నేనో పలుకుల పక్షినోచ్‌!

హాయ్‌ నేస్తాలూ..! బాగున్నారా... నేనో బుజ్జి పిట్టను. మీకు పక్షులంటే భలే ఇష్టం కదా! అందుకే నా విశేషాలన్నీ మీకు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను.

Published : 24 Jul 2023 00:03 IST

హాయ్‌ నేస్తాలూ..! బాగున్నారా... నేనో బుజ్జి పిట్టను. మీకు పక్షులంటే భలే ఇష్టం కదా! అందుకే నా విశేషాలన్నీ మీకు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను. మరి నా పేరేంటి? ఊరెక్కడ? నేనేం తింటాను... ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుంటారా మరి.

నా పేరు స్టార్లింగ్‌ పక్షి. నేను దక్షిణ యూరప్‌లో ఎక్కువగా ఉంటాను. మాలో చాలా రకాలున్నాయి. వీటిలో కొన్ని ఆసియా, ఫసిఫిక్‌ ప్రాంతాల్లోనూ కనిపిస్తుంటాయి. కానీ యూరప్‌లో ఉండే మేం కాస్త ప్రత్యేకం. మేం ఎక్కువగా సముద్రతీర ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడతాం. మేం సాలెపురుగులు, చిన్నచిన్న కీటకాలు, విత్తనాలు, పండ్లను ఆహారంగా తీసుకుంటాం.

గుంపులుగానే వెళ్తాం..!

మేము ఒకచోటు నుంచి ఇంకో చోటుకు వలస వెళ్తూ ఉంటాం. కానీ ఒంటరిగా మాత్రం అస్సలు వెళ్లం. ఎందుకంటే ఇతర పెద్ద పక్షులు మమ్మల్ని వేటాడి చంపేస్తాయని భయం. అందుకని గుంపులుగానే వెళ్తాం. ఒక్కో గుంపులో దాదాపు వెయ్యి నుంచి పదివేల వరకు పక్షులు ఉంటాయి. మా చిన్ని రెక్కలతో శబ్దం చేసుకుంటూ ఎంచక్కా ఎగురుతూ వెళ్తాం. మా సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. మేము గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఎగురుతాం.

మిమిక్రీ చేస్తా...

చూడటానికి చిన్నగా ఉన్నా... మేం చాలా గట్టిగా అరుస్తాం. మీకు ఇంకో విషయం తెలుసా.. ఇతర పక్షుల అరుపులను కూడా మేం అనుకరించగలం. మాలో మగ పక్షులు ఆడవాటికన్నా, కాస్త గట్టిగా అరుస్తాయి. మాకు శిక్షణ ఇస్తే... మీ మనుషుల భాషను కూడా పలకగలం తెలుసా. ఆడపక్షులు గుడ్లుపెట్టి, పొదుగుతాయి. ఈ గుడ్లు కూడా లేత నీలిరంగులో భలే అందంగా ఉంటాయి.

రక్షణ కల్పిస్తే...  

నేను దాదాపు 58 నుంచి 101 గ్రాముల వరకు బరువు తూగుతాను. 19 నుంచి 23 సెంటీ మీటర్ల వరకు పొడవు పెరుగుతాను. మాలో ఆడ, మగ పక్షులు కాస్త వేరు వేరు రంగుల్లో ఉంటాయి. సాధారణంగా అయితే మేం మూడేళ్ల వరకు బతుకుతాం. ఒకవేళ మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, రక్షణ కల్పిస్తే ఇంకా ఎక్కువ కాలం జీవిస్తాం. మాలో ఓ పక్షి ఏకంగా 21 ఏళ్లుకూడా బతికిందట తెలుసా. మరో విషయం ఏంటంటే.. మీ దగ్గర ఉండే మైనాలు మాకు బంధువులేనట. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి... బై... బై...!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని