దోమల్నీ కరకరలాడించేస్తారు!

దోమలు మనుషుల రక్తం పీలుస్తాయని మీకు తెలుసు కదా. ఇవి ఎన్నో రకాల వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అటువంటి దోమలంటే మనందరికీ భయమే. కానీ ఆఫ్రికా ఖండంలోని ఓ ప్రాంతంలో మాత్రం, ఎంచక్కా దోమల్ని కరకరలాడించేస్తారు.

Updated : 28 Jul 2023 04:29 IST

దోమలు మనుషుల రక్తం పీలుస్తాయని మీకు తెలుసు కదా. ఇవి ఎన్నో రకాల వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అటువంటి దోమలంటే మనందరికీ భయమే. కానీ ఆఫ్రికా ఖండంలోని ఓ ప్రాంతంలో మాత్రం, ఎంచక్కా దోమల్ని కరకరలాడించేస్తారు. అదీ వాటిని బర్గర్‌లా తయారు చేసుకొని! అసలు వారలా ఎందుకు చేస్తున్నారు? వాళ్లకు ఆ అవసరం ఎందుకొచ్చింది? ఇంతకీ దోమల బర్గర్‌ ఎలా ఉంటుందో తెలుసుకుందామా!

ఫ్రికాలోని లేక్‌ విక్టోరియా ప్రాంతంలో జనాలు చేతుల్లో గిన్నెలతో కనిపిస్తారు. వాళ్లు గాల్లోని దోమలను వాటితో పట్టుకుంటారు. అలా పోగు చేసిన దోమల్ని చేతులతో బాగా నొక్కుతారు. అలా నొక్కడం వల్ల అవి ముద్దలా తయారవుతాయి. ఆ దోమల ముద్దనే నూనెలో బాగా వేయిస్తారు. దీన్నే ‘మస్కిటో బర్గర్‌’ అని పిలుస్తారు. ఇది భలే క్రంచీగా ఉంటుందట. అందుకే అక్కడి పిల్లలు వీటిని లొట్టలేసుకుని మరీ తింటారు.

మసాలా అవసరం లేదు!

ఈ దోమల బర్గర్‌ తయారీలో మసాలాలు కానీ కారం కానీ ఏదీ వాడరు. కేవలం నూనెలో వేయిస్తారు అంతే. ఒక్కో బర్గర్‌ తయారీకి దాదాపు అయిదు లక్షల వరకు దోమలు అవసరం అవుతాయి. ఆఫ్రికాలో ఎక్కడ చూసినా దోమలే కనిపిస్తాయి. ముఖ్యంగా వేసవిలో అయితే కుప్పలు తెప్పలుగా.. ఒక్కో గుంపులో కోట్ల కొద్దీ దోమలుంటాయి. దీంతో మస్కిటో బర్గర్‌ తయారీకి దోమల కొరత లేదు!

ప్రొటీనే.. ప్రొటీన్‌!

మసాలాలు వాడకపోయినా దోమల బర్గర్‌లు భలే రుచిగా ఉంటాయట. ఈ బర్గర్‌లో బీఫ్‌లో కంటే కూడా ఏడు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయని పరిశోధకులు తేల్చారు. మరో విషయం ఏంటంటే... ఇవి మిగతా ఆహారం కన్నా చాలా త్వరగా జీర్ణం అవుతాయట. నిజానికి ఈ ప్రాంతంలో పేదరికం ఎక్కువ. ఇక్కడి ప్రజలకు తినడానికి సరైన తిండి కూడా దొరకదు. అందుకే, పోషకాహారలోపంతో బాధపడుతుంటారు. అయితే, ఈ దోమల బర్గర్లు తింటున్నప్పటి నుంచి ఆ సమస్య కాస్త తగ్గిందని చెబుతున్నారు.  

ఆహా.. ఏమి రుచి!

ఎప్పుడైనా పొరపాటున ఒక్క దోమ మన నోట్లోకి పోతేనే మనం అల్లాడిపోతాం కదా..! కానీ ఆఫ్రికాలోని ఈ ప్రాంతం వారు మాత్రం దోమల బర్గర్‌లను లొట్టలేసుకుని మరీ తింటారు. ‘రుచి అచ్చం చికెన్‌లా, వాసనేమో బాదం పప్పులా అనిపిస్తుంది’ అని చెబుతారు. అయినా దోమల్ని తింటే వ్యాధులు రావా... అంటే... నూనెలో బాగా వేయిస్తారు కాబట్టి పెద్ద ప్రమాదం ఏమీ లేదు. వ్యాధి కారక క్రిములన్నీ అప్పటికే చనిపోతాయి అంటున్నారు పరిశోధకులు. అన్నట్లు మన దేశంలోనూ కొన్ని చోట్ల చీమలతో పచ్చడి చేసుకుంటారు తెలుసా! నేస్తాలూ మొత్తానికి ఇవీ మస్కిటో బర్గర్‌ విశేషాలు. భలే వింతగా ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని