చక్రాల బండి.. దూసుకెళ్తుందండి..!

హలో ఫ్రెండ్స్‌.. మనకు వాహనాలన్నా, వాటిల్లో ప్రయాణాలన్నా భలే ఇష్టం కదూ! కామిక్‌ సిరీస్‌లలో, గ్రాఫిక్‌ సినిమాల్లోనో వింత వింత క్యారెక్టర్లను చూసి మనం విపరీతంగా నవ్వుకుంటాం.

Published : 05 Aug 2023 02:17 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు వాహనాలన్నా, వాటిల్లో ప్రయాణాలన్నా భలే ఇష్టం కదూ! కామిక్‌ సిరీస్‌లలో, గ్రాఫిక్‌ సినిమాల్లోనో వింత వింత క్యారెక్టర్లను చూసి మనం విపరీతంగా నవ్వుకుంటాం. అలాగే, ఓ సంస్థ కూడా ఒక సరికొత్త వాహనాన్ని తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ వాహనమేంటో, దాని విశేషాలేంటో తెలుసుకుందామా..!

ఫిన్లాండ్‌కు చెందిన ‘18వీల్స్‌’ అనే సంస్థ రూపొందించిన ఓ వాహనానికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. అది ‘ఆల్‌ టెర్రయిన్‌ వెహికిల్‌’ అని తయారీదారులు చెబుతున్నారు. అంటే.. కొండలు, రాళ్లు, కర్రలు.. ఇలా ఎటువంటి రహదారుల మీదనైనా సునాయాసంగా ప్రయాణించగలదట.

ఏడాది క్రితమే..

పద్దెనిమిది చక్రాలూ, వాటన్నింటికీ సస్పెన్షన్‌ వ్యవస్థతో ఒకరు మాత్రమే ప్రయాణించగలిగేలా గతేడాది ఓ వాహనాన్ని తయారు చేసిందా సంస్థ. ఎటువంటి రోడ్లపైనైనా ప్రయాణించగలిగేలా దాన్ని తీర్చిదిద్దారు. ఈ వాహనం డిజైనింగ్‌లో పర్యావరణ కోణమూ ఉందట. దీనికి ఏర్పాటు చేసిన 18 చక్రాలూ కాస్త చిన్నగా ఉండటంతో, వాటి వల్ల నేల మీద అచ్చులు పడటం, దెబ్బతినటంలాంటివి ఉండవట. ఆ విధంగా ప్రకృతికి ఎటువంటి హానీ కలగకుండా దీన్ని రూపొందించారు. నమూనాగా ఒక వాహనాన్ని కూడా గతేడాదే ఆ సంస్థ విజయవంతంగా ఉత్పత్తి చేయడంతోపాటు అత్యంత కఠినమైన రోడ్లపైనా నడిపి చూశారు. దారిలో 14 అంగుళాల ఎత్తు వరకూ అడ్డొచ్చే వాటిని సునాయాసంగా దాటేయగలదని తేల్చారు. అయితే, అందుకు సంబంధించిన వీడియో ఇటీవలే సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఆ వాహనాన్ని చూసిన వారంతా ‘భలే ఉందే..’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

త్వరలోనే మార్కెట్లోకి..  

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ‘ఆల్‌ టెర్రయిన్‌ వెహికిల్స్‌’ అన్నింటిలోకెల్లా ఈ వాహన చక్రాలే అత్యంత చిన్నవి. ఈ డిజైన్‌ వెనక ఒక కారణమూ ఉంది నేస్తాలూ.. చిన్న చిన్న చక్రాలు ఉండటం వల్ల ఎగుడుదిగుడుల్లో ఈ వాహనాన్ని నడిపే వారిపైన కుదుపుల భారం అంతగా పడదు. అంటే.. డ్రైవింగ్‌ చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే.. ఈ వాహనం మెట్లనూ అలవోకగా ఎక్కేయగలదట. ఈ ఏడాది అక్టోబరులోగా ఈ మోడళ్లను అక్కడి మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకూ మనం చిన్న చిన్న స్పీడ్‌ బ్రేకర్లు వస్తేనే అంతెత్తున ఎగిరి పడటం చూస్తుంటాం కదా.. ఇటువంటి వాహనాలు మన దగ్గరా వస్తే ఇక ఆ సమస్య నుంచి బయటపడినట్లే. మొత్తానికి ఈ వాహనం చూస్తుంటేనే భలే అనిపిస్తోంది కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని