ట్రాక్టర్‌ కాదు.. రేసింగ్‌ కార్‌..!

కొద్దిరోజుల క్రితం రష్యాలో ఓ వాహన ప్రదర్శన నిర్వహించారు. అందులో వ్యవసాయ, నిర్మాణ, రవాణా రంగాలకు సంబంధించి.. ఆయా సంస్థలు తీసుకురాబోయే సరికొత్త వాహనాలను ప్రదర్శనగా ఉంచారు.

Updated : 20 Jul 2023 06:30 IST

హలో ఫ్రెండ్స్‌.. రయ్‌ రయ్‌మంటూ కార్లు ఒకదాన్ని మించి మరొకటి దూసుకెళ్లే రేసింగ్‌ పోటీలను మనం టీవీల్లో చూస్తుంటాం. అంతెందుకు.. ఇటీవల హైదరాబాద్‌లోనూ రేసింగ్‌ పోటీలు నిర్వహించిన విషయం మీకు తెలిసే ఉంటుంది! ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. మీకో సరికొత్త రేసింగ్‌ వాహనాన్ని పరిచయం చేద్దామని.. మరి ఆ విశేషాలేంటో గబగబా చదివేయండి..

కొద్దిరోజుల క్రితం రష్యాలో ఓ వాహన ప్రదర్శన నిర్వహించారు. అందులో వ్యవసాయ, నిర్మాణ, రవాణా రంగాలకు సంబంధించి.. ఆయా సంస్థలు తీసుకురాబోయే సరికొత్త వాహనాలను ప్రదర్శనగా ఉంచారు. వాటన్నింటిలోకెల్లా బెలారస్‌కు చెందిన ఓ సంస్థ రూపొందించిన ఫార్ములా-1 తరహా కారు అందరి దృష్టిని ఆకర్షించింది.

విషయం తెలిసి..

ఆ ప్రదర్శనలో దాదాపు 150 సంస్థలు తమ వాహనాలను అందుబాటులో ఉంచాయి. కానీ, బెలారస్‌ సంస్థ ట్రాక్టర్‌ విడి భాగాలతో రూపొందించిన ఫార్ములా-1 కారే హైలెట్‌గా నిలిచింది. ఆ ప్రత్యేకత తెలిసి.. ఎగ్జిబిషన్‌కు వచ్చిన వారంతా దాని గురించే మాట్లాడుకోసాగారు. అలాగని.. అదేదో అల్లాటప్పా వాహనమని అనుకోకండి.. అది గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్‌ చేశారు.

నమూనా మాత్రమే..

చక్రాలు, హెడ్‌లైట్లు, ఇంజిన్‌ దగ్గర గాల్లోకి పొడవుగా ఉండే పొగగొట్టంతోసహా అన్నీ ట్రాక్టర్‌ భాగాలనే వినియోగించారట. ఈ ఫార్ములా-1 కారు రష్యా, బెలారస్‌ దేశాల ప్రధానులకూ విపరీతంగా నచ్చేసింది. దాంతో అందులో ఒక రైడ్‌కు కూడా వెళ్లాలనుకున్నారు. కానీ, అది కేవలం నమూనా మాత్రమేనని తయారీదారులు చెప్పడంతో వారు ఉసూరుమన్నారట.

రకరకాలుగా..

అయితే, ట్రాక్టర్‌ భాగాలతో రూపొందించిన ఈ రేసింగ్‌ కారు తయారీ నిజంగా సాధ్యమవుతుందా కాదా అని రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరేమో కేవలం సంస్థ పబ్లిసిటీ కోసమే ఆ డిజైన్‌ తయారు చేశారంటున్నారు. కానీ, ఇదే విషయమై ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ త్వరలోనే ఈ నమూనాతో, అంతే సామర్థ్యంతో రేసింగ్‌ కారును తయారు చేసి రోడ్ల మీదకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. నేస్తాలూ.. ఏది ఏమైనా ఈ వాహనం మాత్రం చూసేందుకు వెరైటీగా భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని