చల్‌ చల్‌ గుర్రం.. జిగేల్‌ గుర్రం!

చల్‌ చల్‌ గుర్రం... జిగేల్‌ గుర్రమైన నేను అఖల్‌- టెకే జాతికి చెందిన అశ్వాన్ని. తుర్కెమెనిస్తాన్‌ మా స్వస్థలం. ‘గుర్రం మెరుపు వేగంతో పరిగెత్తింది’ అంటారు కదూ! మేమైతే మెరుపులా మెరుస్తాం కూడా! కేవలం అందానికే కాదు.

Updated : 06 Aug 2023 00:58 IST

గుర్రాలకు అందాల పోటీలు పెడితే...
ఆ కిరీటం మాకే దక్కుతుంది...
మా తర్వాతే మిగతా అశ్వాలన్నీ...
అరేబియన్‌ గుర్రమైనా సరే...
మా ముందు చిన్నబోవాల్సిందే!
మా గురించి మరిన్ని విశేషాలు
తెలుసుకోవాలని ఉంది కదూ!
అందుకే అవన్నీ చెప్పిపోదామనే...
ఇదిగో ఇలా పరుగుపరుగున వచ్చా!

ల్‌ చల్‌ గుర్రం... జిగేల్‌ గుర్రమైన నేను అఖల్‌- టెకే జాతికి చెందిన అశ్వాన్ని. తుర్కెమెనిస్తాన్‌ మా స్వస్థలం. ‘గుర్రం మెరుపు వేగంతో పరిగెత్తింది’ అంటారు కదూ! మేమైతే మెరుపులా మెరుస్తాం కూడా! కేవలం అందానికే కాదు. వేగానికి కూడా మేం పెట్టింది పేరు. మిగతా గుర్రాలతో పోల్చుకుంటే మేం చాలా వేగంగా పరిగెత్తగలం. అంతేనా... తెలివితేటల్లోనూ మేమే మేటి.. మాకు మేమే సాటి. మాకు లేదు ఏ పోటీ!

బంగారం ముద్దు పేరు!

మెరిసే మా రూపం వల్ల మమ్మల్ని ముద్దుగా ‘బంగారు గుర్రాలు’ అని పిలుస్తారు. చైనీయులైతే ‘స్వర్గపు గుర్రం’ అని కీర్తిస్తారు. ప్చ్‌! అయినా ఎవరు ఎంత పొగిడినా ఏం లాభం! ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద మా జాతి గుర్రాలు  6,600 మాత్రమే ఉన్నాయట. అందులోనూ తుర్కెమెనిస్తాన్‌లోనే ఎక్కువగా ఉన్నాం. యూరప్‌, ఉత్తర అమెరికా, చైనాలోనూ కొద్ది సంఖ్యలో ఉన్నాం. మేం ఎక్కువగా వ్యాధుల బారిన పడుతుంటాం. మా సంఖ్య తక్కువగా ఉండటానికి ఇది కూడా ఓ కారణం. 

మిలమిల మెరుస్తాం...

పగటి పూట మేం తెగ మెరుస్తాం తెలుసా. సూర్యకాంతి మా మీద పడగానే మా ఒళ్లంతా పట్టులా మెరుస్తుంది! ఈ మెరుపే మాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. మేం సాధారణంగా 144 నుంచి 163 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాం. బరువేమో 430 నుంచి 500 కిలోల వరకు తూగుతాం. మేం ఎక్కువగా నలుపు, బూడిద, తెలుపు, గోధుమ రంగుల్లో కనువిందు చేస్తాం. మా మెడ కూడా మిగతా గుర్రాలతో పోల్చుకుంటే పొడవుగా, బలంగా ఉంటుంది. మేం ఎడారి వాతావరణానికి బాగా అలవాటుపడ్డాం. అందుకే మాకు ఎక్కువ నీరు, ఎక్కువ ఆహారం అవసరం లేదు. గతంలో మా జాతి గుర్రం ఒకటి 378 కిలోమీటర్లు ఎడారిలో ఏకధాటిగా మూడు రోజులు ప్రయాణించిందట. అప్పుడు అది చుక్క నీరు కూడా తీసుకోలేదట తెలుసా.!

జంపింగ్‌ జపాంగ్‌...!

మేం కేవలం పరుగులోనే కాదు... ఎక్కువ దూరం, ఎక్కువ ఎత్తు దూకడంలోనూ గ్రేటే! అందుకే గుర్రాల పోటీల్లో ఎక్కువగా మేమే గెలుస్తుంటాం. మా చిత్రాలతో అజర్‌బైజాన్‌, తుర్కెమెనిస్తాన్‌, కజకిస్తాన్‌, రష్యా లాంటి దేశాలు స్టాంపులు కూడా విడుదల చేశాయి. తుర్కెమెనిస్తాన్‌ కరెన్సీ మీద కూడా మా బొమ్మ ఉంది తెలుసా... నేస్తాలూ... మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటామరి బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు