నేను బాహుబలి మేకను..!

హాయ్‌ నేస్తాలూ.. మనం రోజూ బడికి వెళ్లివచ్చేటప్పుడో, ఇంటి చుట్టుపక్కలో మేకలను, గొర్రెలను చూస్తుంటాం కదా.. పట్టణాల్లో అవి అంతగా కనిపించకపోయినా, వాటి గురించి మాత్రం మీకు తెలిసే ఉంటుంది కదూ!

Updated : 27 Jul 2023 01:00 IST

హాయ్‌ నేస్తాలూ.. మనం రోజూ బడికి వెళ్లివచ్చేటప్పుడో, ఇంటి చుట్టుపక్కలో మేకలను, గొర్రెలను చూస్తుంటాం కదా.. పట్టణాల్లో అవి అంతగా కనిపించకపోయినా, వాటి గురించి మాత్రం మీకు తెలిసే ఉంటుంది కదూ! కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మేకను మాత్రం ఇంతకు ముందు మీరెప్పుడూ చూసి ఉండరు! ఎందుకంటే అసలు మన దేశంలోనే కనిపించదు కాబట్టి.. మరి ఆ మేక విశేషాలేంటో దాని మాటల్లోనే తెలుసుకుందామా..!

నా పేరు ‘మౌంటెన్‌ గోట్‌’. అంటే ‘పర్వత మేక’ అన్నమాట. పశ్చిమ, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాను. అది కూడా రాళ్లు అధికంగా ఉండే కొండ ప్రదేశాల్లోనే నివసిస్తుంటాను. అందుకే నన్ను ‘రాకీ మౌంటెన్‌ గోట్‌’ అని కూడా పిలుస్తుంటారు. నిజానికి మేం అచ్చంగా మేక జాతికి చెందిన జీవులమైతే కాదు. మేం బాహుబలులం. అంటే చాలా దృఢంగా ఉంటాం. మాలో ఆడ మేకల కంటే మగవే మరింత బలంగా ఉంటాయి. కొమ్ములు కూడా మగ మేకలవి కాస్త పెద్దగా ఉంటాయి.

ముద్దుగా.. బొద్దుగా...

మాలో ఆడ మేకలను ‘నానీ’ అని, మగవాటిని ‘బిల్లీ’ అని పిలుస్తుంటారు. మా శరీరం మీద తెల్లని వెంట్రుకలు చాలా దట్టంగా ఉన్నిలా ఉంటాయి. అందుకే మేం చూడటానికి ముద్దుగా, బొద్దుగా కనిపిస్తుంటాం. మాకు ఎలాంటి గాయాలు కాకుండా, అతి చల్లని వాతావరణం నుంచి కూడా ఈ ఉన్నే కాపాడుతుంది. శీతాకాలం ముగిసిన తర్వాత మేం మా శరీరాలను రాళ్లకు, చెట్లకు రుద్దుకుంటూ ఉంటాం. అప్పుడు మా వెంటుక్రలు రాలిపోతాయి. కొంతకాలం తర్వాత వాటిస్థానంలో మళ్లీ కొత్తవి వస్తాయి. మేం పచ్చిగడ్డి, చెట్ల కొమ్మలు, పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకుంటాం.

అలవాటుగా.. అలవోకగా..

మా బరువు 45 నుంచి 140 కిలోల వరకు ఉంటుంది. ఒక మీటరు ఎత్తు, 120 నుంచి 179 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాం. కాలానుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస కూడా వెళ్తుంటాం. శీతాకాలంలో మాత్రం ఎత్తు తక్కువగా ఉండే ప్రదేశాల్లోనే నివసిస్తాం. మేం భారీ జీవులమైనా, నిటారుగా ఉన్న పర్వతాలను సైతం అలవోకగా ఎక్కేస్తాం. దృఢమైన కాళ్లు, మెడ సాయంతో సుమారు 4 వేల మీటర్ల ఎత్తులనైనా సునాయాసంగా చేరుకోగలం. మాలో ఆడవి బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని గంటల్లోనే ఎంత దూరమైనా పరిగెత్తగలవు.  
ప్రస్తుతం మా సంఖ్య సుమారుగా 48 వేల నుంచి 62 వేల మధ్యలో ఉందట. వివిధ కారణాల వల్ల అన్ని జాతుల మాదిరే మా సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. మేం 12 నుంచి 15 ఏళ్ల వరకు బతుకుతాం. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి, జంతుప్రదర్శనశాలల్లోవి మాత్రం దాదాపు 20 ఏళ్ల వరకూ జీవిస్తాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు.. మీకు నచ్చాయనుకుంటా.. ఇక ఉంటా మరి.. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని