ఎలుక రూపం.. పిల్లి పరిమాణం!

హాయ్‌ ఫ్రెండ్స్‌... నన్ను చూసి మీరు ఏ ఎలుకో, పందికొక్కో అనుకుంటున్నారు కదూ! కానీ కాదు. ఓ రకంగా నేనో కంగారూను! అవును నిజంగా నిజం.

Updated : 19 Jul 2023 04:38 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... నన్ను చూసి మీరు ఏ ఎలుకో, పందికొక్కో అనుకుంటున్నారు కదూ! కానీ కాదు. ఓ రకంగా నేనో కంగారూను! అవును నిజంగా నిజం. మరి నా పేరేంటో, నేను ఎక్కడుంటానో తెలుసా...! తెలియదు కదూ..!! అందుకే ఆ వివరాలన్నీ మీకు చెప్పి పోదామనే ఇదిగో ఇలా మీ ముందుకు వచ్చాను.

నా పేరు క్వోక్కా. నేను చూడ్డానికి ఎలుకలా ఉంటాను. దాదాపు పిల్లి అంత పెద్దగా పెరుగుతాను. కంగారూ కుటుంబానికి చెందిన జీవిని. నేను దక్షిణ ఆస్ట్రేలియా, చుట్టుపక్కల కొన్ని చిన్న చిన్న దీవుల్లో కనిపిస్తుంటాను. మా సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.
మేం కూడా త్వరలో అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరతామేమో అని నాకు భయం వేస్తోంది.

ఎంచక్కా చెట్లు ఎక్కేస్తా..!

నేను 2.5 కిలోల నుంచి 5 కిలోల వరకు బరువు పెరుగుతాను. 40 నుంచి 50 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటాను. నా తోకేమో 25 నుంచి 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. మా ముందు కాళ్ల కన్నా.. వెనక కాళ్లు పొడవుగా, బలంగా ఉంటాయి. మా చెవులేమో గుండ్రంగా, చిన్నగా టెడ్డీబేర్‌ చెవుల్లా భలే ఉంటాయి. మేం ముద్దుగా, బొద్దుగా కనిపించినా చక్కగా చెట్లెక్కగలం తెలుసా! మీరు మాత్రం మాలా చెట్లెక్కడానికి ప్రయత్నించకండి. పడిపోతారు జాగ్రత్త!!

పగలంతా గుర్ర్‌ర్ర్‌....

నేను పగలంతా హాయిగా బజ్జోవడానికే ఇష్టపడతా. చిన్న చిన్న పొదల్లో నేను దాక్కుంటా. ఇవే నన్ను శత్రువుల బారి నుంచి కాపాడతాయి. మాలో ఆడవి తమ జీవితకాలంలో దాదాపు 17 వరకు పిల్లలకు జన్మనిస్తాయి. సంవత్సరానికి రెండుసార్లు పిల్లల్ని కంటాయి. ప్రతిసారీ ఒక్కో పిల్లకు మాత్రమే జన్మనిస్తాయి. మేం కూడా కంగారూల్లా పూర్తిగా ఎదగని పిల్లలనే కంటాం. మా పొట్టదగ్గర ఉండే సంచుల్లో వాటికి రక్షణ కల్పిస్తాం.

మేం శాకాహారులం..

మేం పక్కా శాకాహారులం. గడ్డి, చెట్ల ఆకులను ఆహారంగా తీసుకుంటాం. మీకో విషయం తెలుసా... మేం ఆవుల్లా నెమరువేయగలం. మాకు మనుషులంటే కాస్త భయం. కానీ మమ్మల్ని మచ్చిక చేసుకుంటే మీతో చక్కగా స్నేహం చేస్తాం. కానీ మాకు చిరాకు వస్తే మాత్రం కరిచేస్తాం. మరో విషయం మీరు తీసుకునే ఆహారాన్ని మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఎందుకంటే అది మా ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే మీరు జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. జైలు శిక్ష కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఎదురు కావొచ్చు. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని