తీరాన తీయని పండు!

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఈ రోజు మనం ఓ కొత్త పండు గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కువగా తీరప్రాంతాల్లో కాస్తుంది. తింటే తీయగా ఉంటుంది. కాస్త పనసలా, ఇంకాస్త పైనాపిల్‌లా, ఇంకొంచెం మామిడిలా, ఇంకా.. చెరకులా ఇలా పలు రకాల రుచులను పోలి ఉంటుంది.

Published : 10 Jul 2023 00:40 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఈ రోజు మనం ఓ కొత్త పండు గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కువగా తీరప్రాంతాల్లో కాస్తుంది. తింటే తీయగా ఉంటుంది. కాస్త పనసలా, ఇంకాస్త పైనాపిల్‌లా, ఇంకొంచెం మామిడిలా, ఇంకా.. చెరకులా ఇలా పలు రకాల రుచులను పోలి ఉంటుంది. మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఆ పండు గురించి తెలుసుకుందామా!
పాండనస్‌ టెక్టోరియస్‌ ఫ్రూట్‌... పలకడానికి కాస్త ఇబ్బందిగా ఉంది కదూ! థాచ్‌ స్క్రూపైన్‌, తాహితీయన్‌ స్క్రూపైన్‌ ఫ్రూట్‌ అని కూడా పిలుస్తారు. ఈ రెండు పేర్లు కూడా అంత తేలిగ్గా ఏమీ లేవు కదా! మనలాంటి చిన్నారుల కోసమే అన్నట్లుగా దీనికి మరో పేరు సైతం ఉంది నేస్తాలూ! దీన్ని హాలా పండు అని అంటారు. ఇంకేం ఎంచక్కా మనం హాలా ఫలం అని పిలుద్దాం సరేనా!

గుబురైన వేర్లతో...

ఈ పండ్ల చెట్లు మనకు ఎక్కువగా మలేషియా, తూర్పు ఆస్ట్రేలియా, పసిఫిక్‌ దీవుల్లో కనిపిస్తాయి. అది కూడా సముద్రపు అంచుకు సమీపంలో తీరప్రాంత లోతట్టు ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి చాలా చిన్న చెట్లు. 4 నుంచి 14 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాయి. వీటి వేర్లు గుబురుగా ఉంటాయి. బయటకు కూడా కనిపిస్తాయి.

చూడ్డానికి పైనాపిల్‌లా..

ఈ చెట్లకు తెల్లని పూలు పూస్తాయి. ఇవే హాలా పండ్లుగా మారతాయి. ఇవి చూడ్డానికి కాస్త పైనాపిల్‌ను పోలి ఉంటాయి. హాలా పండ్లు దాదాపు 7 కిలోల నుంచి 15 కిలోల వరకు బరువు తూగుతాయి.. ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఒక్కో చెట్టు కేవలం 8 నుంచి 12 వరకు పండ్లను మాత్రమే ఇస్తుంది. హాలా చెట్ల ఆకులు 90 నుంచి 150 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. వెడల్పేమో 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు ఉంటాయి.

ప్రాంతాల వారీగా...

ఈ పండ్లకు ఒకే సీజన్‌ ఉండదు. కాస్త అటూ ఇటుగా.. ఫిజీలో మార్చి, మే తర్వాత కాయలు కాస్తే, ఆస్ట్రేలియాలో ఏప్రిల్‌, ఆగస్టు మధ్య కాస్తాయి. మైక్రోనేషియాలో మాత్రం డిసెంబర్‌ నుంచి మార్చి మధ్య, అలాగే జులై నుంచి సెప్టెంబర్‌ వరకు రెండు సీజన్లలో కాయలు కాస్తాయి. వీటిలో కొన్ని రకాల్లో కాల్షియం ఆక్సలేట్‌ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తినేముందు బాగా ఉడికించాలి. మరి కొన్ని రకాల్లో ఈ పదార్థం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నేరుగానూ తినేయొచ్చు. మైక్రోనేషియా, పాలినేషియా దీవుల్లో ఈ పండే ముఖ్యమైన ఆహార వనరు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పండులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని స్థానికులు చెబుతుంటారు. వారు ఈ చెట్ల ఆకులను తీపి వంటకాల్లో సువాసన కోసమూ ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వీటితో బుట్టలు, చాపలు కూడా తయారు చేస్తారు. నేస్తాలూ... మొత్తానికి ఇవీ తీరాన తీయని పండైన హాలా ఫలం విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని