‘వారి జీవన విధానం అద్భుతం!’

కళలకు పుట్టినిల్లైన రాజమహేంద్రవరానికి చెందిన ఇషాన్‌ కశ్యప్‌ అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.

Updated : 30 Jul 2023 07:14 IST

కళలకు పుట్టినిల్లైన రాజమహేంద్రవరానికి చెందిన ఇషాన్‌ కశ్యప్‌ అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ పన్నెండేళ్ల బుడతడు మన దేశ ప్రతినిధిగా జపాన్‌ గడ్డపై అడుగు మోపాడు. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకున్నాడు. పదిరోజుల్లో ఎన్నో విషయాలు గ్రహించి తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. తన పర్యటన విశేషాలన్నీ పదిలంగా మనతో పంచుకున్నాడు. మరి ఆ సంగతులేంటో తెలుసుకుందామా.!

ఏటా ఆసియా పసిఫిక్‌ బాలల సదస్సు జరుగుతుంది. దీనికి ప్రపంచం నలుమూలల నుంచి ఎంపికైన 14 సంవత్సరాల లోపు విద్యార్థులు హాజరవుతారు. ఈ సంవత్సరం ఈ సదస్సు జపాన్‌లో నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి 170 మంది బాలలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మన దేశం నుంచి నలుగురికి వచ్చింది. వారిలో రాజమహేంద్రవరానికి చెందిన ఇషాన్‌ కశ్యప్‌ ఒకరు. మరో విశేషం ఏంటంటే... తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైంది ఈ బుడతడు ఒక్కడు మాత్రమే. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే సంస్థ జూనియర్‌ ఛాంబర్‌ ఇంటర్నేషనల్‌ (జేసీఐ) ఈ సదస్సుకు బాలల్ని ఎంపిక చేసింది. దరఖాస్తుల వడపోత అనంతరం ఏడో తరగతి చదువుతున్న ఇషాన్‌ కశ్యప్‌కు అవకాశం దక్కింది. జపాన్‌ దేశపు వారసత్వ సంపద, కళలు, క్రీడలు, సంస్కృతిని తెలుసుకోవడంతోపాటు మనదేశ సంస్కృతి, సంప్రదాయాల్లాంటి విషయాలు ఎంచక్కా వారితో పంచుకున్నాడు.  

ఆచార వ్యవహారాలపై అవగాహన

మన ఇషాన్‌ చిన్నతనం నుంచే అమ్మానాన్న అనుసరిస్తున్న సనాతన సంప్రదాయాన్ని పాటిస్తున్నాడు. నిత్యం సంధ్యావందనం ఆచరిస్తాడు. భారతీయ సంప్రదాయ విలువలు, ఆచార వ్యవహారాలు, పండుగల విశిష్టతపై అవగాహన ఉంది. చక్కగా బ్యాడ్మింటన్‌ ఆడతాడు. నాలుగేళ్లుగా సాధన చేస్తూ పలు పోటీల్లో పాల్గొని పతకాలూ సాధించాడు. చదువులోనూ ముందే ఉంటాడు.  

మాతృభాషపై మమకారం!

జులై 14 నుంచి మొదలైన జపాన్‌ యాత్ర 24 వరకు సాగింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సౌజన్య హెగ్డే ఈ బృందానికి నాయకత్వం వహించింది. వీరు ముంబయి నుంచి హాంకాంగ్‌ మీదుగా జపాన్‌ చేరుకున్నారు. అక్కడ వివిధ సంప్రదాయాలు, క్రీడలు, ఆయా దేశాల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను సంప్రదాయ వస్త్రాలతో ప్రదర్శించారు. తర్వాత రెండు రోజులు వీరికి స్థానిక పాఠశాలల్లో గడిపే అవకాశం ఇచ్చారు. అక్కడి విద్యావిధానం మన ఇషాన్‌కు ఎంతో నచ్చిందట. ముఖ్యంగా మాతృభాషపై వారికి ఎనలేని మమకారం. సాధ్యమైనంత వరకు జపనీస్‌ తప్ప వారు మరే భాషా మాట్లాడరట.

అతిథిగా ఆరురోజులు..

కార్యక్రమంలో భాగంగా ఆరు రోజులు ఓ జపనీస్‌ ఇంటికి అతిథిగా వెళ్లాలి. ఒక్కొక్కరిని ఒక్కో ఇంటికి పంపారు. ఇషాన్‌ కూడా అలా ఓ ఇంటికి వెళ్లాడు. వారంతా చాలా క్రమపద్ధతిలో జీవిస్తారు. వారి జీవన విధానం అద్భుతంగా ఉంటుంది. ఉదయం 6 గంటలకు స్నానం ముగించి అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం 2 గంటలకు భోజనం, సాయంత్రం 6కు భోజనం చేసి రాత్రి తొమ్మిదికల్లా నిద్రపోవాలి. ఇందులో ఎలాంటి మార్పునీ వారు అనుమతించరట. మొదటి రోజు రాత్రి ఇషాన్‌కు నిద్రపట్టక ఇబ్బందిపడ్డాడు. ఏం చేయాలో తోచక గది నుంచి బయటకు వచ్చాడట. ఒక్కసారిగా అందరూ తనతోపాటు వచ్చేసరికి తిరిగి మళ్లీ తనకు కేటాయించిన గదిలో నిద్ర పోవడానికి ప్రయత్నించాడట. కశ్యప్‌ అక్కడ ప్రధానంగా ఓ విషయం గమనించాడు. అదేంటంటే... జపనీయులు ఫోన్‌ ఎక్కువగా మాట్లాడరు. అత్యవసరం అయితే మెసేజెస్‌ మాత్రం చేసుకుంటారు. ఇక టీవీ అయితే పెద్దగా చూడరు. పిల్లలు ఫోన్లో విద్యకు సంబంధించిన వీడియోలు మాత్రమే చూస్తారట. ఆ ఆరు రోజులూ పలు దేశాల నుంచి వచ్చిన విద్యార్థి బృందానికి అక్కడి ప్రముఖ ప్రాంతాలు, ఆలయాలు, ఉద్యానవనాల వంటివి చూపించారు.

‘క్రమశిక్షణ నేర్చుకున్నా’

‘జపాన్‌లో ఉన్న పదిరోజులూ నాకు అద్భుతంగా గడిచింది. ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా జపనీయులు పాటిస్తున్న జీవన విధానం, సమయపాలన వంటి విషయాలను దగ్గర నుంచి చూశాను. నేను కూడా మరింత క్రమశిక్షణ, సంయమనం నేర్చుకున్నా. అక్కడ తెలుసుకున్న అంశాలు, సంప్రదాయాలు, జీవన విధానంపై మా స్నేహితులకు అవగాహన కల్పిస్తా’ అని చెబుతున్నాడు ఇషాన్‌ కశ్యప్‌. మొత్తానికి ఈ బుడతడు మనకు కూడా చాలా విషయాలు చెప్పాడు కదూ! మరి మనమూ క్రమశిక్షణను అలవర్చుకుందామా ఫ్రెండ్స్‌.

వై.సూర్యకుమారి, న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని