిలుస్తుంటారు. నేను కేవలం కరేబియన్‌ ద్వీపమైన డొమినికాలో మాత్రమే కనిపిస్తాను.

Published : 09 Jul 2023 00:05 IST

రెక్కలు ఆకుపచ్చన...
శరీరమేమో కాస్త నల్లన...
మిగతా చిలుకలకు భిన్నం!!
నా నివాసం ఒకే ఒక ద్వీపం...
మా సంఖ్య బహు స్వల్పం...
ఇంకా తెలియాలా నా వివరం...
అయితే చదవండి ఈ కథనం...!!

నేస్తాలూ...! మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది.. నేనో చిలుకను అని! నా పేరు ఇంపీరియల్‌ అమెజాన్‌. నన్ను డొమినికన్‌ అమెజాన్‌, సిస్సెరౌ, సిసిరో అని కూడా పిలుస్తుంటారు. నేను కేవలం కరేబియన్‌ ద్వీపమైన డొమినికాలో మాత్రమే కనిపిస్తాను. మరో విషయం ఏంటంటే... నేను డొమినికా జాతీయపక్షిని. ఈ ద్వీప దేశ జాతీయ పతాకం మీద కూడా ఉంటాను తెలుసా. ప్చ్‌! నాకు ఇంత గౌరవం దక్కినా... ప్రస్తుతం మా జాతి దాదాపు అంతరించిపోయే స్థితిలో ఉంది. 2019 లెక్కల ప్రకారం అడవుల్లో మాలో 50 మాత్రమే పెద్ద చిలుకలు జీవించి ఉన్నాయట!

అయ్‌.. బాబోయ్‌ నాకు సిగ్గు!

నేను సగటున 48 సెంటీమీటర్లుంటాను. మాలో మగవి దాదాపు 900 గ్రాములూ, ఆడవి 650 గ్రాముల వరకూ బరువు పెరుగుతుంటాయి. నా అరుపులు బిగ్గరగా ఉంటాయి. నా గొంతు పెద్దదే కానీ నాకు మాత్రం చాలా సిగ్గు. మనుషులు కనబడితే చాలు దూరంగా వెళ్లిపోతా. నేను ఒంటరిగా ఉండలేను. మూడు, నాలుగు ఇలా చిన్న చిన్న జట్లుగా ఉంటాం. మా సంఖ్య చాలా తక్కువ కదా..! అందుకే కాస్త మాలా కనిపించే రెడ్‌ నెక్‌డ్‌ అమెజాన్స్‌ అనే చిలుకలతోనూ గుంపుగా తిరుగుతాం. పాపం.. అవీ మా బంధువులేగా.. అందుకే మమ్మల్ని ఏమీ అనవు. కానీ అప్పుడప్పుడు గూళ్ల విషయంలో మాత్రం మా మధ్య తగాదాలు జరుగుతుంటాయి.

చిటారు కొమ్మన...

నాకు బలమైన రెక్కలుంటాయి. అందుకే నేను చక్కగా ఎగరగలను. కేవలం ఎగరడమే కాదు... చెట్ల మీద గబగబా నడిచేయగలను. బలమైన ముక్కు, శక్తిమంతమైన కాళ్లే దీనికి కారణం. నేను చెట్ల చిటారు కొమ్మల్లో సేద తీరేందుకే ఇష్టపడుతుంటా. మరో విషయం ఏంటంటే గుబురు గుబురుగా ఉండే కొమ్మల మధ్య మమ్మల్ని గుర్తించడమూ చాలా కష్టం. నేను నా ఈకలతో మాయ చేస్తుంటా మరి!

చెట్టుతో చెట్టాపట్టాల్‌...!

మాలో ఆడపక్షులు ఫిబ్రవరి, ఏప్రిల్‌ మధ్యన అడవిలో దట్టమైన చెట్లపైన గుడ్లు పెడతాయి. ఒక్కో ఆడపక్షి రెండు తెల్లని గుడ్లను పెట్టి పొదుగుతుంది. ముందు సంవత్సరం ఏ చెట్టు మీద అయితే గుడ్లను పెట్టాయో... మరుసటి ఏడాది కూడా అదే చెట్టు మీద అవి గుడ్లను పెడతాయి. అంటే ఆడపక్షుల్లో దేని చెట్టు దానిదే అన్నమాట! 26 నుంచి 28 రోజుల తర్వాత గుడ్ల నుంచి చిన్న చిన్న పిల్లలు బయటకు వస్తాయి. ఆడ, మగ పక్షులు రెండూ, పిల్లల సంరక్షణను చూసుకుంటాయి.

ఉదయం.. సాయంత్రం...

మాకు పండ్లంటే భలే ఇష్టం. మేం కొన్ని రకాల పూలు, విత్తనాలను కూడా తింటాం. ఒక రకమైన పామ్‌ మొక్కల లేత చిగుళ్లతో కూడా బొజ్జ నింపుకొంటాం. మీకు మరో విషయం తెలుసా... మేం ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాం.

తుపాన్లంటే భయం!

మేం అంతరించిపోయే స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం తుపాన్లు. మేం కేవలం డొమినికా ద్వీపంలో మాత్రమే జీవిస్తామని మీతో ఇది వరకే చెప్పాను కదా. 1971లో వచ్చిన భారీ తుపాను డొమినికాను తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పుడే మాలో చాలా వరకు చనిపోయాయి. తర్వాత 2017లోనూ ఇలాగే ఓ భారీ తుపాను వచ్చింది. ఇలా తరుచుగా వచ్చే తుపాన్ల వల్ల మేం తీవ్రంగా ప్రభావితమవుతున్నాం. ఇంకా కొందరు మమ్మల్ని వేటాడి, బంధిస్తున్నారు. అనధికారికంగా మమ్మల్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మా సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నా... పెద్దగా ఫలితాలు రావడం లేదు. ఫ్రెండ్స్‌... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి బై... బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని