ఇది కీరదోస కానే కాదు...!

మామూలుగా అవకాడో అంటే మనకు కాస్త బొంగరం ఆకారంలో ఉన్న పండే గుర్తుకు వస్తుంది. కానీ కీర దోసలా, చిన్నపాటి సొరకాయలా పొడవుగా పెరిగే రకాలూ ఉన్నాయి తెలుసా.

Published : 31 Jul 2023 00:03 IST

చూడ్డానికి కీర దోసలా..కాస్త సొరకాయలా కూడా కనిపిస్తున్న ఇది నిజానికి ఓ అవకాడో! అవాక్కయ్యారు కదూ....! అయినా ఇది నిజంగా నిజం! మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా!!

మామూలుగా అవకాడో అంటే మనకు కాస్త బొంగరం ఆకారంలో ఉన్న పండే గుర్తుకు వస్తుంది. కానీ కీర దోసలా, చిన్నపాటి సొరకాయలా పొడవుగా పెరిగే రకాలూ ఉన్నాయి తెలుసా. వీటిలో రస్సెల్‌ చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇది దక్షిణ ఫ్లోరిడాకు చెందిన రకం.

పీచే పీచు!

మామూలు అవకాడోలతో పోల్చుకుంటే ఈ లాంగ్‌ నెక్‌డ్‌ అవకాడోల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇంకా విటమిన్‌ కె సైతం పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం, విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి తెలుసా!

మండే వేసవిలో...

ఈ లాంగ్‌ నెక్‌ అవకాడోలు సరిగ్గా వేసవిలో కాస్తాయి. ఇవి దాదాపు 33 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. వీటి తొక్క చాలా సున్నితంగా, ప్రకాశవంతంగా ఉంటుంది. పండు లోపలి గుజ్జు ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల మిశ్రమంగా ఉంటుంది. రుచేమో కాస్త ఉప్పగా.. ఇంకాస్త తియ్యగా ఉంటుంది. ఈ లాంగ్‌నెక్‌ అవకాడోలు శాండ్‌విచ్‌లు, సలాడ్ల తయారీకి చక్కగా ఉపయోగపడతాయి.

కొన్ని ప్రాంతాలకే...

ఈ పొడవు మెడ అవకాడోల గురించి 2019లో ఎక్కువ మందికి తెలిసింది. సోషల్‌ మీడియాలో వీటి ఫొటోలు వైరల్‌ కావడమే దీనికి కారణం. రస్సెల్‌ అవకాడోను మొట్టమొదట దక్షిణ ఫ్లోరిడాలోని ఇస్‌లామొర్డాలో అనే గ్రామంలో కనుగొన్నారు. కరేబియన్‌ దీవులు, మధ్య అమెరికాలోనూ అడవుల్లోనూ వీటి ఉనికి ఉంది. కానీ వాణిజ్యపరంగా పండించకపోవడం వల్ల వీటి గురించి మిగతా ప్రపంచానికి పెద్దగా తెలియలేదు. అందుకే వీటిసాగు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. నేస్తాలూ మొత్తానికి ఇవీ పొడవు మెడ అవకాడో విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని