నేను సముద్ర పందినోచ్‌!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా! నేనో సముద్ర పందిని. నన్ను మీరెప్పుడూ చూసి ఉండరు. అందుకే నన్ను నేను పరిచయం చేసుకుందామని ఇదిగో ఇలా వచ్చాను.

Updated : 17 Jul 2023 05:08 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా! నేనో సముద్ర పందిని. నన్ను మీరెప్పుడూ చూసి ఉండరు. అందుకే నన్ను నేను పరిచయం చేసుకుందామని ఇదిగో ఇలా వచ్చాను. మరి నేనెవరు.. నా ప్రత్యేకతలేంటో తెలుసుకుంటారా!

న్ను సీ పిగ్‌ అని పిలుస్తారు. సీ కుకుంబర్‌ జాతికి చెందిన జీవిని. నేను బొద్దుగా, గులాబీ రంగులో ఉంటాను. చూడ్డానికి కాస్త పందిలా కనిపిస్తాను, అలాగే నేను సముద్రంలో జీవిస్తాను కాబట్టి నన్ను సీ పిగ్‌ అని పిలుస్తారు. మమ్మల్ని మీరు అరుదైన జీవులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మేం చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నాం.

అత్యంత లోతులో...

మేం సముద్రంలో 1,200 మీటర్ల నుంచి 5,000 మీటర్ల లోతులో జీవిస్తాం. అందుకే మమ్మల్ని మీరు చూసే అవకాశమే లేదు. మాకు అయిదు నుంచి ఏడు వరకు గొట్టాల్లాంటి నిర్మాణాలుంటాయి. వీటినే మేం కాళ్లుగా వాడుకుంటాం. వీటి సాయంతోనే మేం ముందుకు కదులుతాం. సముద్రం అడుగున బురద నేలను కూడా ట్యూబుల్లాంటి కాళ్లతోనే తోడుతాం. మేం దాదాపు 8 సంవత్సరాల వరకు జీవించగలం.

ఇబ్బడి ముబ్బడిగా...

మేం హిందూ మహాసముద్రం, అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహాసముద్రాల్లో ఎక్కువగా జీవిస్తాం. ప్రపంచవ్యాప్తంగా మిగతా సముద్రాల్లోనూ మేం భారీ సంఖ్యలోనే ఉన్నాం. చుక్కల లెక్కలు ఎలా అయితే తేల్చలేరో... మా సంఖ్య కూడా కచ్చితంగా ఇంత అని ఎవరూ చెప్పలేరు. మేం సాధారణంగా 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాం. మేం సముద్ర మొక్కలు, ఇతర జీవుల అవశేషాలను ఆహారంగా తీసుకుంటాం.

ఇంకా రహస్యమే!

ఇప్పటికీ మా గురించి మీకు తెలిసింది చాలా తక్కువే. మేం అక్కడెక్కడో సముద్రం అట్టడుగున ఉంటాం కాబట్టి ఇప్పటికీ చాలా తక్కువ సమాచారమే తెలుసు మీకు. మా రహస్యాలను చేధించడానికి మీ శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. నేస్తాలూ ప్రస్తుతానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి... బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని