ఆఫ్రికాలో జాడ.. జిరాఫీలా మెడ!

నా పేరు గెరెనూక్‌. మీ దగ్గర ఉండను కాబట్టి మీరు నా పేరెప్పుడూ విని ఉండరు. నేను జింక జాతికి చెందిన జీవిని. కానీ, కాస్త జిరాఫీలా ఉంటాను. దానంత పెద్ద ఆకారం లేకపోయినా, మెడ మాత్రం చాలా పొడవుగా ఉంటుంది. అందుకే నన్ను చూడగానే మీకు జిరాఫీ పిల్ల గుర్తుకు వస్తుంది. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంటాను.

Updated : 14 Jul 2023 02:52 IST

హాయ్‌ నేస్తాలూ..! ‘ఏంటి.. నావైపు కొత్తగా, వింతగా చూస్తున్నారు?’.. చూస్తుంటే జింకలా కనిపిస్తుంది కానీ మెడ మాత్రం జిరాఫీలా పొడవుందేంటని ఆశ్చర్యపోతున్నారు కదూ! అందుకే, నా గురించి మీకు తెలియజేద్దామనే ఇలా మీ పేజీలోకి వచ్చా.. ఇంకెందుకాలస్యం.. గబగబా నా వివరాలు చెప్పేస్తా..

నా పేరు గెరెనూక్‌. మీ దగ్గర ఉండను కాబట్టి మీరు నా పేరెప్పుడూ విని ఉండరు. నేను జింక జాతికి చెందిన జీవిని. కానీ, కాస్త జిరాఫీలా ఉంటాను. దానంత పెద్ద ఆకారం లేకపోయినా, మెడ మాత్రం చాలా పొడవుగా ఉంటుంది. అందుకే నన్ను చూడగానే మీకు జిరాఫీ పిల్ల గుర్తుకు వస్తుంది. దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంటాను. గెరెనూక్‌ అనే పదం సోమాలీ భాష నుంచి వచ్చింది. ‘జిరాఫీ మెడ కలిగిందని’ దాని అర్థం.  

నీళ్లు తాగాల్సిన పని లేదు..

మీకైతే రోజుకి ఇన్ని లీటర్ల నీళ్లు తాగాలని లెక్కలుంటాయి. కానీ, నాకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. జీవితాంతం అసలు నీళ్లు తాగకుండానే బతకగలను. ‘అలా ఎలా?’ అని సందేహిస్తున్నారా? నేను ఆహారంగా తీసుకునే చెట్ల ఆకులు, పండ్లల్లో ఉండే తేమతోనే శరీరానికి కావాల్సిన నీటిని సర్దుబాటు చేసుకోగలను. అందుకే ఎడారి ప్రాంతాల్లోనూ ఎంచక్కా హాయిగా బతికేయగలను. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా తేల్చి చెప్పారు.

వర్షంలో తడవటం ఇష్టం 

ప్రస్తుతం మా సంఖ్య లక్ష లోపే. వేటాడటం, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా మా సంఖ్య తగ్గిపోతోంది. అందుకే మా జాతిని అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. మేం ఎనిమిది నుంచి పదమూడేళ్ల వరకూ జీవిస్తాం. మాలో ఆడవి గుంపులుగా, మగ జీవులు అయితే ఒంటరిగా జీవిస్తాయి. మెడ ఎంత పొడవుగా ఉంటుందో, కాళ్లు అంత సన్నగా ఉంటాయి. నేను ఆహారం కోసం పొదల్లోకి, ముళ్ల కంపల్లోకి వెళ్తుంటాను కదా.. ఆ సమయంలో నా పొడవాటి కనురెప్పలే నాకు రక్షణగా నిలుస్తాయి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలను. సాధారణంగా వర్షం వస్తే మీరు ఇంట్లోకి పరిగెడతారు కదా.. కానీ మేమైతే శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు వానలో తడిచేందుకే ఇష్టపడతాం.

మగ వాటికే కొమ్ములు..

మాకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది.. అదేంటంటే, వెనక రెండు కాళ్లతోనే కొద్దిపాటి దూరం నడవగలం. మా పొడవైన మెడతో భూమి నుంచి రెండు మీటర్ల ఎత్తులో ఉన్న కొమ్మలనైనా సునాయాసంగా అందుకోగలం. మేం చాలా తక్కువగా ప్రయాణిస్తుంటాం. ప్రత్యేకమైన శబ్దాలతో మాలో మేము మాట్లాడుకుంటాం. మా జాతిలో మగవి 35 నుంచి 41 అంగుళాల పొడవు పెరుగుతాయి. 31 నుంచి 52 కిలోల బరువు ఉంటాయి. ఆడ జీవులేమో 31 నుంచి 39 అంగుళాలు పెరిగి.. 28 నుంచి 45 కిలోల బరువు తూగుతాయి. ఇంకో విషయం ఏంటంటే.. మాలో మగ వాటికి మాత్రమే కొమ్ములు ఉంటాయి. నేస్తాలూ.. కొంచెం జింకలా.. ఇంకొంచెం జిరాఫీలా కనిపించే నా విశేషాలివీ.. మీకు నచ్చాయి కదూ.. ఇక ఉంటా మరి బై బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని