కిరీటమున్న పావురం!

హాయ్‌ నేస్తాలూ..! ఏంటి రంగురంగుల శరీరం.. పైగా తల మీద ఏదో కిరీటం ధరించినట్లు కొత్తగా ఉన్నానని చూస్తున్నారా?.. అయినా నన్ను మీరు ఇంతకుముందెన్నడూ చూసి ఉండరు.అందుకే ఒకసారి కనిపించి.. మీతో నా విశేషాలు పంచుకోవాలని ఇలా వచ్చా..!

Updated : 18 Jul 2023 05:41 IST

హాయ్‌ నేస్తాలూ..! ఏంటి రంగురంగుల శరీరం.. పైగా తల మీద ఏదో కిరీటం ధరించినట్లు కొత్తగా ఉన్నానని చూస్తున్నారా?.. అయినా నన్ను మీరు ఇంతకుముందెన్నడూ చూసి ఉండరు.అందుకే ఒకసారి కనిపించి.. మీతో నా విశేషాలు పంచుకోవాలని ఇలా వచ్చా..!

నా పేరు ‘విక్టోరియా క్రౌన్‌ పిజియన్‌’. నేను ఎక్కువగా ఇండోనేషియాలో భాగమైన న్యూ గినియా ద్వీపంలో కనిపిస్తుంటాను. మా పావురాల జాతుల్లో అన్నింటి కంటే నేనే పెద్దదాన్ని. నా పేరుకూ ఒక ఘనత ఉంది నేస్తాలూ.. అదేంటంటే.. బ్రిటన్‌ రాణి ‘క్వీన్‌ విక్టోరియా’ గౌరవార్థం మా జాతికి ఈ పేరు వచ్చిందట. ఏకంగా రాణి పేరు మీదే అంటే కొంచెం గొప్పే కదా.!

మాది శబ్దాల భాష  

మీ మనుషులు మాట్లాడుకున్నట్లే మాకు కూడా ఓ భాష ఉంది. మేమంతా ఆ భాషలోనే మాట్లాడుకుంటాం. అది మాకు మాత్రమే అర్థమౌతుంది. మాట్లాడతామనగానే అలా నోరెళ్లబెట్టి చూడకండి ఫ్రెండ్స్‌.. మీలా కాదులెండి.. రకరకాల శబ్దాల ద్వారా అన్నమాట. మీకో విషయం తెలుసా.. మీరు చప్పట్లు కొట్టినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందో అలా కూడా చేయగలం. ఆహారం కోసం వెళ్లేటప్పుడు జంటలుగా లేకపోతే చిన్న చిన్న గుంపులుగా వెళ్తుంటాం. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే.. మాది పక్షి జాతే అయినా, ఎక్కువ సమయం భూమి మీదే గడుపుతాం. ఏదైనా అపాయం నుంచి బయట పడేందుకు, రాత్రి వేళల్లో నిద్రించేందుకు మాత్రమే చెట్లపైకి చేరతాం.

శాకాహారులం..  

మేం ఎక్కువగా పండ్లు తినడానికి ఇష్టపడతాం. అవి లేకపోతే ఏవైనా విత్తనాలతో సరిపెట్టుకుంటాం. ఈ మధ్య వివిధ కారణాల వల్ల మా సంఖ్య చాలా తగ్గిపోతోంది. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. ‘ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌’ వాళ్లే లెక్కలతో సహా చెబుతున్నారు. ఆ సంస్థ సర్వే ప్రకారం మా సంఖ్య ప్రస్తుతం 10 వేల నుంచి 20 వేల మధ్యలోనే ఉంది. అందుకే మా జాతిని సంరక్షించేందుకు స్థానిక ప్రభుత్వాలూ పలు చర్యలు చేపట్టాయి.  

అదే ఆకర్షణ..

మా శరీరం బూడిద రంగులో ఉంటుంది. మెడ దగ్గర మాత్రం కాస్త ముదురు ఎరుపు రంగుతో ఉంటాం. మీకు ఫొటోల్లో కనిపిస్తున్నట్లు నా తల మీద అందమైన కిరీటం వంటి ఆకారం కూడా ఉంటుంది. అదే మాకు ప్రత్యేక ఆకర్షణ. మేం దాదాపు 4 కిలోల వరకు బరువు తూగుతాం. 75 సెంటీమీటర్ల వరకూ పొడవు పెరుగుతాం. అన్నీ అనుకూలిస్తే, 20 నుంచి 25 సంవత్సరాలపాటు హాయిగా బతికేస్తాం. పిల్లలూ..! నా విశేషాలు ఇవీ.. మీకు నచ్చాయి కదూ.. ఇక ఉంటా మరి బై బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు