భలే... భలే... నక్షత్ర రేణువులు!

ఆకాశంలో ఉండాల్సిన తారల్లాంటి ఆకారాలు సముద్ర తీరంలో వాలితే ఎలా ఉంటుంది! అవి ఇసుక రేణువంత ఉంటే ఇంకెలా ఉంటుంది!! నిజంగా ఇది సాధ్యం కాదు. కేవలం కథల్లో, కల్పనల్లో మాత్రమే ఇసుక...

Updated : 02 Aug 2023 05:06 IST

ఆకాశంలో ఉండాల్సిన తారల్లాంటి ఆకారాలు సముద్ర తీరంలో వాలితే ఎలా ఉంటుంది! అవి ఇసుక రేణువంత ఉంటే ఇంకెలా ఉంటుంది!! నిజంగా ఇది సాధ్యం కాదు. కేవలం కథల్లో, కల్పనల్లో మాత్రమే ఇసుక... నక్షత్రాల్లా ఉంటుంది అనుకుంటే.. మీరు బీచ్‌లో కాలేసినట్లే!! ఎందుకంటే... ఓ దేశంలోని కొన్ని బీచుల్లో... నక్షత్రాల ఆకారంలో ఉన్న ఇసుక కనువిందు చేస్తోంది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా నేస్తాలూ!

క్షత్రాల్లాంటి ఇసుక రేణువులు జపాన్‌ దీవుల్లో దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఇరుమోటే ఐలాండ్‌లోని బీచ్‌, ఒకినావా బీచ్‌, కైజీ బీచ్‌, టేక్‌టోమి, హటోమా దీవుల్లో ఎక్కువగా ఈ నక్షత్ర ఇసుక కనిపిస్తోంది. ఈ బీచుల్లో ఇసుక ప్రత్యేకంగా తెలుపు రంగులో కనువిందు చేస్తోంది. ఎవరైనా ఆ తెల్లని ఇసుకను అరచేతుల్లోకి తీసుకొని చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే ఆ ఇసుక అచ్చం నక్షత్రాల్లా, స్టార్‌ఫిష్‌ ఆకృతిలో ఉంటుంది.

ఇంతకీ నిజం ఏంటంటే...!

తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు కాదన్నట్లు.. నక్షత్రపు ఆకారంలో ఉన్న ఈ రేణువులన్నీ నిజానికి ఇసుక కానే కాదంట. ఎన్నో పరిశోధనల తర్వాత కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు... కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ప్రోటోజోవాలు సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. అవి క్రమంగా ఇసుకలో కలిసిపోయాయి. అవి మరణించిన తర్వాత వాటిపై ఉండే కాల్షియం పొరలు సముద్ర అలల తాకిడి అరిగిపోయి, స్టార్‌ ఫిష్‌ ఆకారంలోకి మారిపోయాయట. వాటినే ఇసుక అనుకుంటున్నారని పరిశోధకులు తేల్చిచెప్పారు.

తీసుకెళ్తే మంచిదని..!  

ఈ బీచుల్లో జనాలు ఎక్కువగా చెప్పుల్లేకుండా నడవడానికి ఇష్టపడతారట. తర్వాత తమ కాళ్లకు అంటిన నక్షత్రపు ఆకారంలోని ఇసుక రేణువులను సేకరించి ఇంట్లో పెట్టుకుంటారట. ఇలా చేస్తే మంచిదని స్థానికుల నమ్మకం. కానీ అందరూ ఇలా ఇసుకను తీసుకెళ్తే కొంతకాలానికి నక్షత్ర ఇసుక దొరకడం కష్టమవుతుందని అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. స్థానికులు కానీ, విదేశీ పర్యాటకులు కానీ ఎవరైనా సరే.. వీటిలో కొన్ని బీచుల నుంచి ఇసుకను పట్టుకెళ్లకూడదని నిషేధం విధించింది. ఒకవేళ ఎవరైనా ఇసుక తీసుకెళ్తూ పట్టుబడితే శిక్షార్హులు అవుతారట. నేస్తాలూ... మొత్తానికి ఇవీ నక్షత్రపు ఆకారంలో ఉన్న ఇసుక రేణువుల సంగతులు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని