బుజ్జి మిరపను కాదు.. బుల్లి టొమాటోనే!

ఇప్పుడు టొమాటో పేరు చెబితేనే ఇంట్లో అమ్మానాన్న ఉలిక్కిపడుతున్నారు కదూ! ఎందుకంటే మార్కెట్లో ధరలు అలా ఉన్నాయి మరి. ఆ విషయం అక్కడెక్కడో దూరంగా ఉన్న నా వరకూ వచ్చింది. నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని పరుగుపరుగున వచ్చాను.

Updated : 13 Jul 2023 04:30 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. నన్ను చూసి మీరంతా మిరపకాయ అనుకుంటున్నారు కదూ! అలా అయితే మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే నేను ఘాటైన మిర్చిని కాదు.. స్వీటైన టొమాటోను. చూడ్డానికి భలే ఉన్నాను కదూ! అందుకే నా గురించి చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.

ఇప్పుడు టొమాటో పేరు చెబితేనే ఇంట్లో అమ్మానాన్న ఉలిక్కిపడుతున్నారు కదూ! ఎందుకంటే మార్కెట్లో ధరలు అలా ఉన్నాయి మరి. ఆ విషయం అక్కడెక్కడో దూరంగా ఉన్న నా వరకూ వచ్చింది. నన్ను నేను పరిచయం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని పరుగుపరుగున వచ్చాను. ఇంతకీ నా పేరేంటో చెప్పనేలేదు కదూ! నన్ను శాన్‌ మార్జానో టొమాటో అంటారు. నా పేరు పలకడం మీకు వస్తే సరే.. లేకపోతే ముద్దుగా పొడవు టొమాటో అని పిలిచేయండి.. పర్లేదు. నేనైతే ఏమీ అనుకోను.

నాణ్యతకు మారు పేరు...

నా పేరైతే చెప్పాను కానీ.. ఊరి సంగతి మీతో పంచుకోలేదు కదూ! నా స్వస్థలం ఇటలీలోని కాంపానియా. నాకు రుచిలోనూ, నాణ్యతలోనూ చాలా మంచి పేరుంది. టొమాటో రకాల్లో ఇక ఏదీ నా అంత రుచిగా, తీయగా ఉండదంటే నమ్మండి. నా తోలు చాలా పలుచగా ఉంటుంది. లోపల గుజ్జు మాత్రం దట్టంగా ఉంటుంది. గింజలు కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి. నాలో ఆమ్ల లక్షణాలు తక్కువగా ఉంటాయి. అలాగే మీ దగ్గర పెరిగే వాటి కన్నా... నా మొక్క ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. సీజన్‌ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. కాస్త వేడి వాతావరణం ఉన్నా పర్లేదు... ఎంచక్కా సర్దుకుపోతుంది. మీ దగ్గరి టొమాటోలానే నేను ముందు ఆకుపచ్చగా ఉంటాను. పండాక ఎరుపురంగులోకి మారతాను.

ప్రపంచవ్యాప్తంగా..

నేను ఇటలీలో పురుడు పోసుకున్నప్పటికీ... ప్రస్తుతం దాదాపు ప్రపంచవ్యాప్తంగా నా విత్తనాలు దొరుకుతున్నాయి! కానీ ఇప్పటికీ ఇటలీలోనే నా దిగుబడి ఎక్కువ. మిగతా చోట్ల చాలా తక్కువ. మరో విషయం ఏంటంటే నాకు చాలా డిమాండ్‌. ఎందుకంటే నన్ను ఓ రకమైన పిజ్జా తయారీలో వాడతారు. నేను లేకుండా అది పూర్తి కాదు. నేనున్న పిజ్జాను జనాలు లొట్టలేసుకు మరీ తింటారు. అమెరికాలోనూ నన్ను పండిస్తున్నారు. కానీ నన్ను స్థానిక టొమాటోలతో సంకరం చేసి కొత్త రకాలను సృష్టించారట. మరో విషయం ఏంటంటే.. మీ దగ్గర టొమాటోల ధరలు అప్పుడప్పుడు మాత్రమే పెరుగుతాయి. నేను కాస్త అరుదైన రకాన్ని కాబట్టి, నా ధర మాత్రం ఎప్పుడూ భగ్గుమంటూనే ఉంటుంది. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే... మీ అమ్మానాన్న నన్ను కూరలో వేసినా వేసేస్తారు. మీ అమ్మమ్మకో, నాయనమ్మకో దొరికాననుకో ఏకంగా నాతో చట్నీ చేసేస్తారు. అందుకే బై.. బై...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని